సంపదలెలా ఖర్చుపెట్టాలంటే...

హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టేస్తుంటే విష్ణువు వరాహావతారం ఎత్తి సంహరించాడు. హిరణ్యం అంటే బంగారం, అక్షుడంటే ఇంద్రియాల వలలో చిక్కుకున్నవాడు అనేది సామాన్యార్థం.

Published : 02 Feb 2023 00:30 IST

హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టేస్తుంటే విష్ణువు వరాహావతారం ఎత్తి సంహరించాడు. హిరణ్యం అంటే బంగారం, అక్షుడంటే ఇంద్రియాల వలలో చిక్కుకున్నవాడు అనేది సామాన్యార్థం. హిరణ్యమంటే ప్రకృతి, భూదేవి కూడా. పరమాత్మ ప్రకృతి అనే బంగారపు తొడుగుతో కప్పి ఉన్నాడని ఇంకో అర్థం. ఇంద్రియాల తొడుగును తొలగించుకుంటేనే భగవంతుణ్ణి దర్శించగలం. భూమిని చాపలా చుడుతున్నాడు అనడంలో ప్రకృతి వనరులన్నీ తానొక్కడే అనుభవించాలి, అంతా తనకే కావాలన్న దురాశ స్పష్టమవుతోంది. ఇక వరాహమంటే చంపనిది, చంపేది అని రెండు అర్థాలున్నాయి. వరాహ రూపుడైన విష్ణువు దురాశలను నశింపచేసి భగవత్‌ చింతనను మాత్రం సజీవంగా కొనసాగేలా చూస్తాడు. ఎప్పుడైతే ఇంద్రియ వాసనలు నశిస్తాయో అప్పుడు జీవన్ముక్తికి మార్గం సులువవుతుంది. లభించిన సంపదను, హిరణ్యాన్ని ధర్మమార్గంలో అనుభవిస్తూ, కొంత భాగాన్ని దైవ కార్యాలకు వినియోగించాలనేది అంతరార్థం. అది అహం లేకుండా అంకిత భావంతో ఉండాలి. అదే నిజమైన సాధన. దేవతలకు నగలు, కిరీటాలు, తులాభారాలు సమర్పించడం వెనుక వరాహస్వామి అదృశ్యహస్తం ఉంటుందంటారు.

శ్రావణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని