Updated : 31 Jan 2023 04:40 IST

అవుతారా... సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌?

అణుశక్తి ప్లాంట్లు, స్పేస్‌స్టేషన్లు, కరెన్సీ నోట్‌ ప్రెస్‌లు, నౌకాశ్రయాలు, ఎయిర్‌పోర్టులు, స్టీల్‌ప్లాంట్లు, హైడ్రాలిక్‌/థర్మల్‌ పవర్‌ప్లాంట్లు.. మొదలైన వాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యం ఉంది. వీటి భద్రతను బాధ్యతగా నిర్వర్తిస్తోంది... సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌). హోమ్‌శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోన్న ఈ సంస్థ తాజాగా 451 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన పురుష అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు!

ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ)/ ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ (పీఈటీ)/డాక్యుమెంటేషన్‌/ట్రేడ్‌ టెస్ట్‌/రిటెన్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షను ఓఎంఆర్‌/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో నిర్వహిస్తారు. పీఎస్‌టీ/పీఈటీ, డాక్యుమెంటేషన్‌ అండ్‌ ట్రేడ్‌ టెస్ట్‌ తర్వాత రాత పరీక్ష ఉంటుంది. అన్ని దశల్లోనూ పాసైనవారికి చివరగా వైద్య పరీక్షను నిర్వహిస్తారు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది. నియామక ప్రక్రియను దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నిర్వహిస్తారు.

కానిస్టేబుల్స్‌/డ్రైవర్‌, కానిస్టేబుల్స్‌/డ్రైవర్‌ కమ్‌ పంప్‌ ఆపరేటర్‌ (డ్రైవర్‌ ఫర్‌ ఫైర్‌ సర్వీసెస్‌) పోస్టులు రెండింటికీ దరఖాస్తు చేయాలనుకున్నా ఒక్క దరఖాస్తును పంపితే సరిపోతుంది. అయితే మొదటి, రెండు ప్రాధాన్యాలు వేటికో స్పష్టంగా తెలియజేయాలి. దరఖాస్తును సమర్పించిన తర్వాత దీంట్లో మార్పులకు అవకాశం ఉండదు. నియామకాలు తాత్కాలికమే అయినప్పటికీ పర్మనెంట్‌ చేసే అవకాశాలుండవచ్చు. ఎంపికైన అభ్యర్థులు దేశ, విదేశాల్లో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌/ ఈఎస్‌ఎం కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ పోస్టులకు దివ్యాంగులు అర్హులు కాదు.

మొత్తం 451 పోస్టుల్లో కానిస్టేబుల్‌/ డ్రైవర్‌ ఖాళీలు 183 ఉన్నాయి. వీటిల్లో అన్‌రిజర్వుడ్‌కు 76, ఎస్సీలకు 27, ఎస్టీలకు 13, ఓబీసీలకు 49, ఈడబ్ల్యూఎస్‌లకు 18 కేటాయించారు. కానిస్టేబుల్‌/ (డ్రైవర్‌ కమ్‌ పంప్‌ ఆపరేటర్‌) (డ్రైవర్‌ ఫర్‌ ఫైర్‌ సర్వీసెస్‌) ఖాళీలు 268 ఉన్నాయి. వీటిల్లో అన్‌రిజర్వుడ్‌కు 111, ఎస్సీలకు 40, ఎస్టీలకు 19, ఓబీసీలకు 72, ఈడబ్ల్యూఎస్‌లకు 26 కేటాయించారు.

అర్హత: మెట్రిక్యులేషన్‌/తత్సమాన పరీక్షను పాసవ్వాలి. హెవీమోటర్‌ వెహికల్‌ లేదా ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్‌ (హెచ్‌ఎంవీ/టీవీ); లైట్‌ మోటర్‌ వెహికల్‌; మోటర్‌సైకిల్‌ విత్‌ గేర్‌ లైసెన్స్‌ ఉండాలి. హెవీ మోటర్‌ వెహికల్‌ లేదా ట్రాన్స్‌పోర్ట్‌ వెహికల్‌ లేదా లైట్‌ మోటర్‌ వెహికల్స్‌ అండ్‌ మోటర్‌ సైకిల్‌ డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.  
వయసు: 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ/సీఐఎస్‌ఎఫ్‌ ఉద్యోగులకు గరిష్ఠ వయసులో మినహాయింపు ఉంటుంది. సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ (జీడీ), కానిస్టేబుల్‌ (ఫైర్‌), కానిస్టేబుల్‌ (ట్రేడ్స్‌మెన్‌)గా పనిచేసిన జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు 40 ఏళ్ల వరకూ సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 ఏళ్ల వరకూ మినహాయింపు ఉంటుంది. వీరంతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడేళ్ల సర్వీసును విజయవంతంగా పూర్తిచేయాలి. ప్రతి విభాగంలోనూ 10 శాతం ఖాళీలను ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు రిజర్వు చేస్తారు.

శారీరక ప్రమాణాలు: 167 సెం.మీ. ఎత్తు, ఛాతీ కొలత 80-85 సెం.మీ. ఉండాలి. ఎస్టీ అభ్యర్థుల ఎత్తు 160 సెం.మీ., ఛాతీ 76-81 సెం.మీ. ఉండాలి. ఎత్తు, వయసుకు తగ్గ బరువు ఉండాలి. హైట్‌బార్‌ టెస్ట్‌లో గెలుపొందిన అభ్యర్థులకు మాత్రమే ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ) నిర్వహిస్తారు.

ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌: ఈ టెస్ట్‌ను హైట్‌బార్‌ టెస్ట్‌, పీఎస్‌టీల్లో గెలుపొందినవాళ్లకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో భాగంగా.. 900 మీటర్ల పరుగును 3 నిమిషాల, 15 సెకన్లలో పూర్తిచేయాలి. 11 అడుగుల లాంగ్‌జంప్‌ను మూడు ప్రయత్నాల్లో చేయగలగాలి. 3 అడుగుల, 6 అంగుళాల హైజంప్‌ను మూడు ప్రయత్నాల్లో పూర్తిచేయాలి. ఈ మూడింటిలో ఒక్కదాంట్లో అర్హత సాధించలేకపోయినా అభ్యర్థులను తర్వాతి దశకు ఎంపిక చేయరు.

ట్రేడ్‌ టెస్ట్‌: ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్స్‌ టెస్ట్‌, డాక్యుమెంటేషన్‌లో పాసైన అభ్యర్థులకు ట్రేడ్‌టెస్ట్‌ను నిర్వహిస్తారు. దీంట్లో కనీసార్హత మార్కులను సాధించాలి.

లైట్‌ వెహికల్‌, హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ టెస్టుల్లో 50 మార్కులకు 25 మార్కుల చొప్పున సాధించాలి. మోటార్‌ మెకానిజమ్‌, ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన పరీక్షలో 30 మార్కులకు 15 సాధించాలి. వాహనాలకు మైనర్‌ రిపేర్లు చేయగలిగే సామర్థ్యం ఉండా లి. తుది ఎంపికలో ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. అయినప్పటికీ దీంట్లో కనీసార్హత మార్కులు సాధించినవారే తర్వాత దశకు ఎంపికవుతారు.


దరఖాస్తు ఫీజు: రూ.100 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు.

దరఖాస్తుకు చివరి తేదీ: 22.02.2023

వెబ్‌సైట్‌:   http://www.cisfrectt.in/


రాత పరీక్ష ఎలా?

పీఎస్‌టీ/పీఈటీ/డాక్యుమెంటేషన్‌, ట్రేడ్‌టెస్టుల్లో అర్హత సాధించినవారికి రాత పరీక్షను నిర్వహిస్తారు. ఇది ఓఎంఆర్‌/కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో ఉంటుంది. జనరల్‌ అవేర్‌నెస్‌/ జనరల్‌ నాలెడ్జ్‌, ఎలిమెంటరీ మేథమెటిక్స్‌, ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌/హిందీ ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నపత్రం ఉంటుంది. ఈ పరీక్ష పదో తరగతి స్థాయిలో ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో మల్టిపుల్‌ ఛాయిస్‌లో ఉంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు. రాత పరీక్షలో అన్‌రిజర్వుడ్‌/ఈడబ్ల్యూఎస్‌/ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు 33 శాతం మార్కులు సాధించాలి. పరీక్ష తేదీని సీఐఎస్‌ఎఫ్‌ వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడిస్తారు.

జనరల్‌ నాలెడ్జ్‌/జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలో తన చుట్టూ ఉండే పరిసరాలపై అభ్యర్థికి ఉండే అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలను రూపొందిస్తారు. అలాగే వర్తమానాంశాలపై అభ్యర్థికి ఉన్న పట్టు, రోజువారీ వ్యవహారాల పరిశీలనను తెలుసుకునే విధంగా ప్రశ్నలుంటాయి. మన దేశానికి ఇతర దేశాలతో ఉండే సంబంధాలు, క్రీడలు, చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఆర్థిక పరిస్థితులు, ఇండియన్‌ పాలిటీ, భారత రాజ్యాంగం, సైంటిఫిక్‌ పరిశోధనలు.. మొదలైన అంశాల్లో అవగాహన పెంచుకోవాలి. ఇందుకోసం రోజూ వార్తాపత్రికలు చదవడం అలవాటు చేసుకుంటే ఫలితం ఉంటుంది.

ఎలిమెంటరీ మేథమెటిక్స్‌: ఈ పేపర్‌లో నంబర్‌ సిస్టమ్స్‌, డెసిమల్స్‌ అండ్‌ ఫ్రాక్షన్స్‌, రిలేషన్‌షిప్‌ బిట్వీన్‌ నంబర్స్‌, ఫండమెంటల్‌ అరిథ్‌మెటికల్‌ ఆపరేషన్స్‌, పర్సంటేజెస్‌, రేషియో అండ్‌ ప్రపోర్షన్‌, యావరేజస్‌, ఇంటరెస్ట్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, డిస్కౌంట్‌, మెన్సురేషన్‌, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్‌, రేషియో అండ్‌ టైమ్‌, టైమ్‌ అండ్‌ వర్క్‌ మొదలైనవి ఉంటాయి.

ఎనలిటిక్‌ ఆప్టిట్యూడ్‌ (ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌): నాన్‌ వెర్బల్‌ విధానంలో ఉంటాయి. సిమిలారిటీస్‌ అండ్‌ డిఫరెన్సెస్‌, స్పేషియల్‌ విజువలైజేషన్‌, విజువల్‌ మెమరీ, డిస్క్రిమినేషన్‌, అబ్జర్వేషన్‌, రిలేషన్‌షిప్‌, అరిథ్‌మెటికల్‌ రీజనింగ్‌, అరిథ్‌మెటిక్‌ నంబర్‌ సిరీస్‌, నాన్‌-వెర్బల్‌ సిరీస్‌, కోడింగ్‌-డీకోంగ్‌ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.

ఇంగ్లిష్‌: స్పాట్‌ ఎర్రర్‌, ఫిల్‌ ఇన్‌ ది బ్లాంక్స్‌, సిననిమ్స్‌/హోమోనిమ్స్‌, యాంటనిమ్స్‌, స్పెల్లింగ్స్‌/డిటెక్టింగ్‌ మిస్‌ స్పెల్‌ వర్డ్స్‌, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజస్‌, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్‌, ఇంప్రూవ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌, యాక్టివ్‌/పాసివ్‌ వాయిస్‌, కన్సర్వేషన్‌ ఇన్‌ టు డైరెక్ట్‌ /ఇన్‌ డైరెక్ట్‌ నెరేషన్‌, షఫ్లింగ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ పార్ట్స్‌, షఫ్లింగ్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌ ఇన్‌ ఎ పాసేజ్‌, క్లోజ్‌ పాసేజ్‌, కాంప్రహెన్షన్‌ పాసేజ్‌ .. మొదలైనవాటిపై ప్రశ్నలు ఉంటాయి.

రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా జనరల్‌, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఈఎస్‌ఎం కేటగిరీ వారీగా అభ్యర్థుల జాబితాను రూపొందిస్తారు. తుది ఫలితాలను సీఐఎస్‌ఎఫ్‌ రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌  http://www.cisfrectt.in/   లో ప్రచురిస్తారు. వెయిటింగ్‌ లిస్టు ఏమీ ఉండదు. అన్ని పరీక్షలు పాసైన అభ్యర్థులకు డిటెయిల్డ్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ (డీఎంఈ)ను నిర్వహించి ఎంపిక చేస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు