TS Exam 2022: శక్తి నిల్వకు.. శరీర పోషణకు!

ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టే అందరూ తరచూ వినే పదాలు మంచి కొవ్వులు, చెడ్డ కొవ్వులు. అనుకూలమైనవి నాడీ వ్యవస్థ అభివృద్ధికి సాయపడితే, ప్రతికూలమైనవి గుండెపోటులాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ కొవ్వులు ఎక్కడ ఉంటాయి?

Updated : 30 Jul 2022 03:55 IST

జనరల్‌ స్టడీస్‌ - బయాలజీ

ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టే అందరూ తరచూ వినే పదాలు మంచి కొవ్వులు, చెడ్డ కొవ్వులు. అనుకూలమైనవి నాడీ వ్యవస్థ అభివృద్ధికి సాయపడితే, ప్రతికూలమైనవి గుండెపోటులాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ కొవ్వులు ఎక్కడ ఉంటాయి? ఎలాంటి విధులను నిర్వహిస్తాయి? శరీర పోషణ, శక్తి నిల్వలకు సంబంధించిన క్రియలు ఏవిధంగా జరుగుతాయి? ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

లిపిడ్‌లు, ప్రొటీన్‌లు

జీవుల్లో లిపిడ్‌లు, ప్రొటీన్‌లు నిర్మాణాత్మక, క్రియాత్మక విధులు నిర్వహిస్తాయి. శరీరం పెరుగుదలకు, వివిధ జీవక్రియలకు ఇవి అవసరం.

లిపిడ్‌లు 

ఇవి కణత్వచాల్లో భాగంగా ఉంటాయి. జీవక్రియలకు శక్తినిచ్చే శక్తి జనకాలుగా ఉపయోగపడతాయి. లిపిడ్‌ల రూపంలో మన శరీరం శక్తిని నిల్వ చేసుకుంటుంది. విటమిన్‌ ఎ, డిలను నిల్వ చేసుకోడానికి శరీరానికి లిపిడ్‌లు అవసరం. ఇవి నీటిలో కరగవు. కర్బన ద్రావణాల్లో కరుగుతాయి.

రకాలు: లిపిడ్‌లను సాధారణ, సంయుక్త, ఉత్పన్న లిపిడ్‌లని మూడు రకాలుగా విభజించారు. సాధారణ లిపిడ్‌లను తిరిగి కొవ్వులు, నూనెలు, మైనంగా వర్గీకరించారు. సంయుక్త లిపిడ్‌లను ఫాస్ఫోలిపిడ్‌లు, గ్లైకోలిపిడ్‌లు, సల్ఫోలిపిడ్‌లు, లిపో ప్రొటీన్లుగా వర్గీకరించారు. నిత్యజీవితంలో ఆహారంగా, వివిధ రకాలుగా వాడే కొవ్వులు, నూనెలు సాధారణ లిపిడ్‌లకు చెందినవి. ఇవి కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్‌తో ఉంటాయి. గది ఉష్ణోగ్రత వద్ద కొవ్వులు ఘనరూపంలో, నూనెలు ద్రవ రూపంలో ఉంటాయి.

కొవ్వులు, నూనెలు లభించే ఆహార పదార్థాలు: జంతువుల శరీరంలోని కొవ్వులతోపాటు, పాలు, పాల పదార్థాలైన వెన్న, పెరుగు, నెయ్యి, మొక్కల గింజల నుంచి లభించే నూనెలైన పొద్దుతిరుగుడు, వేరుశనగ, సోయా, నువ్వులనూనె; కొబ్బరి నూనె లాంటివి. అవే కాకుండా గుడ్డులోని పచ్చసొన, వనస్పతి నుంచి కొవ్వులు లభిస్తాయి.

కొవ్వు ఆమ్లాల రకాలు: కొవ్వులు, నూనెల్లోని కొవ్వు ఆమ్లాల్లో ఉండే కర్బన పరమాణుల మధ్య బంధాలను బట్టి రెండు రకాలుగా విభజించారు. 

1) సంతృప్త కొవ్వు ఆమ్లాలు

2) అసంతృప్త కొవ్వు ఆమ్లాలు

సంతృప్త కొవ్వు ఆమ్లాలు: బ్యుటరిక్, కాప్రోయిక్, మిరిస్టిక్, పామిటిక్, స్టియరిక్, అరాఖిడోనిక్, బెహినిక్, లారిక్‌ ఆమ్లాలను సంతృప్త కొవ్వులకు ఉదాహరణలుగా చెప్పొచ్చు. వీటిలో కర్బన పరమాణువుల మధ్య ఎలాంటి ద్విబంధాలు ఉండవు. ఇవి సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉంటాయి.

ఎక్కువగా ఉండే పదార్థాలు: జంతువుల కొవ్వులు, పాలు, వెన్న, గుడ్డులోని పచ్చసొన, వనస్పతి, పామోలిన్‌ నూనె, కొబ్బరి నూనెలు వీటికి ఉదాహరణలు. వీటిని ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ అయిన లో డెన్సిటీ లిపో ప్రొటీన్‌ (ఎల్‌డీఎల్‌), వెరీ లో డెన్సిటీ లిపో ప్రొటీన్‌ (వీఎల్‌డీఎల్‌) పెరుగుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ రక్తనాళాల్లో జమకూడి అథిరోస్ల్కీరోసిస్‌ అనే వ్యాధి వస్తుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌ జమకూడటంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. 

అసంతృప్త కొవ్వు ఆమ్లాలు: వీటిలోని కర్బన పరమాణువుల మధ్య ఉండే ద్విబంధాలను బట్టి రెండు రకాలుగా విభజించారు.ఇవి సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉంటాయి.

ఎ) మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు: వీటిలో కర్బన పరమాణువుల మధ్య ఒక ద్విబంధం ఉంటుంది. పామిటోలిక్, ఓలిక్, యూరిసిక్, నెర్వోనిక్‌ ఆమ్లాలు వీటికి ఉదాహరణ.

బి) పాలీ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు: ఈ కొవ్వు ఆమ్లాల్లో కర్బన పరమాణువుల మధ్య ఒకటి కంటే ఎక్కువ ద్విబంధాలుంటాయి. లినోలియిక్, లినోలెనిక్, అరాఖిడోనోయిక్‌ ఆమ్లాలను ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.  

ఎక్కువగా ఉండే పదార్థాలు: వేరుశనగ, ఆలివ్, అవిసె, సోయా, కుసుమ, చేప నూనెలు తదితరాలు. వీటివల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ అయిన  హై డెన్సిటీ లిపో ప్రొటీన్‌ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది.

ఒమేగా కొవ్వు ఆమ్లాలు: లినోలియిక్, లినోలెనిక్, అరాఖిడోనిక్, ఐకోసాపెంటానోయిక్, డొకోసా హెక్సానోయిక్‌ ఆమ్లాలు వీటికి ఉదాహరణలు. ఈ ఆమ్లాలు చేప నూనె, అవిసె గింజలు, సోయా, పొద్దుతిరుగుడు, వాల్‌నట్, చియా విత్తనాలు వంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి. నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఉపయోగపడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

ట్రైగ్లిజరైడ్‌లు: వీటినే తటస్థ కొవ్వులు అంటారు. కొవ్వు ఆమ్లాలు ట్రైగ్లిజరైడ్‌ల రూపంలో నిల్వ ఉంటాయి. అడిపోజ్‌  కణజాలంలో ఎక్కువగా ఉంటాయి.

ప్రొటీన్లు 

ప్రొటీన్లను మన శరీరానికి కావాల్సిన స్థూలపోషక పదార్థాలుగా చెప్పవచ్చు. ఇవి శరీర నిర్మాణానికి, పెరుగుదలకు చాలా అవసరం.

విధులు: ప్రొటీన్లు మన శరీరంలో గాయాలు మానడానికి, కణాల మరమ్మతుకు, ఎంజైమ్‌ల తయారీకి ఉపయోగపడతాయి. కణాల్లో అనుఘటకంగా ఉంటాయి. కొన్ని హార్మోన్‌ల తయారీకి ఇవి అవసరం. ప్రతిరక్షక దేహాల రూపంలో శరీరానికి వ్యాధినిరోధక శక్తిని కలిగిస్తాయి. రక్తం గడ్డకట్టడానికి, శరీరంలో వివిధ పదార్థాల రవాణాకు అవసరం.

ప్రొటీన్లలో ఉండే భాగాలను బట్టి వీటిని మూడు రకాలుగా విభజించారు. 

సరళ ప్రొటీన్లు: ఈ ప్రొటీన్లలో అమైనో ఆమ్లాలు మాత్రమే ఉంటాయి. వీటిని తిరిగి ఆల్బుమిన్‌లు, గ్లోబ్యూలిన్స్, గ్లూటిలిన్స్, ప్రోలమైన్స్, ఆల్బుమినాయిడ్‌లు, హిస్టోన్లుగా వర్గీకరించారు.

సంయుక్త ప్రొటీన్లు: ప్రొటీనేతర పదార్థాలతో కలిసి ఉంటాయి. వీటిని తిరిగి న్యూక్లియో, మ్యూకో, గ్లైకో, క్రోమో, ఫాస్ఫో, లిపో, మెటాల్లో ప్రొటీన్‌లుగా వర్గీకరించారు.

ఉత్పన్న ప్రొటీన్లు: ఇవి సరళ, సంయుక్త ప్రొటీన్‌ల నుంచి ఏర్పడతాయి. వీటిని తిరిగి ప్రాథమిక, ద్వితీయ ఉత్పన్న ప్రొటీన్‌లుగా వర్గీకరించారు. ప్రాథమిక ఉత్పన్న ప్రొటీన్‌లలో తిరిగి ప్రోటియాన్స్, మెటా ప్రొటీన్స్, కొయాగ్యులేటెడ్‌ ప్రొటీన్స్‌ ఉంటాయి. ద్వితీయ ఉత్పన్న ప్రొటీన్‌లలో తిరిగి ప్రోటియోసెస్, పెప్టోన్స్, పెప్టైడ్స్‌ అనే రకాలుంటాయి.

లభించే ఆహార పదార్థాలు: మాంసం, పాలు, పాల పదార్థాలైన పెరుగు, పనీర్, పప్పుధాన్యాలు, చిక్కుళ్లు, వేరుశనగ, సోయా, బాదం, గుడ్డులోని తెల్లసొన. అన్నింటి కంటే సోయాలో ఎక్కువ ప్రొటీన్‌లుంటాయి. జంతువుల నుంచి లభించే ప్రొటీన్‌లను మొదటి శ్రేణి ప్రొటీన్‌లు లేదా జీవశాస్త్రీయ పరిపూర్ణ ప్రొటీన్‌లు అంటారు. వీటిలో అన్ని ఆవశ్యక అమైనో ఆమ్లాలు ఉండటమే అందుకు కారణం. 

ఆవశ్యక అమైనో ఆమ్లాలు: మన శరీరానికి తప్పని సరైన అమైనో ఆమ్లాలను ఆవశ్యక అమైనో ఆమ్లాలు అంటారు. ఇవి శరీరంలో తయారు కావు. వీటిని తప్పనిసరిగా ఆహారం ద్వారా తీసుకోవాలి. ఇవి శరీర పెరుగుదలకు, రోగ నిరోధక శక్తికి ఉపయోగపడతాయి. ల్యూసిన్, ఐసోల్యూసిన్, లైసిన్, మిథియోనైన్, ఫినైల్‌ అలనిన్, థ్రియోనైన్, ట్రిప్టోఫాన్, వాలిన్‌ అనేవి ఆవశ్యక అమైనో ఆమ్లాలకు ఉదాహరణలు.ప్రొటీన్‌ల లోపం వల్ల క్వాషియార్కర్‌ వ్యాధి కలుగుతుంది.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని