ఆరోగ్య రక్షణకు.. ఆహార నిల్వకు!

తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం, కళ్లు తిరగడం, కడుపులో బాగోకపోవడం ఇవన్నీ తరచూ అందరికీ ఎదురయ్యే సమస్యలే. వీటి నివారణకు వివిధ మందులు, ఔషధాలను వినియోగిస్తుంటారు. ఆహారాన్ని నిల్వ చేయడానికి, ఆరోగ్య రక్షణకు ఇంకా అనేక అవసరాలకు రకరకాల రసాయనాలను వాడుతుంటారు.

Updated : 07 Aug 2022 06:54 IST

జనరల్‌ స్టడీస్‌  

రసాయన శాస్త్రం

తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం, కళ్లు తిరగడం, కడుపులో బాగోకపోవడం ఇవన్నీ తరచూ అందరికీ ఎదురయ్యే సమస్యలే. వీటి నివారణకు వివిధ మందులు, ఔషధాలను వినియోగిస్తుంటారు. ఆహారాన్ని నిల్వ చేయడానికి, ఆరోగ్య రక్షణకు ఇంకా అనేక అవసరాలకు రకరకాల రసాయనాలను వాడుతుంటారు. నిత్యజీవిత రసాయనశాస్త్రం అధ్యయనంలో భాగంగా ఏయే రసాయనాలను ఏవిధంగా ఉపయోగిస్తున్నారో అభ్యర్థులు తెలుసుకోవాలి.


మందులు - ఔషధాలు

జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ఆరోగ్యానికి, ఆహారం నిల్వకు, వ్యాధుల చికిత్సలో, కృత్రిమ తీపి కారకాల తయారీలో కొన్ని రకాల రసాయనాలను వినియోగిస్తారు. అవసరాల మేరకు వాటి నిర్మాణాల్లో మార్పులు చేస్తారు.

కీమోథెరపీ: వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో భాగంగా రసాయనాలను ఉపయోగించే విధానాన్నే కీమోథెరపీ అంటారు.

మందులు: 100 గీ నుంచి 500 గీ వరకు తక్కువ అణుభారాలు ఉన్న రసాయనాలను మందులు (డ్రగ్స్‌) అంటారు.పెద్ద పెద్ద అణుభారాలున్న లక్ష్యాలపై చర్య జరిపి జీవన ప్రక్రియలో మార్పు తెచ్చేందుకు వీటిని ఉపయోగిస్తారు.

ఉదా: మార్ఫిన్‌, కోడైన్‌, హెరాయిన్‌, కొకైన్‌, కెఫిన్‌ మందులు అంటే వ్యాధులను నయం చేసే రసాయనాలు. కానీ కొన్ని వ్యసనంగా మారే ధర్మాన్ని కలిగి ఉంటాయి.  శరీరంపై విపరీతమైన దుష్ఫలితాలను చూపిస్తాయి.

ఔషధాలు: వైద్యపరంగా వ్యాధి నిర్ధారణకు, నిరోధించడానికి, నయం చేయడానికి వాడే మందులను ఔషధాలు (మెడిసిన్‌) అంటారు. ఉదా: యాంటీపైరెటిక్‌లు, యాంటాసిడ్‌లు, యాంటిబయాటిక్‌లు. ఇవి వ్యసనంగా మారే లక్షణాన్ని కలిగి ఉండవు. అతి తక్కువ దుష్ఫలితాలు లేదా దుష్ఫలితాలు లేకుండా ఉంటాయి. మందులన్నీ ఔషధాలవుతాయి కానీ ఔషధాలన్నీ మందులు కావు.

అనాల్జిసిక్‌లు: శారీరక నొప్పులను తగ్గించడానికి ఉపయోగించే రసాయనాలకే అనాల్జిసిక్‌లని పేరు. ఇవి రెండు రకాలు.

నార్కోటిక్‌ అనాల్జిసిక్‌లు: ఇవి కేంద్రీయ నాడీవ్యవస్థను నిరుత్తేజపరిచే మందులు. ఇవి సుఖంగా ఉన్నామనే భ్రమ (అశంస-యూఫోరియా)ను కలగజేస్తాయి. అందుకే వాటిని వశపరచుకునే (ఎడిక్డివ్‌) మందులుగా వ్యవహరిస్తున్నారు. నార్కోటిక్‌ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. దీనికి ‘మగత కలిగించేది’ అని అర్థం.

ఉదా: ఆల్కలాయిడ్‌లు - మార్ఫిన్‌, కోడైన్‌, పపావరైన్‌, థేబైన్‌, మార్ఫిన్‌ సంబంధిత మందులను ఓపియాడ్‌ లేదా ఓపియేట్‌లుగా పేర్కొంటున్నారు. కారణం వీటిని ఓపియం మొక్క నుంచి పొందడమే. వీటిని అధిక డోసుల్లో తీసుకుంటే మూర్ఛ రావొచ్చు కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు.

* అతిసార వ్యాధి, శ్వాసలో ఇబ్బంది, తీవ్రమైన దగ్గు లాంటి వాటిని తగ్గించడం, నొప్పి ఉన్నప్పుడు నిద్రరావడానికి నార్కోటిక్‌ అనాల్జిసిక్‌లను ఉపయోగిస్తారు. ఈ మందులను వేసుకుంటే నొప్పి ఉన్నప్పటికీ తెలియదు. మత్తును కలిగించే గుణం మార్ఫిన్‌ కంటే కోడైన్‌కు తక్కువ.

నాన్‌-నార్కోటిక్‌ అనాల్జిసిక్‌లు: తలనొప్పి, ఒళ్లు నొప్పులు, బాధలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. వీటికి వ్యక్తులను వశపరచుకునే శక్తి లేదు. వీటి తయారీలో సాలిసిలేట్స్‌, అమైనో ఫినోల్స్‌, ఎనిలిన్స్‌, క్వినోలిన్‌ ఉత్పన్నాల రసాయనాలను వినియోగిస్తారు. ఎనిలిన్‌, ఎసిటానిలైడ్‌లు అనే వాటిని కోల్‌తార్‌ అనాల్జిసిక్‌లు అంటారు. కారణం వీటిని కోల్‌తార్‌ నుంచి సంగ్రహించడమే. ఉదా: ఆస్పిరిన్‌ - ఎసిటైల్‌ సాలిసిలిక్‌ ఆమ్లం (తిళీతి), నాప్రోగ్జిన్‌, అనాల్జిన్‌, నోవాల్జిన్‌, డైక్లోఫినాక్‌. ఆస్పిరిన్‌ను ఖాళీ కడుపుతో (ఏమీ తినకుండా) వేసుకోవద్దు. ఒకవేళ వాడితే అది అల్సర్‌కి దారితీస్తుంది.

యాంటీ పైరెటిక్‌లు: అధిక శరీర ఉష్ణోగ్రత స్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చి ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసే మందులను యాంటీపైౖరెటిక్‌లు అంటారు. ఉదా: పారాసిటమాల్‌, ఆస్పిరిన్‌, ఐబూప్రొపేన్‌ (ప్రొపనోయిక్‌ ఆమ్లానికి చెందిన ఆల్కైల్‌ లేదా అరైల్‌ ఉత్పన్నాలు)

* సాధారణంగా ఆస్పిరిన్‌, పారాసిటమాల్‌ లాంటి ఔషధాలు అనాల్జిసిక్‌లు, యాంటీ పైరెటిక్‌లుగా పనిచేస్తాయి.

యాంటీసెప్టిక్‌లు: సూక్ష్మక్రిముల పెరుగుదలను నిరోధించి, నాశనం చేసే రసాయనాలు. సాధారణంగా వీటిని పైపూతగా ఉపయోగిస్తారు. చర్మ ఉపరితలాలు, గాయాలు, పుండ్లను సూక్ష్మజీవరహితం చేసే ప్రక్రియలో అల్పగాఢతలో ఉపయోగిస్తారు. వీటిని టాబ్లెట్స్‌, ఇంజెక్షన్స్‌ రూపంలో శరీరం లోపలికి పంపకూడదు.

ఉదా: అన్ని రకాల శానిటైజర్‌లు, (ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌, బెంజాల్కోనియం క్లోరైడ్‌), టింక్చర్‌ అయోడిన్‌ (అయోడిన్‌ + ఆల్కహాల్‌), 0.1 శాతం ఫినోల్‌, డెటాల్‌ (క్లోరోగ్జైలినోల్‌ + ఆల్ఫా- టెర్‌ఫినోల్‌), బోరిక్‌ ఆమ్లం (బలహీన యాంటీసెప్టిక్‌ కాబట్టి కళ్లకు ఉపయోగిస్తారు), అయోడోఫామ్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ్బబీ2వీ2్శ, బిథియోనోల్‌ (యాంటీసెప్టిక్‌ సబ్బుల తయారీలో), ప్యూరాసిన్‌, సోఫ్రామైసిన్‌

క్రిమిసంహారిణులు: కిచెన్‌ ఫ్లోర్‌, బాత్‌రూం ఫ్లాట్‌ఫామ్స్‌ను సూక్ష్మజీవరహితం చేసే ప్రక్రియలో ఉపయోగించే రసాయనాలనే క్రిమిసంహారిణులు (డిస్‌ఇన్‌ఫెక్ట్‌ంట్‌్్స) అంటారు. సాధారణంగా వీటిని అధిక గాఢతల్లో ఉపయోగిస్తారు.

ఉదా: 1% ఫినోల్‌, సోడియం హైపో క్లోరైట్‌ (కరోనా సమయంలో విరివిగా ఉపయోగించారు.), 0.2 నుంచి 0.4 పిపిఎమ్‌ క్లోరిన్‌ ద్రవం, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ ద్రావణం, 4% ఫార్మలిన్‌ ద్రావణం (ఫార్మాల్డిహైడ్‌ 60% + నీరు 40%).

యాంటీ బయాటిక్‌లు: బ్యాక్టీరియాలను నిర్మూలించడానికి, వాటి వృద్ధిని ఆపడానికి రోగనిరోధక వ్యవస్థకు తోడ్పాటునందించే రసాయన ఔషధాలను యాంటీబయాటిక్‌లు అంటారు.
లాలాజలం, చెమటతోపాటు విడుదలయ్యే లాక్టిక్‌ ఆమ్లం, ఉదరంలోని హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం, కన్నీరు, ముక్కు నుంచి స్రవించే ద్రవాల్లో ఉండే లైసోజోమ్‌ లాంటి రసాయనాలు శరీరంలో విడుదలై సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తాయి. ఈ రక్షణ విధానం నిదానంగా జరిగితే పాథోజన్‌లు శరీరంలో కణజాలాల్లోకి ప్రవేశించి వ్యాధులను కలిగిస్తాయి.

యాంటీబయాటిక్‌లు రెండు రకాలు.

బ్యాక్టీరియోస్టాటిక్‌: బ్యాక్టీరియాల పెరుగుదలను నిరోధించే మందులు. ఉదా: యాంఫిసిలిన్‌, ఆమాగ్జిసిలిన్‌ (పెన్సిలిన్‌ మందు పడని వారికి ఉపయోగిస్తారు), ఎరిథ్రోమైసిన్‌, టెట్రాసైక్లిన్‌, క్లోరాంఫినాకోల్‌

బ్యాక్టరీసైడల్‌: బ్యాక్టీరియాలను నాశనం చేసే రసాయనాలు.

ఉదా: పెన్సిలిన్‌, ఓప్లాగ్జసీన్‌, అమైనో గ్లైకోసైడ్స్‌ 2 సల్ఫాడయాజిన్‌, స్ట్రెప్టోమైసిన్‌, అజిత్రోమైసిన్‌లను కూడా యాంటీబయాటిక్‌లుగా చెప్పవచ్చు.


ఆహార పదార్థ నిల్వకారిణులు:

క్కువ కాలం ఆహార పదార్థాలు పాడైపోకుండా నిల్వ ఉంచడానికి, వాటి ఆకర్షణను పెంచడానికి కలిపే రసాయన పదార్థాలను ఆహార పదార్థ నిల్వ కారిణులు అంటారు.పదార్థాలు పాడైపోవడం అనేది ఆక్సీకరణ చర్య.

సార్టిక్‌ ఆమ్లం, ప్రొపనోయిక్‌ ఆమ్లాల లవణాలను ఆహార పదార్థాల నిల్వకారిణులుగా ఉపయోగిస్తారు.

* సోడియం బెంజోయేట్‌ అనేది ఆహార పదార్థ నిల్వకారిణి. ఇది శరీరంలో హిప్యూరిక్‌ ఆమ్లంగా మారి మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. బ్యుటైలేటెడ్‌ హైడ్రాక్సీ టోలిన్‌, బ్యుటైలేటెడ్‌ హైడ్రాక్సీ ఎనిసోల్‌లను యాంటీఆక్సిడెంట్‌లుగా ఆహార పదార్థాలకు కలుపుతారు. 

* సల్ఫర్‌ డైఆక్సైడ్‌, సల్ఫైట్‌లను యాంటీఆక్సిడెంట్‌లుగా బీర్‌, వైన్‌ల తయారీలో ఉపయోగిస్తారు. అత్యల్ప తియ్యనైన సహజసిద్ధ చక్కెర లాక్టోజ్‌. రక్తంలో గ్లూకోజ్‌ ఉండటాన్ని గ్లైసీమియా అంటారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని