దేవుడు చేసే గమ్మత్తు!

దేవుడు ఎవరిని, ఎప్పుడు, ఎలా ఉపయోగించుకుంటాడో మన ఊహకు అందదు. మనుషులే కాదు.. పశుపక్ష్యాదుల ద్వారానూ మనకు అవసరమైనవి సమకూరుస్తాడు. అసాధ్యమైనవి సుసాధ్యం చేస్తాడు.

Published : 07 Mar 2024 00:11 IST

దేవుడు ఎవరిని, ఎప్పుడు, ఎలా ఉపయోగించుకుంటాడో మన ఊహకు అందదు. మనుషులే కాదు.. పశుపక్ష్యాదుల ద్వారానూ మనకు అవసరమైనవి సమకూరుస్తాడు. అసాధ్యమైనవి సుసాధ్యం చేస్తాడు. ఏలియా అనే భక్తుడు ప్రాణభయంతో దాగినప్పుడు.. అతని ఉనికి గురించి ఎవరూ తెలుసుకోలేకపోయారు. కానీ ఆ రహస్య ప్రదేశానికి దేవుడు కాకులతో ఆహారం పంపాడు. ఆజానుబాహుడైన గొల్యాతు లాంటి శూరుణ్ణి చంపడానికి ఒక చిన్న రాతిని మాత్రమే ఉపయోగించాడు. ఓ బాలుని వద్దనున్న రెండు చేపలు, ఐదు రొట్టెలతో వేలాదిమంది ఆకలి తీర్చాడు. మోషే చేతిలోని మామూలు కట్టెతో అద్భుతం చేశాడు. బిలామ్‌ అనే ప్రవక్తకు బుద్ధి చెప్పేందుకు గాడిదకు వాక్కునిచ్చాడు. మూర్ఖుడైన యోనా అనే ప్రవక్తకు ఒక కీటకంతో బుద్ధి నేర్పాడు. ఇజ్రాయెల్‌లో ప్రవేశించబోయిన శత్రువులను  తరిమేందుకు కందిరీగలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇంగ్లండ్‌ అధీనంలో ఉన్న స్కాట్లండ్‌ వాసులు స్వాతంత్య్రం కోసం యుద్ధాలు చేశారు. రాబర్ట్‌ బ్రూస్‌.. తాను దేశ పగ్గాలు చేపట్టి సేవ చేయాలనుకున్నాడు. అతడు వీరుడే గాక క్రీస్తును నమ్మిన విశ్వాసి. ఒకసారి సైన్యంతో వెళ్తూ తోవ తప్పి ఒంటరివాడయ్యాడు. శత్రువులు వెంటాడుతుంటే దైవాన్ని ప్రార్థిస్తూనే పరిగెట్టాడు. చివరికి అలసిపోయి కనిపించిన గుహలో దాగాడు. అటుగా వచ్చిన శత్రు సైనికులు గుహలో ఉన్నాడేమో చూడాలనుకున్నారు. కానీ ద్వారమంతా అల్లుకున్న సాలీడు గూడును చూసి, తాము ప్రవేశిస్తే అది విచ్ఛిన్నమౌతుందని వెనుతిరిగి వెళ్లిపోయారు. తనకు దేవుడు చేసిన సాయానికి మోకరిల్లాడు రాబర్ట్‌. అక్కడ క్షణాల్లో గూడు అల్లేలా సాలీడును ఆజ్ఞాపించింది దేవుడే. ఇలా ఏసుప్రభువు ఒనగూర్చిన మహత్కార్యాలు ఎన్నో!
ఎమ్‌.ఉషారాణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని