హెచ్‌పీసీఎల్‌లో.. 294 ఖాళీలు

మహారత్న సంస్థ అయిన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 294 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంజినీరింగ్‌,పెట్రోకెమికల్‌, ఆర్‌అండ్‌డీ, ఇతర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ చదివిన అభ్యర్థులకు

Updated : 01 Sep 2022 11:01 IST

మహారత్న సంస్థ అయిన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 294 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంజినీరింగ్‌,పెట్రోకెమికల్‌, ఆర్‌అండ్‌డీ, ఇతర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ చదివిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మరి ఈ నోటిఫికేషన్‌ పూర్తి వివరాలు, పరీక్షా విధానం, సన్నద్ధతలో మెలకువలు ఒకసారి చూద్దాం.

విభాగాల వారీగా మెకానికల్‌ ఇంజినీర్‌ (103), ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ (42), ఇన్‌స్ట్రుమెంటల్‌ ఇంజినీర్‌ (30), సివిల్‌ ఇంజినీర్‌ (25), కెమికల్‌ ఇంజినీర్‌ (7), ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఆఫీసర్‌ (5), సేఫ్టీ ఆఫీసర్‌ - ఉత్తరప్రదేశ్‌ (6) - తమిళనాడు (1) - కేరళ (5) - గోవా (1), ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ (2), క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీసర్‌ (27), బ్లెండింగ్‌ ఆఫీసర్‌ (5), చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (15), హెచ్‌ఆర్‌ (8), వెల్ఫేర్‌ ఆఫీసర్‌ - విశాఖ రిఫైనరీ (1) - ముంబయి రిఫైనరీ (1), లా ఆఫీసర్‌ (5), లా ఆఫీసర్‌ హెచ్‌ఆర్‌ (2), మేనేజర్‌ /సీనియర్‌ మేనేజర్‌ - ఎలక్ట్రికల్‌ (3) తదితర ఖాళీలున్నాయి.

* పోస్టును అనుసరించి బీఈ, బీటెక్‌, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, సీఏ, ఎంబీఏ హెచ్‌ఆర్‌, డిగ్రీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ లా చదివిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్ఛు వయసు 25 ఏళ్లలోపు ఉండాలి. కొన్నింటికి 27 ఏళ్ల వరకూ ఉండొచ్ఛు

జీతభత్యాలు

ఈ ఉద్యోగాలను మూడు గ్రేడ్లుగా విభజించారు. ‘ఈ2’ గ్రేడ్‌లో రూ.50,000/- నుంచి రూ.1,60,000/- వరకూ జీతం లభిస్తుంది. గ్రేడ్‌ ‘సీ’లో రూ.80,000/- నుంచి రూ.2,20,000/- వరకూ జీతం ఉంటుంది. గ్రేడ్‌ ‘డి’లో రూ.90,000/- నుంచి రూ.2,40,000/- వరకూ వేతనం అందుతుంది. వీటికి అదనంగా ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు ఉంటాయి.

ఎంపిక విధానం

దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత అన్ని అర్హతలు ఉన్నవారికి మొదట రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలుంటాయి. పరీక్షలో ఉత్తీర్ణులకు గ్రూప్‌ టాస్క్‌ ఇస్తారు. అక్కడ కూడా నెగ్గిన వారికి ముఖాముఖి పరీక్ష ఉంటుంది. లా ఆఫీసర్‌ ఉద్యోగానికి మూట్‌ కోర్ట్‌ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం ప్రక్రియలో రాతపరీక్షకు 85%, గ్రూప్‌ టాస్క్‌కు 5%, ఇంటర్వ్యూకి 10% వెయిటేజీ ఉంటుంది.

పరీక్ష తీరు..

రాతపరీక్ష సీబీటీ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో ఉంటుంది. ఈ పేపర్‌ను రెండు భాగాలుగా విభజించారు. మొదటిది జనరల్‌ ఆప్టిట్యూడ్‌, రెండోది టెక్నికల్‌/ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌. మొత్తం పేపర్‌ను రెండున్నర గంటల్లో పూర్తిచేయాలి.

* జనరల్‌ ఆప్టిట్యూడ్‌లో ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంటలెక్చువల్‌ పొటెన్షియల్‌ టెస్ట్‌ (లాజికల్‌ రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌) అంశాలపై ప్రశ్నలుంటాయి.

* రెండో విభాగంలో అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న పోస్టుకు సంబంధించి సబ్జెక్టుపరమైన ప్రశ్నలు ఉంటాయి.

* రాతపరీక్షలో రుణాత్మక మార్కులు ఉండవు.

ఎలా చదవాలి?

హెచ్‌పీసీఎల్‌ నుంచి గత ఏడాది వచ్చిన నోటిఫికేషన్‌ను పరిశీలిస్తే... అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు పరీక్ష ముందు దాదాపు మూడున్నర నెలల సమయం దొరికింది. ఈసారి కూడా అలా ఉండవచ్చని నిపుణుల అంచనా. అభ్యర్థి విజయం అధికశాతం రాతపరీక్ష మీదనే ఆధారపడి ఉన్నందున దానిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలి.

2021 ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే... మొత్తం 170 ప్రశ్నలు అడిగారు. ఇందులో ఇంగ్లిష్‌ - 17, రీజనింగ్‌- 34, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ - 34, టెక్నికల్‌ - 85 ప్రశ్నలు వచ్చాయి. అంటే టెక్నికల్‌ సబ్జెక్టుపై 85 ప్రశ్నలు, ఇతర అంశాలపై 85 ప్రశ్నలు సమానంగా వచ్చాయి. అందువల్ల సన్నద్ధతలో రెండు విభాగాలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల బిట్లతో కూడిన మెటీరియల్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిని వీలైనన్ని సాధన చేయాలి. మిగతా విభాగాల్లో ప్రశ్నల తీరు తెలుసుకునేందుకు గత ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. ఈ పేపర్‌ కఠినత్వం మధ్యస్థంగా ఉంటుందని అంచనా. దానికి తగ్గట్టు సన్నద్ధం కావాలి.

ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం ప్రొబేషన్‌ కాలం ఉంటుంది. దాన్ని విజయవంతంగా పూర్తిచేసిన వారికి కన్ఫర్మేషన్‌ ఇస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో...

పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.1,180 ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: జులై 22

వెబ్‌సైట్‌ : https://www.hindustanpetroleum.com


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని