భగవంతుణ్ణి ఏమడగాలి?

వివేకానంద యుక్త వయసులో ఉండగా తండ్రి విశ్వనాథ దత్తా హఠాత్తుగా కన్నుమూశారు. ఒక్కసారిగా కుటుంబం పేదరికంలో కూరుకుపోయింది. పెద్ద కుమారుడైన వివేకానందే ఆధారమయ్యాడు.

Published : 29 Feb 2024 00:12 IST

వివేకచూడామణి

వివేకానంద యుక్త వయసులో ఉండగా తండ్రి విశ్వనాథ దత్తా హఠాత్తుగా కన్నుమూశారు. ఒక్కసారిగా కుటుంబం పేదరికంలో కూరుకుపోయింది. పెద్ద కుమారుడైన వివేకానందే ఆధారమయ్యాడు. పట్టభద్రుడైనా ఆయనకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో గురువు పరమహంస వద్దకు వెళ్లి బాధ పంచుకున్నాడు. అప్పుడాయన సమీపానే ఉన్న దక్షిణేశ్వర కాళీ ఆలయం వైపు చూపిస్తూ ‘ఇవాళ మంగళవారం, ఈ రోజున అమ్మవారిని ఏది కోరితే అది అనుగ్రహిస్తుంది. వెళ్లి ప్రార్థించు’ అన్నారు. ఆ సాయంత్రం వివేకానంద మందిరానికి వెళ్లి అమ్మను ప్రార్థించారు. తిరిగొచ్చాక రామకృష్ణులు ‘అమ్మ ఏమంది?’ అనడిగారు. ‘అరే! అడగటం మర్చిపోయానే’ అని వివేకానంద మథనపడ్డారు. ‘సరే. మళ్లీ వెళ్ల్లు’ అన్నారు పరమహంస. ఈసారీ అదే పరిస్థితి. మూడోసారి స్వామీజీ కాళీ ఆలయానికి వెళ్లి వచ్చాక.. ఎలాంటి అలజడీ లేకుండా ప్రశాంతంగా కనిపించారు. పరమహంసను ఉద్దేశించి ‘జగన్మాతను డబ్బు కావాలని ఎలా అడగగలను? అలా చేస్తే.. మహారాజు దగ్గరకు వెళ్లి గుమ్మడికాయ అడిగినట్లు ఉంటుంది! నిస్వార్థ ప్రేమతో, భక్తితో అమ్మను అర్థం చేసుకునే శక్తిని ఇమ్మని ప్రార్థించాను’ అన్నారు వివేకానంద. కానీ అమ్మవారి కృప, గురువుగారి ఆశీస్సుల ఫలంగా అప్పటి నుంచి వివేకానంద కుటుంబానికి ఎలాంటి లోటూ రాలేదు. అవసరమైన వసతులకు ఇబ్బంది కలగలేదు.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని