పూజగది ఎక్కడ, ఎలా ఉండాలంటే..

వాస్తు శాస్త్రం ప్రకారం పూజగదిని ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ధ్యానం, పూజ ప్రశాంతంగా సాగిపోతాయి.

Updated : 24 Jan 2024 18:25 IST

వాస్తు శాస్త్రం ప్రకారం పూజగదిని ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ధ్యానం, పూజ ప్రశాంతంగా సాగిపోతాయి. అంతేకాదు, ఇంట్లో ప్రసరించే సూర్యుడి లేలేత కిరణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎక్కువ స్థలం ఉన్నట్లయితే ఇంటి మధ్యలో పూజగది ఉంటే మంచిది. స్థలం లేకుంటే వంటింట్లోనే ఈశాన్య దిక్కున పూజామందిరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితిలో పడక గదుల్లో పూజగది ఉండకూడదు. పూజ గదిలో విగ్రహాలను ఈశాన్యం, తూర్పు లేదా పడమర దిక్కున పెట్టుకోవచ్చు. దీనికి కారణం సూర్యకిరణాలు ఉదయం ఈశాన్య, తూర్పు దిక్కు నుంచి, సాయంత్రం పడమర నుంచి ప్రసరిస్తాయి. ఇవి విగ్రహాల మీద పడి భక్తి భావనను పెంపొందిస్తాయి. విగ్రహాలను ఉత్తర దిక్కున పెడితే ప్రార్థించేవారు దక్షిణ ముఖంగా కూర్చోవలసివస్తుంది. ఇది వాస్తు రీత్యా మంచిది కాదు.

దేవుడిగదిలో విరిగిన విగ్రహాలు, చిరిగిన చిత్రపటాలు ఉండకూడదు. అలాగే విగ్రహాలను ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టకూడదు. మనం విగ్రహాలను చూస్తూ పూజించాలే గానీ అవి ఒకదాన్ని మరొకటి చూస్తున్నట్టుగా ఉంచకూడదు. పూజ సామాన్లను గదిలో ఆగ్నేయ దిక్కున భద్రపరచాలి. అవి విగ్రహాలకు, మనం కూర్చోవడానికి అడ్డు లేకుండా చూడాలి. కొందరు మరణించిన పెద్దల మీది గౌరవ భావంతో వారి పటాలు పూజగదిలో పెడుతుంటారు. అది సరి కాదు. అవి మన దృష్టిని మరల్చడమే కాదు.. బాధాకరమైన విషయాలను జ్ఞాపకం తెచ్చే అవకాశముంది. పూజగదిలో బంగారం, ధనం లాంటి విలువైన వస్తువులను దాచకూడదు. పూజగదిని సదా పరిశుభ్రంగా ఉంచాలి. ఆ గదికి రెండు తలుపులున్న ద్వారాన్నే ఎంచుకోవాలి. గడప తప్పనిసరిగా ఉండాలి. గోడలకు తెలుపు, లేత పసుపు, లేతనీలం లాంటి లేత రంగులే వేయాలి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉండి దేవుడిపై దృష్టి నిలుస్తుంది. 

నూతి శివానందం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని