మహాభారతం ఎందుకు పంచమవేదం?

పైకి అన్నదమ్ముల కథగానే కనిపించినా.. మన అభ్యుదయానికి అవసరమైన సర్వధర్మాలకూ ఆధారం మహాభారతం.

Updated : 14 Mar 2024 03:33 IST

పైకి అన్నదమ్ముల కథగానే కనిపించినా.. మన అభ్యుదయానికి అవసరమైన సర్వధర్మాలకూ ఆధారం మహాభారతం. అందుకే భారతంలో లేనిది లోకంలో ఉండదని, లోకంలో ఉన్నదంతా ఆ ఇతిహాసంలో ఉందని పండితులు తేల్చి చెప్పారు. సుమారు 300 పాత్రలతో ఉత్కంఠభరితంగా సాగిన భారతాన్ని మించిన కథ ప్రపంచంలోనే లేదు. సకల ధర్మాలకూ ఆధారం వేదం. ఇందులో కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ భాగాలున్నాయి. వేదాలు ప్రబోధించిన అంశాలన్నీ భారతంలో కనిపిస్తాయి. కౌరవ, పాండవ గాథను ఆధారంగా చేసుకొని వేద ధర్మాన్ని, వేదాంత విజ్ఞానాన్ని అందించాడు వ్యాసమహర్షి. కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా ఉండటం ఇందులోని విశిష్టత. ఇలా నాలుగు వేదాల్లోని ధర్మసారాన్ని సామాన్యులకు అందించటం వల్ల మహాభారతం పంచమవేదంగా ప్రసిద్ధమైంది. వైదికయజ్ఞ విశేషాలు, భగవద్గీత, విదురనీతి, యక్షప్రశ్నలు.. ఇలా అనేక విశేషాలను గుదిగుచ్చిన గజమాల ఆ గ్రంథం. మహాభారతాన్ని అర్థం చేసుకోలేనివారు వేదాలను గ్రహించలేరని ఆదిపర్వంలో స్పష్టం చేశారు. ‘ధర్మార్థకామమోక్షాలనే నాలుగు పురుషార్థాల్లోని అంశాలన్నీ అందులోనే ఉన్నాయి’ అన్నాడు వ్యాసుడు. ఇక ఆదికవి నన్నయ్య- వేదవ్యాసుడి మహాభారతం ధర్మతత్త్వజ్ఞులకు ధర్మశాస్త్రం, ఆధ్యాత్మవేత్తలకు వేదాంతం, న్యాయ కోవిదులకు నీతిశాస్త్రం, కవులకు మహాకావ్యం- అని పండితులంతా వేనోళ్ల మెచ్చుకుంటున్నారు- అంటూ మహాభారతం గొప్పతనాన్ని ప్రశంసించాడు.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని