అభిషేకం.. యాగం.. అంతరార్థం

యజ్ఞయాగాది క్రతువుల్లో లోకకల్యాణం దాగి ఉంది. ఆలయాల్లో ప్రతిష్ఠించిన దేవుళ్ల విగ్రహాలు సామాన్యమైనవి కావు.

Published : 18 Jan 2024 00:08 IST

జ్ఞయాగాది క్రతువుల్లో లోకకల్యాణం దాగి ఉంది. ఆలయాల్లో ప్రతిష్ఠించిన దేవుళ్ల విగ్రహాలు సామాన్యమైనవి కావు. ఆ ప్రతిమల్లో ఆయా దేవుళ్ల విశ్వకారక దివ్యశక్తి నిబిడీకృతమై ఉంది. ఆ భావనతో మంత్రయుక్త విగ్రహాన్ని అభిషేకిస్తే అది విశ్వానికి పుష్టినిస్తుంది. అదే విధంగా హోమగుండాల్లో సమిధలుగా వేయటం కూడా విశ్వకల్యాణం కోసమే. భగవంతుడికి ఏది సమర్పిస్తే అది వేయింతలుగా తిరిగి వస్తుంది. వేళ్లకు నీళ్లు పోస్తే చెట్టంతా పుష్టిగా ఎదిగినట్లు, సృష్టికి మూలకారకుడైన ఆ పరమాత్మకు అర్పించిన ఫలంగా జగమంతా సుభిక్షంగా వర్ధిల్లుతుంది. జనావళికి సమస్త దుఃఖాల నుంచి విముక్తి కలుగుతుంది. ఉదాహరణకు శ్రీకృష్ణుడు పాండవుల ఇంట అక్షయ పాత్రలోని ఒక్క మెతుకును నోట్లో వేసుకోగానే, దుర్వాస మునితో సహా వేలాదిమంది రుషుల ఆకలి తీరి భుక్తాయాసంతో వెనుతిరిగారు. దేవాలయాల్లో ప్రతిష్టించిన ప్రతిమలు కూడా అంతే శక్తిమంతమైనవి. మన మహర్షులు దివ్యదృష్టితో, లోకకల్యాణార్థం ఈ అభిషేకాలను, యజ్ఞయాగాది సంప్రదాయాలను ప్రవేశ పెట్టారు. వీటిలో ఎంతో పరమార్థం ఉంది. ప్రత్యక్షంగా దానధర్మాలు, పుణ్యకార్యాలు ఎంత విశేషమైనవో, పారమార్థిక కోణంలో ఆలోచిస్తే ఆలయాల్లోని ఈ ఆచారాలు కూడా అంతే విశేషమైనవి. అలా అని ఆలయాల వద్ద ఉన్న బీదసాదలను పట్టించుకోకుండా కేవలం పాలను, పండ్లను అభిషేకాలు, అర్పణలకే పరిమితం చేయమని మన సనాతన ధర్మం ఎన్నడూ చెప్పలేదు. దానధర్మాలు ఎంత పుణ్యాన్ని ఇస్తాయో.. అంతరార్థం తెలుసుకుని ఆచరిస్తే అభిషేకాలూ అంతే ఫలితాన్నిస్తాయి.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు