దేవుడు నైవేద్యం ఆరగిస్తాడా?

పూజలో మనం భక్తితో నివేదించిన పదార్థాలను ఆ భగవంతుడు ఆరగిస్తాడా? అని చాలామందికి సందేహం కలుగుతుంది. కానీ మన పూజలు, వత్రాలు మూఢనమ్మకాలు కావని పరమభక్తులు నిరూపించారు.

Published : 01 Feb 2024 00:13 IST

పూజలో మనం భక్తితో నివేదించిన పదార్థాలను ఆ భగవంతుడు ఆరగిస్తాడా? అని చాలామందికి సందేహం కలుగుతుంది. కానీ మన పూజలు, వత్రాలు మూఢనమ్మకాలు కావని పరమభక్తులు నిరూపించారు. అందుకే మన ఆధ్యాత్మికవేత్తలు నైవేద్యానికి సంబంధించి వివరణ ఇచ్చారు. భగవంతుడు తనకు నివేదించిన పదార్థాలను ఆరగించే విధానాన్ని..

కపిత్థస్య ఫలే సారం యథా కుంజర భక్షణే
తథా నైవేద్య సారం తు దేవో గృహ్ణాతి మంత్రః

అంటూ చెప్పారు. ఏనుగు వెలగపండుని మింగి, దాని లోపలి సారాన్ని స్వీకరించినట్లు నైవేద్య సారాన్ని మంత్రప్రభావంతో ఆ దేవుడు గ్రహిస్తాడని భావం. తుమ్మెద కుసుమాల వాసన చూసి.. వాటిలోని తేనెని తాగినట్లు, సూర్యుని కిరణాల్లోని నీటిని మబ్బు గ్రహించి వర్షించినట్లు.. మనం నివేదించిన పదార్థాలను మనం కూడా గ్రహించలేని రీతిలో ఆయన స్వీకరిస్తాడని రుషులు తెలియజేశారు. అందువల్లే పరమాత్మకు నివేదించిన తర్వాత ఆ పదార్థం పరమపవిత్రమై ప్రసాదంగా మారుతుంది. మన నివేదనలను భగవానుడు నేత్రాలతో స్వీకరిస్తాడట. అందుకే ఆలయంలో పరమాత్మకు సమర్పించే పదార్థాలను ఎవరినీ చూడనివ్వరు. మనం ఆరాధించే, అర్చించే దేవతా స్వరూపాన్ని సజీవమూర్తిగా భావించుకుని నివేదించాలి. అప్పుడే ఆ ప్రతిమ ఆ నివేదనను ఆరగిస్తుంది. అతిథికో, ఆత్మీయులకో పెడుతున్నట్లుగా అనుభూతి చెందినప్పుడే ఆ ఉపచారానికి అర్థం పరమార్థం. భక్తిశ్రద్ధలతో కూడిన ఉపచారాలే సత్ఫలితాలను ఇస్తాయి. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వరంలో తాను ఆరాధించే కాళికాదేవిని ఓ చిన్మయమూర్తిగానే భావించారు. తాను స్వయంగా వండి అమ్మవారికి నివేదించేవారు. ‘అమ్మా! తిను’ అంటూ కన్నతల్లికో, బిడ్డకో తినిపించినట్లు ప్రేమతో తినిపించేవారు. అంత ప్రియంగా నివేదిస్తే.. ఇక దైవం ఆరగించకుండా ఉండటం సాధ్యమా!

చక్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని