అవుతారా నర్సింగ్‌ ఆఫీసర్‌?

నర్సింగ్‌ వృత్తికి రోజురోజుకూ ప్రాముఖ్యం పెరుగుతోంది. దేశ విదేశాల్లో ఎన్నెన్నో ఉద్యోగావకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తున్నాయి.

Updated : 14 Nov 2022 03:41 IST

జిప్‌మర్‌లో 433 పోస్టులు

నర్సింగ్‌ వృత్తికి రోజురోజుకూ ప్రాముఖ్యం పెరుగుతోంది. దేశ విదేశాల్లో ఎన్నెన్నో ఉద్యోగావకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇక ప్రభుత్వ హాస్పిటల్‌లో నర్సుగా ఉద్యోగం సంపాదిస్తే.. ఎందరో రోగులకు సేవచేసి  ఆత్మసంతృప్తిని పొందొచ్చు. అంతేకాదు ఆకర్షణీయమైన వేతనాలనూ అందుకోవచ్చు. అందుకోసం ‘జిప్‌మర్‌’ ఇప్పుడో అవకాశాన్ని అందిస్తోంది.

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయబోతోంది. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రకటించిన మొత్తం 433 నర్సింగ్‌ ఆఫీసర్‌ (గ్రూప్‌-బి) పోస్టుల్లో అన్‌రిజర్వుడ్‌కు 175, ఈడబ్ల్యూఎస్‌లకు 43, ఓబీసీలకు 116, ఎస్సీలకు 66, ఎస్టీలకు 33 పోస్టులను కేటాయించారు. 80 శాతం పోస్టులను మహిళలకు రిజర్వు చేశారు. ఎస్సీ /ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ/ అన్‌రిజర్వుడ్‌ కేటగిరీల్లోని పీడబ్ల్యూబీడీ (పర్సన్స్‌ విత్‌ బెంచ్‌మార్క్‌ డిజెబిలిటీస్‌) అభ్యర్థులకు 23 పోస్టులను కేటాయించారు.

ఎవరు దరఖాస్తు చేయొచ్చు?

అర్హతలు: బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్‌/ బీఎస్సీ నర్సింగ్‌ లేదా బీఎస్సీ (పోస్ట్‌ - సర్టిఫికెట్‌) / పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ లేదా డిప్లొమా (జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ)తో పాటు కనీసం 50 పడకల హాస్పిటల్‌లో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. శిక్షణలో భాగంగా పనిచేసినదాన్ని ఉద్యోగ అనుభవంగా పరిగణించరు.
వయసు: గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పీడబ్ల్యూబీడీలకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.  
దరఖాస్తు ఫీజు: రూ.1500 (ఓబీసీలకు రూ.1500, ఎస్సీ, ఎస్టీలకు రూ.1200 (దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది) ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01.12.2022
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 18.12.2022
వెబ్‌సైట్‌: http://www.jipmer.edu.in/

ఎంపిక ఇలా

రాత పరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌టెస్ట్‌లో సంబంధిత సబ్జెక్టుల నుంచి 70 శాతం ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ మ్యాథమెటిక్స్‌ నుంచి 30 శాతం ప్రశ్నలు ఇస్తారు. 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు (ఎంసీక్యూ) ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున ప్రశ్నపత్రం 400 మార్కులకు ఉంటుంది.  పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు (గంటన్నర).

* కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)లో కనీసార్హత మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే స్కిల్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. ఈ టెస్ట్‌లో భాగంగా వైద్య పరికరాల వినియోగంలో అభ్యర్థులకు ఉండే పరిజ్ఞానాన్నీ, వివిధ వైద్య పరీక్షలు నిర్వహించగల సామర్థ్యాన్నీ పరీక్షిస్తారు. స్కిల్‌ టెస్ట్‌ను 4 నుంచి 8 కేంద్రాల్లో నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులకు ఈ టెస్ట్‌ తేదీ, సమయాలను తర్వాత తెలియజేస్తారు.

కనీసార్హత మార్కులు: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లో.. అన్‌ రిజర్వుడ్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 50 మార్కులు సాధించాలి. అన్‌ రిజర్వుడ్‌/ ఈడబ్ల్యూఎస్‌ - పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 45 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి.

* స్కిల్‌ టెస్ట్‌లో.. అన్‌రిజర్వుడ్‌/    ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 50 శాతం, అన్‌రిజర్వుడ్‌/ ఈడబ్ల్యూఎస్‌ - పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించాలి.


సన్నద్ధత ఎలా?

ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సమయపాలన నైపుణ్యం ఎంతో అవసరం. 70 శాతం ప్రశ్నలు సంబంధిత సబ్జెక్టుల నుంచే వస్తాయి. కాబట్టి టైమ్‌ టేబుల్‌ వేసుకుని దాని ప్రకారం ఆయా సబ్జెక్టుల్లోని అంశాలను చదువుకోవాలి.

* ఏయే అంశాలను క్షుణ్ణంగా అర్థంచేసుకున్నారో.. ఏవి క్లిష్టంగా ఉన్నాయో చూసుకోవాలి. కష్టంగా ఉన్నవాటికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి.

* జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ మ్యాథమెటిక్స్‌ల నుంచి 30 శాతం ప్రశ్నలు వస్తాయి. దినపత్రికలు, మ్యాగజైన్లు చదవడం వల్ల వర్తమానాంశాలపై పట్టు సాధించగలుగుతారు.

* ఆన్‌లైన్‌లో వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. దీంతో నిర్దేశిత సమయంలోపల అన్ని ప్రశ్నలకూ సమాధానం రాయగలుగుతున్నారో లేదో తెలుస్తుంది. రాయలేకపోతే మరింత వేగంగా రాయడమెలాగో సాధన చేయొచ్చు. అంతేకాదు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష రాయడం మొదటిసారి అయితే ఆ బెరుకుని పోగొట్టుకుని పరీక్షకు సిద్ధంకావొచ్చు.

* రోజూ కొన్ని అంశాలను తప్పనిసరిగా చదవాలనే నియమం పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని వాయిదా వేయకుండా పూర్తిచేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని