TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్‌ తుది ఫలితాలు విడుదల

తెలంగాణలో కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామక తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను TSLPRB విడుదల చేసింది.

Updated : 04 Oct 2023 22:27 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామక తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ  పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ పోలీస్‌ నియామక బోర్డు(TSLPRB) విడుదల చేసింది. పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్లు, రవాణా, ఆబ్కారీ శాఖలకు సంబంధించి మొత్తం 16,604 పోస్టులకు గాను 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలను TSLPRB వెబ్‌సైట్‌లోని వ్యక్తిగత లాగిన్‌లలో పొందుపరిచారు. అలాగే, అభ్యర్థుల కటాఫ్‌, ఎంపికైన అభ్యర్థుల జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అయితే, పోలీస్ రవాణా సంస్థలో 100 డ్రైవర్ పోస్టులతోపాటు అగ్నిమాపకశాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను మాత్రం తర్వాత వెల్లడిస్తామని బోర్డు తెలిపింది. కోర్టులో వ్యాజ్యాలు కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

కానిస్టేబుల్‌ సెలక్షన్‌ వివరాల కోసం క్లిక్‌ చేయండి

 

కటాఫ్‌ మార్కులు, ఎంపికైన అభ్యర్థుల వివరాలివే..

తుది ఎంపిక జాబితాలో ఎంపికైన అభ్యర్థుల కోసం వ్యక్తిగత లాగిన్‌లలో అటెస్టేషన్ పత్రాలను ఈ నెల 7-10 తేదీ లోపు అందుబాటులో ఉంచనున్నారు. వాటిని డిజిటల్‌గానే పూరించి అనంతరం డౌన్‌లోడ్‌ చేసుకొని పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోను అతికించి మూడు సెట్లపై గెజిటెడ్‌ సంతకాలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆయా పత్రాలను ఈ నెల 12, 13 తేదీల్లో నిర్ణీత కార్యాలయాల్లో సమర్పించాలని తెలిపారు. సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ అభ్యర్థులు తాము ఎంపికైన జిల్లా ఎస్పీ కార్యాలయం లేదా కమిషనరేట్లలో, ఎస్పీఎఫ్, ఎస్ఏఆర్-సీపీఎల్, రవాణా కానిస్టేబుల్(ప్రధాన కార్యాలయం) అభ్యర్థులు హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో,  టీఎస్ఎస్పీ, ఐటీ అండ్ కమ్యూనికేషన్, ఫైర్‌మెన్‌, ఎక్సైజ్, వార్డర్లు, రవాణా కానిస్టేబుల్(ఎల్సీ) అభ్యర్థులు సంబంధిత పోలీస్ జిల్లా లేదా కమిషనరేట్ కార్యాలయంలో సమర్పించాలని ఓ ప్రకటనలో పేర్కొంది. 

కాగా,  తుది ఎంపిక ప్రక్రియపై అభ్యంతరాల నివృత్తికి పోలీస్‌ నియామక బోర్డు అవకాశం కల్పించింది. ఈనెల 5న ఉదయం 8 గంటల నుంచి 7న సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో వ్యక్తిగత లాగిన్ ఐడీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ స్థానికులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 1000, ఇతరులు రూ. 2వేలు చెల్లించాల్సి ఉంటుంది.  అలా దరఖాస్తు చేసిన వారికి కొద్ది రోజుల్లో ఆన్లైన్లోనే తిరుగు సమాధానం ఇవ్వనున్నారు. ఈ విషయంలో ఎలాంటి వ్యక్తిగత వినతులను నేరుగా ఇవ్వడాన్ని అంగీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని