కృష్ణుడు కొంగ, దూడలను ఎందుకు సంహరించాడు?

శ్రీకృష్ణుడి అవతారాన్ని, ఆయన లీలల్ని అర్థం చేసుకోవటం అంత సులువు కాదు. ఇతర అవతారాల్లో రాక్షస సంహారమే ప్రధాన లక్ష్యం. కానీ కృష్ణావతారంలో రాక్షసవధ ఆయన లీలలో ఓ చిన్న అంశమే.

Published : 22 Feb 2024 00:09 IST

శ్రీకృష్ణుడి అవతారాన్ని, ఆయన లీలల్ని అర్థం చేసుకోవటం అంత సులువు కాదు. ఇతర అవతారాల్లో రాక్షస సంహారమే ప్రధాన లక్ష్యం. కానీ కృష్ణావతారంలో రాక్షసవధ ఆయన లీలలో ఓ చిన్న అంశమే. బాల్యం నుంచి అంత్యం వరకు స్వామి ఒక్కో దశలో ఒక్కో విధంగా తన లీలల్ని కొనసాగించాడు. లేగలను, గోప బాలురను అపహరించిన బ్రహ్మదేవుడికి బుద్ధి చెప్పడానికి తానే లేగలు, గోపబాలురుగా మారిన కరుణాంతరంగుడు. అలాంటి దామోదరుడు దయ లేకుండా కొంగ, దూడలను ఎందుకు చంపాడని కొందరికి ఆశ్చర్యం కలుగుతుంది. అవి మామూలు మూగజీవాలు కాదు. మాయారూపం ధరించిన రాక్షసులు. కొంగగా వచ్చినవాడు బకాసురుడు. బకం అంటే కొంగ. తెల్లటిరూపంతో అమాయకంగా కనిపిస్తుంది. ఒక్క కాలు మీద నిలబడుతుంది. ఏమీ చేయదని నమ్మి చెంతకు చేరిన చేపల్ని చటుక్కున నోట కరచుకుని చెట్టుమీదకు ఎగిరిపోతుంది. కంసుని ప్రణాళిక ప్రకారం చిన్నికృష్ణుణ్ణి చంపాలని పెద్దకొంగ రూపంలో వచ్చాడు బకాసురుడు. కానీ ఆ అవతారమూర్తి బకాసురుడి గొంతులో అగ్నిగా మారి, ఆ కార్చిచ్చుతో అతడే హతమారేలా చేశాడు. బకాసురుడంటే ఎవరో కాదు మనలోని దంభం లేదా కపటస్వభావం. తేనెపూసిన కత్తిలా ఉండటాన్ని ‘దంభం’ అంటారు. దంభాన్ని దామోదరుడు సహించడని ఆ లీలతో నిరూపించాడు. ఇక దూడగా వచ్చిన వాడు వత్సాసురుడు. బృందావనంలో ఆవుల మందలోకి లేగదూడగా వచ్చాడతడు. గోపబాలురు కొత్తగా వచ్చిన దూడ విషయం బాలకృష్ణుడి చెవిన వేశారు. అంతే.. తాండవకృష్ణుడు దాని తోక పట్టుకుని గిరగిరా తిప్పి వెలగచెట్టుకేసి కొట్టాడు. అప్పుడు దూడ కన్నుమూసింది, వెలగచెట్టూ కూలిపోయింది. లేగదూడ నుంచి వత్సాసురుడు  వెలుపలికి వచ్చాడు. దూడ రుచికి, వెలగచెట్టు వాసనకు ప్రతీకలని చెబుతారు. దైవానికి, ఆధ్యాత్మిక భావనలకు మనిషిని దూరం చేసేవి రుచి, వాసన. ఇంద్రియాలు ఈ రెంటికీ వశమైతే అక్కడ పారమార్థికతకు చోటుండదు. శ్రీకృష్ణలీలల్లోని అంతరార్థమిదే!

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు