కేంద్రంలో ఖాకీ కొలువులు

దిల్లీ పోలీస్‌ విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. అన్ని విభాగాల్లోనూ 7547 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు.

Updated : 05 Sep 2023 03:20 IST

ఇంటర్‌తో 7547 ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు

దిల్లీ పోలీస్‌ విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. అన్ని విభాగాల్లోనూ 7547 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్ష, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. రాష్ట్ర స్థాయి పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నవారు, కేంద్ర సర్వీసులపై ఆసక్తి ఉన్న వారు వీటిని ప్రయత్నించవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో ఖాకీ ఉద్యోగాలంటే యువతరానికి ప్రత్యేకమైన క్రేజ్‌. లక్షల సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతుంటారు. కానీ అవకాశం మాత్రం కొందరికే దక్కుతోంది. ఈ యూనిఫారం ఉద్యోగంపై ఆసక్తి ఉన్నవారు దిల్లీలో ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుల్‌ పోస్టులను ప్రయత్నించవచ్చు. అయితే ఈ అవకాశం వచ్చినవారు దిల్లీ పరిధిలోనే విధులు నిర్వర్తించాలి. ఇది కేంద్రప్రభుత్వ ఉద్యోగం. వీరికి లెవెల్‌-3 మూలవేతనం   రూ.21,700 అందుతుంది. అన్ని అలవెన్సులతోనూ వీరు మొదటి నెల నుంచే రూ.40,000 జీతం అందుకోవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష,   దేహదార్ఢ్య, శారీరక ప్రమాణ, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి.

పరీక్షలో..

ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌/ హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పార్టు-ఏ జనరల్‌ నాలెడ్జ్‌/వర్తమానాంశాలు 50 ప్రశ్నలు, పార్టు-బీ రీజనింగ్‌ 25, పార్టు-సీ న్యూమరికల్‌ ఎబిలిటీ 15, పార్టు-డీ కంప్యూటర్‌ ప్రాథమికాంశాల నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. ఇందులో అర్హత సాధించడానికి జనరల్‌ అభ్యర్థులు 35, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలు 30 మార్కులు పొందాలి. ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్‌ ఉన్నవారికి 5, బీ ఉంటే 3, ఏకి 2 బోనస్‌ మార్కులు దక్కుతాయి. అలాగే రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలో డిగ్రీ లేదా పీజీ డిప్లొమా పూర్తి చేసుకున్నవారికీ అదనపు మార్కులు ఉన్నాయి. పరీక్షలో అర్హుల జాబితా నుంచి మెరిట్‌, రిజర్వేషన్‌ ప్రకారం విభాగాల వారీ ఖాళీలకు 12 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను తర్వాతి దశ.. ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌, ఫిజికల్‌ మెజర్‌మెంట్స్‌ (పీఈ అండ్‌ ఎంటీ)కు ఆహ్వానిస్తారు. వీటిని దిల్లీలోనే నిర్వహిస్తారు.

పీఈ అండ్‌ ఎంటీ

పురుషులు: 1600 మీటర్ల దూరాన్ని 6 నిమిషాల్లో పరుగెత్తాలి. ఇందులో విజయవంతమైనవారు మూడు ప్రయత్నాల్లో కనీసం ఒకసారైనా.. 14 అడుగులకు లాంగ్‌ జంప్‌, 3.9 అడుగుల ఎత్తుకు హైజంప్‌ చేయాలి. 170 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీలైతే 165 సెం.మీ. సరిపోతుంది. ఛాతీ విస్తీర్ణం 81 సెం.మీ. ఉండాలి. ఎస్టీలైతే 76 సెం.మీ. చాలు. ఊపిరి పీల్చినపుడు కనీసం 4 సెం.మీ. పెరగాలి.

మహిళలు: 1600 మీటర్ల దూరాన్ని 8 నిమిషాల్లో పరుగెత్తాలి. ఇందులో విజయవంతమైనవారు మూడు ప్రయత్నాల్లో కనీసం ఒక్కసారి.. 10 అడుగుల దూరానికి లాంగ్‌ జంప్‌, 3 అడుగుల ఎత్తుకు హైజంప్‌ చేయాలి. ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 155 సెం.మీ. సరిపోతుంది. పీఈ అండ్‌ ఎంటీ విభాగానికి మార్కులు లేవు. నిర్దేశిత ప్రమాణాలు ఉండి, లక్ష్యాలను పూర్తిచేస్తే చాలు. ఇందులో విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఏ సమస్య లేనివారిని ఉద్యోగానికి పరిగణనలోకి తీసుకుంటారు. తుది నియామకాలు ఆన్‌లైన్‌ పరీక్ష మార్కుల మెరిట్‌ ప్రకారం చేపడతారు.

సగం ప్రశ్నలు ఆ విభాగం నుంచే!

  • పరీక్షను ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో నిర్వహిస్తున్నప్పటికీ ప్రశ్నల స్థాయి పదో తరగతిని మించదు. అందువల్ల ప్రకటనలో పేర్కొన్న సిలబస్‌ ప్రకారం ప్రాథమికాంశాలు బాగా చదువుకోవాలి.
  • ఈ పరీక్షలో అధిక ప్రాధాన్యం జనరల్‌ నాలెడ్జ్‌, వర్తమాన వ్యవహారాలకు కల్పించారు. సగం ప్రశ్నలు ఈ విభాగం నుంచే వస్తాయి. అందువల్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీనిలో ఎక్కువ మార్కులు పొందినవారే విజేతలు కాగలరు.
  • ప్రాథమిక సన్నద్ధత పూర్తయిన తర్వాత ప్రతి విభాగంలోనూ అంశాలవారీ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
  • సమగ్రమైన పుస్తకాలు రెండు లేదా మూడు తీసుకుని, వాటినే బాగా చదవాలి.
  • గత ప్రశ్నపత్రాలు గమనించాలి. విభాగాలు, అంశాల వారీ.. ఏ తరహాలో ప్రశ్నలు వస్తున్నాయో పరిశీలించి, అందుకు సరిపోయేలా సన్నద్ధత కొనసాగించాలి.  
  • ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్‌, ఎంటీఎస్‌ పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడమూ ప్రయోజనమే.
  • సిలబస్‌ ప్రకారం బాగా చదివి, మాదిరి ప్రశ్నలు సాధన చేయడం పూర్తయిన తర్వాత నవంబరులో కనీసం పది నమూనా పరీక్షలు రాయాలి. ఇలా రాస్తున్నప్పుడు సమయ నిబంధనను కచ్చితంగా పాటించాలి.
  • జవాబులను సరిచూసుకుని వెనుకబడిన విభాగాలకు అదనపు సమయం కేటాయించుకోవాలి. పాత తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి.
  • ప్రతి పరీక్షలోనూ కనీసం 60 మార్కులు పొందగలిగితే విజయవంతం అయినట్లే.

ముఖ్య వివరాలు

ఖాళీలు: మొత్తం 7547. (పురుషులకు 4453, మహిళలకు 2491, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ 266, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కమాండో 337)

విద్యార్హత: ఇంటర్మీడియట్‌

వయసు: జులై 1, 2023 నాటికి 18-25 ఏళ్లలోపు ఉండాలి. జులై 2, 1998 - జులై 1, 2005 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలు ఐదేళ్లు, ఓబీసీలు మూడేళ్లు గరిష్ఠ వయసులో మినహాయింపు పొందవచ్చు.

ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 30

కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష: డిసెంబరులో నిర్వహిస్తారు (తేదీల వివరాలు తర్వాత ప్రకటిస్తారు)

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. చీరాల, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ,  విశాఖపట్నం. తెలంగాణలో.. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/


ప్రశ్నలు ఏ అంశాల్లో? 

జీకే/ వర్తమాన అంశాలు: రోజువారీ సంఘటనల నుంచే ఈ ప్రశ్నలు వస్తాయి. తాజా అంశాల్లో అభ్యర్థి అవగాహనను పరిశీలించే విధంగా వీటిని సంధిస్తారు. భారత్‌, పొరుగు దేశాలు, క్రీడలు, చరిత్ర, సంస్కృతి, భౌగోళిక స్థితిగతులు, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, వైజ్ఞానిక పరిశోధనలు.. మొదలైన అంశాలపై ప్రశ్నలుంటాయి. వీటిని ఎదుర్కోవడానికి ఎందులోనూ ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. ఏదైనా పత్రికను రోజూ చదువుకుని ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. క్రీడల్లో విజేతలు, అవార్డులు, సభలు, సమావేశాలు, పొరుగు దేశాల్లోని ముఖ్య పరిణామాలు, వాటితో మనదేశ సంబంధాలు, పుస్తకాలు-రచయితలు.. వీటికి ప్రాధాన్యమివ్వాలి. అలాగే 8,9,10 తరగతుల సోషల్‌, సైన్స్‌ పాఠ్యాంశాల్లోని ముఖ్యాంశాలు చదువుకుంటే సరిపోతుంది. ఇస్రో తాజా అంతరిక్ష ప్రయోగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జనవరి 2023 నుంచి ముఖ్య పరిణామాలపై దృష్టి సారిస్తే ఎక్కువ మార్కులు పొందవచ్చు.

రీజనింగ్‌: నాన్‌ వెర్బల్‌ ప్రశ్నలు ఉంటాయి. ఎనాలజీ, పోలికలు, భేదాలు, స్పేషియల్‌ విజువలైజేషన్‌/ఓరియంటేషన్‌, విజువల్‌ మెమరీ, డిస్క్రిమినేషన్‌, అబ్జర్వేషన్‌, రిలేషన్‌షిప్‌ కాన్సెప్టులు, అరిథ్‌మెటికల్‌ రీజన్స్‌ అండ్‌ ఫిగర్‌ క్లాసిఫికేషన్‌, అరిథ్‌మెటికల్‌ నంబర్‌ సిరీస్‌, నాన్‌ వెర్బల్‌ సిరీస్‌, కోడింగ్‌-డీకోడింగ్‌.. అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు పెంచుకుని, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే, తక్కువ సమయంలో ఎక్కువ సమాధానాలు గుర్తించవచ్చు.

న్యూమరికల్‌ ఎబిలిటీ: అంకెలతో ముడిపడే ప్రశ్నలే ఎక్కువగా అడుగుతారు. అంకెల మధ్య సంబంధం, శాతాలు, సగటు, భిన్నాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వడ్డీ, డిస్కౌంట్‌, కొలతలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటిలో దాదాపు అన్నీ హైస్కూల్‌ మ్యాథ్స్‌ పుస్తకాల్లోనివే. వాటిని బాగా చదువుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే సరిపోతుంది.

కంప్యూటర్స్‌: ప్రాథమికాంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌ వర్డ్‌, కమ్యూనికేషన్‌, ఇంటర్నెట్‌, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వెబ్‌ బ్రౌజర్లు, సెర్చ్‌ ఇంజిన్లు, ఈమెయిల్‌, యూఆర్‌ఎల్‌, హెచ్‌టీటీపీ, వెబ్‌సైట్లు, బ్లాగులు, చాట్‌, వీడియో కాన్ఫరెన్స్‌లు..  వీటి గురించి తెలుసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని