మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు

అధికార వైకాపాకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీర విధేయుల్లా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు మంగళవారం వేటు వేసింది.

Updated : 08 May 2024 07:08 IST

పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఈసీ కొరడా 

ఈనాడు, చిత్తూరు-న్యూస్‌టుడే, చిత్తూరు (నేరవార్తలు): అధికార వైకాపాకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీర విధేయుల్లా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు మంగళవారం వేటు వేసింది. అనంతపురం రేంజ్‌ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసిన మరుసటి రోజే ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేయాల్సిన డీఎస్పీ, ఎస్సైలు పెద్దిరెడ్డికి తొత్తులుగా మారి.. విపక్షాలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వీరు యథావిధిగా స్వామిభక్తి ప్రదర్శించారు. వీరి వ్యవహారం శ్రుతి మించడంతో ఈసీ కొరడా ఝళిపించింది. వెంటనే డీఎస్పీ, ఎస్సైను బదిలీ చేసి, ఆయా స్థానాల్లో వేరేవారిని నియమించాలని ఆదేశించింది.

ప్రతిపక్షాలపై వేధింపులు.. అక్రమ కేసులు 

  • పుంగనూరు మండలం చదళ్లలో ఈ ఏడాది జనవరి 13న బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్‌ ధర్మపోరాట సభ నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ముందురోజు ఆ పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకుంటుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణమోహన్‌ ఓ కార్యకర్తను చెప్పుతో కొట్టడం వివాదాస్పదమైంది. దీనిపై చర్యలు తీసుకోవాలని రామచంద్ర యాదవ్‌ ఫిర్యాదు చేశారు. డీఎస్పీ మహేశ్వరరెడ్డి మాత్రం మంత్రి పెద్దిరెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గి.. చర్యలకు సిఫార్సు చేయలేదని అప్పట్లో బీసీవైపీ అధినేత ఆరోపించారు.
  • ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత తెదేపా కార్యకర్త హేమాద్రిని వైకాపా నాయకుడు నాగభూషణం అనుచరులు కిడ్నాప్‌ చేసినా, పోలీసులు బాధ్యులపై కఠినంగా వ్యవహరించలేదు.
  • గత నెల 29న పెద్దిరెడ్డి స్వగ్రామం సదుం మండలం యర్రాతివారిపల్లెలో రామచంద్ర యాదవ్‌ ప్రచారానికి వెళ్లగా, వైకాపా కార్యకర్తలు వారిపై దాడి చేశారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు సదుం పోలీసు స్టేషన్‌కు వెళ్లగా, అక్కడా దౌర్జన్యానికి పాల్పడ్డారు. స్టేషన్‌ వద్దే బీసీవైపీ ప్రచార రథానికి నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు. బాధితుడైన రామచంద్ర యాదవ్‌పైనే పోలీసులు తిరిగి హత్యాయత్నం కేసు కట్టారు. దీనిపై ఆ పార్టీ అధినేత ఫిర్యాదు చేయడంతో మొదట డీఐజీ అమ్మిరెడ్డిపై, ఇప్పుడు పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఈసీ చర్యలు తీసుకుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని