logo

నారు పోశావా.. నీరు పెట్టావా.. మా భూములపై నీ పెత్తనం ఏంటీ?

ఇన్నాళ్లు ప్రభుత్వ, ప్రజాధనాన్ని, ప్రకృతి సంపదను దిగమింగిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి... రెక్కలుముక్కలు చేసుకుని ప్రజలు సంపాదించుకున్న స్థిరాస్థులను దోచుకునే కుట్ర పన్నారు. దేశంలో ఎక్కడా.. ఎన్నడూ లేనివిధంగా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తీసుకొచ్చారు.

Updated : 08 May 2024 07:03 IST

జగన్‌ను నిలదీస్తున్న ప్రజలు రద్దు చేయాలని సర్వత్రా డిమాండ్‌

విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: ఇన్నాళ్లు ప్రభుత్వ, ప్రజాధనాన్ని, ప్రకృతి సంపదను దిగమింగిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి... రెక్కలుముక్కలు చేసుకుని ప్రజలు సంపాదించుకున్న స్థిరాస్థులను దోచుకునే కుట్ర పన్నారు. దేశంలో ఎక్కడా.. ఎన్నడూ లేనివిధంగా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తీసుకొచ్చారు. దీనిద్వారా పాలకులకు నచ్చిన వారికి భూములు ఇచ్చే అవకాశం ఉంటుందని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఇవ్వాల్సిన తీర్పులు.. అధికారులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడానికి, బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవడానికి ఈ చట్టం ద్వారా వీలు కలుగుతుందన్నారు. ప్రజల ఆస్తులపై ప్రభుత్వ పెత్తం ఏమిటని మండిపడుతున్నారు. ఆస్తులు దోచుకోవడానికేనని విమర్శిస్తున్నారు. ఈ దుర్మార్గపు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేస్తున్నారు.


భూకబ్జాదారులకు ద్వారాలు తెరవడమే

- సుంకర రాజేంద్రప్రసాద్‌, బీబీఏ సీనియర్‌ న్యాయవాది

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం పేద, సామాన్య ప్రజలకు వ్యతిరేకమైనది. దీనివల్ల.. అవినీతి, భూకబ్జాదారులకు ద్వారాలు తెరవడమే. ఆస్తులపై ఏదైనా వివాదాలు చోటు చేసుకుంటే.. పరిష్కరించాల్సింది న్యాయస్థానాలు. రెవెన్యూ అధికారులు కాదు. న్యాయస్థానాలను తప్పించడం, రెవెన్యూ అధికారుల పరిధికి తేవడం.. తీవ్ర ఆక్షేపణీయం. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోతుంది. అభ్యంతరాలను సుమోటోగా అధికారులే చేపట్టే అవకాశం ఉంది. ఈ చట్టం ద్వారా వచ్చే వివాదాలకు ప్రభుత్వ అధికారులే ఏ విధంగా తీర్పు చెబుతారు? న్యాయస్థానాల్లోనూ సాంకేతికపరంగా ఇబ్బందులు ఉంటాయి. భూ యజమానులకు మరింత అన్యాయం జరిగే అవకాశం ఉంది. భూములను దోచుకోవడానికే ఈ చట్టం తెచ్చారని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలి.


న్యాయం కోసం కోర్టుకు వెళ్లడం కుదరదు

- కలతోటి క్రాంతికుమార్‌, బీబీఏ సహాయ కార్యదర్శి

ఈ కొత్త చట్టంతో భూ యజమానులు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడంలోనూ ఇబ్బందులు తప్పవు. ఇప్పటి వరకు తమ ఆస్తిని ఎవరైనా కబ్జా చేస్తే.. కోర్టుకు వెళ్లవచ్చు. కానీ ఈ చట్టం ద్వారా కుదరదు. విధి విధానాలు ఏమిటో ప్రజలకు అర్థమయ్యేరీతిలో అవగాహన చేయకుండా.. రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా చట్టం చేసేసింది. పసుపు కుంకుమ కింద అల్లుడికి ఆస్తి నకళ్లు ఇస్తే తీసుకుంటారా?  భూసమస్యలు తీర్చడానికి సరళీకృతమైన చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం.. ఇలా సమస్యలు తెచ్చిపెట్టడం సరికాదు.


ఇది రాజ్యాంగ ధిక్కరణే

- ఆలూరి సుధాకరరావు, బీబీఏ న్యాయవాది

ఈ చట్టం ద్వారా రైతుకు తమ భూమిపై హక్కు లేకుండా చేయడం దురదృష్టకరం. టైటిలింగ్‌ యాక్ట్‌ అమలైతే.. ప్రజల స్థిరాస్తుల చట్టబద్ధ హక్కులు అధికారులవి అవుతాయి. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వమే.. భూములను లాక్కునేందుకు ప్రణాళికలు రూపొందించడం అన్యాయం. శాశ్వత యాజమాన్య హక్కు కల్పించే పేరుతో ప్రజల ఆస్తిని లాక్కోవడానికి వైకాపా ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది. ఈ విధానం రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను ధిక్కరించడమే.


ఇక అధికారులదే రాజ్యం

- ఆర్‌.అనూహ్య, న్యాయవాది

ఈ చట్టంతో ప్రభుత్వ ఆధికారులే రాజ్యమేలతారు. తరతరాలుగా అనుభవిస్తున్న భూమిపై యజమానికి హక్కు లేకుండా పోతుంది. భూమినే నమ్ముకున్న రైతున్నకు ఆటంకాలు కలుగుతాయి. భూములన్నీ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోతాయి. సామాన్యుడికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం బరితెగింపు చర్యలకు ప్పాడడం సరైందికాదు. దీనిపై పునరాలోచించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని