ISRO Jobs: ఇస్రోలో చేరతారా?

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ఉద్యోగం చాలా విలువైనదిగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థలో సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ఉద్యోగాలు అత్యంత ముఖ్యమైనవి.

Updated : 12 Jun 2023 11:25 IST

303 సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ఖాళీలు

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ఉద్యోగం చాలా విలువైనదిగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థలో సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ఉద్యోగాలు అత్యంత ముఖ్యమైనవి. ఇస్రో చేపట్టే కీలక వ్యవహారాల్లో వీరు భాగం కావడమే ఇందుకు కారణం. ఇందులో పాలుపంచుకునే అవకాశమిప్పుడొచ్చింది. ఈ సంస్థ తాజాగా 303 సైంటిస్ట్‌/ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. బీటెక్‌ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూతో నియామకాలు చేపడతారు. 

మాజాభివృద్ధిలో అంతరిక్ష పరిజ్ఞానం కీలకం. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం, వాటిని పర్యవేక్షించడం తదితర ముఖ్య విధులను ఇస్రోలో పనిచేసే సైంటిస్టు/ఇంజినీర్లు పర్యవేక్షిస్తారు. వీరికి గ్రూప్‌-ఎ హోదా దక్కుతుంది. ఈ పోస్టుల్లో చేరినవారు లెవెల్‌-10 వేతనం అందుకోవచ్చు. రూ.56,100 మూలవేతనానికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ, ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి. అందువల్ల ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం పొందవచ్చు. దశలవారీగా భవిష్యత్తులో అత్యున్నత స్థాయికీ చేరుకోవచ్చు.


పరీక్ష, ఇంటర్వ్యూ..

నియామక పరీక్షను దేశవ్యాప్తంగా 11 కేంద్రాల్లో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం హైదరాబాద్‌లో ఉంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. మొత్తం వంద మార్కులు. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. పార్ట్‌-ఎ: ఇందులో 80 ప్రశ్నలు వస్తాయి. ఇవి ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. వీటిని అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న ఇంజినీరింగ్‌ బ్రాంచీ నుంచే అడుగుతారు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు.
పార్ట్‌-బి: ఆప్టిట్యూడ్‌/ఎబిలిటీ టెస్టు. 15 ప్రశ్నలు. ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. వీటికి 20 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు. న్యూమరికల్‌ రీజనింగ్‌, లాజికల్‌ రీజనింగ్‌, డయాగ్రమేటిక్‌ రీజనింగ్‌, డిడక్టివ్‌ రీజనింగ్‌ల్లో ప్రశ్నలు అడుగుతారు.
ఇంటర్వ్యూ: పరీక్షలో చూపిన ప్రతిభతో షార్ట్‌లిస్ట్‌ చేసి.. ఒక్కో పోస్టుకు ఐదుగురిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. దీనికి వంద మార్కులు. ఇంటర్వ్యూకు ఒరిజినల్‌ పత్రాలతో వెళ్లాలి. సెకండ్‌ క్లాస్‌ రైలు ఛార్జీలు చెల్లిస్తారు.
తుది నియామకం: పరీక్ష, ఇంటర్వ్యూలకు సమాన వెయిటేజీ ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్‌ అభ్యర్థులు పార్ట్‌-ఎ, బిల్లో విడిగా 50 శాతం మార్కులు పొందాలి. రిజర్వేషన్‌ ఉన్నవారికి 40 శాతం తప్పనిసరి. ఇంటర్వ్యూలో అర్హత కోసం జనరల్‌ అభ్యర్థులు 50, మిగిలినవారు 40 మార్కులు సాధించాలి. పరీక్ష, ఇంటర్వ్యూల్లో కలిపి జనరల్‌ అభ్యర్థులు 60, మిగిలినవారు 50 శాతం మార్కులు పొందాలి. ఇలా కటాఫ్‌లో నిలిచినవారి జాబితా నుంచి.. మెరిట్‌, రిజర్వేషన్లు అనుసరించి, ఉద్యోగంలోకి తీసుకుంటారు. వీరు ఇస్రో కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తారు.


సన్నద్ధత

ఈసారి పరీక్ష విధానం మారింది. అందువల్ల పాత ప్రశ్నపత్రాలను పూర్తి ప్రామాణికంగా తీసుకోలేము. అయితే పార్ట్‌-ఎలో 80 ప్రశ్నలు బీటెక్‌ బ్రాంచీల నుంచే వస్తాయి. అభ్యర్థులు తమ బ్రాంచి పాఠ్యపుస్తకాలు ముందు బాగా చదవాలి. అనంతరం గేట్‌ పాతప్రశ్నపత్రాలు బాగా సాధన చేయాలి. ఆ తర్వాత వీలైనన్ని గేట్‌ మాక్‌ టెస్టులు రాయాలి. సబ్జెక్టుపై గట్టి పట్టున్నవారు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంది. పార్ట్‌-బి కోసం ఏదైనా రీజనింగ్‌ పుస్తకాన్ని తీసుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
పార్ట్‌-ఎలో రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియనివాటిని వదిలేయడమే మంచిది.


ముఖ్య సమాచారం

పోస్టు: సైంటిస్ట్‌/ఇంజినీర్‌
ఖాళీలు: 303. విభాగాలవారీగా.. ఎలక్ట్రానిక్స్‌ 90, మెకానికల్‌ 163, కంప్యూటర్‌ సైన్స్‌ 47, ఎలక్ట్రానిక్స్‌ అటానమస్‌ బాడీ 2, కంప్యూటర్‌ సైన్స్‌ అటానమస్‌ బాడీ 1.
అర్హత: బీఈ/బీటెక్‌లో సంబంధిత/అనుబంధ బ్రాంచీలో 65 శాతం మార్కులు లేదా 10కి 6.84 సీజీపీఏ ఉండాలి.
వయసు: జూన్‌ 14 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు సడలింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 14
పరీక్ష ఫీజు: రూ.250.  
వెబ్‌సైట్‌:- https://www.isro.gov.in/Careers.html


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని