ప్రిలిమినరీకి ప్రిపరేషన్‌

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష  జూన్‌ 5, 2022న జరగబోతోంది. ఈ ఏడాది ఇది ప్రత్యేకంగా ఉండబోతోంది. అవేేమిటో తెలుసుకుని అందుకు అనుగుణంగా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటే విజయం దిశగా దూసుకువెళ్లొచ్చు!

Published : 27 Apr 2022 01:59 IST

సివిల్స్‌ 2022

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష  జూన్‌ 5, 2022న జరగబోతోంది. ఈ ఏడాది ఇది ప్రత్యేకంగా ఉండబోతోంది. అవేేమిటో తెలుసుకుని అందుకు అనుగుణంగా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటే విజయం దిశగా దూసుకువెళ్లొచ్చు!

యూపీఎస్‌సీ ఈ ఏడాది 1011 ఖాళీలను ప్రకటించింది. గత ఏడాది కంటే 300 ఎక్కువగా ఉన్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే 2021లో ప్రకటించిన ఖాళీలు చాలా తక్కువ. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష నుంచి రైల్వే సర్వీసెస్‌ను తొలగించడం వల్ల ఇలా ఖాళీల సంఖ్య తగ్గింది. ఈ సంవత్సరం వాస్తవంగా ప్రకటించిన ఖాళీలు 861. ఆ తర్వాత రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌కు చెందిన 150 ఖాళీలను ప్రభుత్వం జోడించడంతో మొత్తం 1011 ఖాళీలు ఏర్పడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే ఖాళీలు 42 శాతం పెరిగాయి.

మెయిన్స్‌కు అర్హులయ్యే అభ్యర్థులు పెరిగారు: గత కొన్నేళ్లుగా ప్రిలిమినరీ అనేది సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ప్రధాన అవరోధంగా మారింది. ఎంతోమంది అభ్యర్థులు ఎన్నోసార్లు ప్రయత్నించి ప్రిలిమినరీ స్థాయిలోనే విఫలమయ్యారు. దీనికి ఎన్నో కారణాలు ఉండి ఉండొచ్చుగానీ ముఖ్యమైంది మాత్రం తగ్గిన ఖాళీల సంఖ్యే. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించే అభ్యర్థుల సంఖ్య, ఖాళీల సంఖ్య కంటే 13 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 2021లో 712 ఖాళీలు ఉంటే ప్రిలిమినరీ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు 9,214 మంది ఉన్నారు. ఈ ఏడాది 1,011 ఖాళీలకు 13,250 మంది మెయిన్‌ పరీక్షకు ఎంపిక కావచ్చని అంచనా. 4000 మంది అభ్యర్థులు పెరగడమంటే... అవకాశాలూ పెరిగినట్టే!

ఈసారి అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. 5.5 లక్షలమందికి పైగా పరీక్ష రాయొచ్చన్న అంచనాలతో ప్రిలిమినరీ స్థాయిలో పోటీ అధికంగానే ఉండే అవకాశం ఉంది.

ఎంపిక విధానం ఎప్పటిలానే: షార్ట్‌ లిస్టింగ్‌ విధానం ఎప్పటి మాదిరిగానే ఉంటుంది. పరీక్ష విధానమూ మారలేదు. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1, జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2 ఉంటాయి. పేపర్‌-2 అర్హత కోసం. దీనిలో కనీసం 33 శాతం లేదా 67 మార్కులు సంపాదించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే పేపర్‌-1లో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అలా పేపర్‌-2లో 67 కంటే మించి మార్కులు తెచ్చుకుని, పేపర్‌-1లో అత్యధిక స్కోరు సాధించిన 13,250 మంది మెయిన్‌ పరీక్షకు అర్హత సాధిస్తారు.


పేపర్‌ తీరుపై అవగాహన

* ప్రిలిమ్స్‌ సిలబస్‌ను యూపీఎస్‌సీ చాలా స్పష్టంగా ఇచ్చింది. దీనిలో ఆకాశమే హద్దుగా ఏ విషయాన్నయినా అడగొచ్చు.

* వివిధ కమిటీలు చేసిన సిఫారసుల ఆధారంగా, అభ్యర్థి యోగ్యతను అంచనా వేసే విధంగా పేపర్లను రూపొందిస్తారు. వివిధ ప్రభుత్వ పథకాలు బలహీన వర్గాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో అర్థం చేసుకునే శక్తి అభ్యర్థికి ఉండాలి. దాన్ని అంచనా వేసే దిశగా పేపర్లను తయారుచేస్తారు.

* ప్రామాణికమైన పాఠ్యపుస్తకాలు (ప్రభుత్వం ప్రచురించే ఎన్‌సీఈఆర్‌టీ/ పబ్లికేషన్స్‌ డివిజన్‌ మొదలైనవి), ప్రభుత్వ వెబ్‌సైట్ల సమాచారం ఆధారంగానే ప్రశ్నలు అడుగుతారు.

* అభ్యర్థులకు వర్తమానాంశాలు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ ప్రశ్నలను కరెంట్‌ అఫైర్స్‌ నుంచి అడుగుతారు. ఈ వర్తమానాంశాల్లో కూడా పౌరులు ఎదుర్కొనే సమస్యలకే ప్రాధాన్యమిస్తారు.  

* ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రశ్నలు యథావిధిగా వస్తాయి.


ఇప్పటినుంచి ఇలా

ప్రిల్‌ 30 వరకు: మెయిన్‌ పరీక్షకు మాత్రమే సంబంధించిన ఆప్షనల్‌/ఎథిక్స్‌ను చదవడం మానేయాలి. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు సంబంధించిన ఇతర అంశాలు చదవాలి. పేపర్‌-2లోని కాంప్రహెన్షన్‌, బేసిక్‌ న్యూమరసీ, లాజికల్‌ రీజనింగ్‌లతో పాటు హిస్టరీ, పాలిటీ, రాజ్యాంగం, వరల్డ్‌ జాగ్రఫీ, ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌, జనరల్‌ సైన్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పూర్తిచేసుకోవాలి. మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవడం, సరైన దిశలోనే ప్రయాణిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి సబ్జెక్టుల్లో సెక్షన్లవారీగా పరీక్షలు పెట్టుకోవాలి.  

మే 1 నుంచి 31 వరకు: జులై 2021 నుంచి ఏప్రిల్‌ 2022 వరకు వర్తమానాంశాలను కవర్‌ చేయడానికి ప్రయత్నించాలి. జనవరి 1, 2021 నుంచి జూన్‌ 30, 2021 వరకు జరిగిన ముఖ్యాంశాలను చూసుకోవాలి. వీటన్నింటిని స్థూలంగా గమనిస్తే సరిపోతుంది. జులై 1, 2021 నుంచి ఏప్రిల్‌ 2022 వరకు జరిగిన కరెంట్‌ అఫైర్స్‌ను జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా డిసెంబరు 2021 నుంచి ఏప్రిల్‌ 2022 వరకు జరిగిన వర్తమానాంశాలను చాలా నిశితంగా పరిశీలించాలి. కోర్‌ సబ్జెక్టులైన జాగ్రఫీ, పాలిటీలకు నోట్స్‌ తయారు చేసుకున్నట్లయితే వాటితోపాటు కరెంట్‌ అఫైర్స్‌ను కూడా జతచేయాలి.

మే 1 నుంచి మే 25 వరకు ప్రాక్టీస్‌ పేపర్లకు జవాబులు రాయడం మొదలుపెట్టాలి. యూపీఎస్‌సీ స్థాయికి అనుగుణంగా ఈ పేపర్లకు జవాబులు రాయాలి. ప్రశ్నను సరిగానే అర్థం చేసుకున్నప్పటికీ దానికి సంబంధించిన అదనపు సమాచారం ఏమైనా ఉంటే చదవాలి. ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా జరిగిందో తెలుసుకుని దాన్ని మళ్లీ చదవాలి. దానికి సంబంధించిన అంశం నుంచి వివిధ రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందేమో చూడాలి. ఇలా ఆలోచించి చదవడం వల్ల అంతకుముందు మర్చిపోయిన విషయాలు గుర్తుకురావచ్చు. ఇప్పుడా పాయింట్లను నోట్సులో రాసుకోవాలి. ఈ విధానాన్ని అనుసరిస్తే జూన్‌ 5న జరగబోయే పరీక్షను విజయవంతంగా రాయగలుగుతారు.

ప్రతి పేపర్‌ తర్వాత మీ తప్పొప్పులనూ, స్థాయినీ విశ్లేషించుకునేందుకు కింది పట్టిక ఉపకరిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని