ఆహ్లాదానికి.. ఆర్థికవృద్ధికి!

ఆర్థిక వ్యవస్థకు, ఉపాధికి చోదక శక్తిగా పనిచేసే వాటిలో పర్యాటక రంగం ఒకటి. ఇది దేశ, విదేశీ యాత్రికులకు విజ్ఞాన, వినోదాలను అందించడంతోపాటు ప్రాంతాల ప్రగతికీ దోహదపడుతోంది. టూరిజానికి తెలంగాణ కూడా ప్రసిద్ధి చెందింది. విహారానికి, ఆహ్లాదానికి, ఉల్లాసానికి ప్రముఖ కేంద్రంగా మారింది.

Published : 24 Aug 2022 01:56 IST

జనరల్‌ స్టడీస్‌ తెలంగాణ భూగోళ శాస్త్రం

ఆర్థిక వ్యవస్థకు, ఉపాధికి చోదక శక్తిగా పనిచేసే వాటిలో పర్యాటక రంగం ఒకటి. ఇది దేశ, విదేశీ యాత్రికులకు విజ్ఞాన, వినోదాలను అందించడంతోపాటు ప్రాంతాల ప్రగతికీ దోహదపడుతోంది. టూరిజానికి తెలంగాణ కూడా ప్రసిద్ధి చెందింది. విహారానికి, ఆహ్లాదానికి, ఉల్లాసానికి ప్రముఖ కేంద్రంగా మారింది. అనేక రకాల దర్శనీయ స్థలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలు, వాటి విశిష్టతలను, అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల వివరాలను అభ్యర్థులు తెలుసుకోవాలి.


పర్యాటక రంగం

తెలంగాణ రాష్ట్రంలో ప్రాచీన చారిత్రక సంపద, వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఒక ప్రాంత అభివృద్ధికి సాంస్కృతిక అంశాలే కాకుండా భౌగోళికమైన శీతోష్ణస్థితి, ఎత్తయిన ప్రదేశాలు, జీవవైవిధ్యం, నదులు, జలపాతాలు లాంటివి కూడా ఎంతగానో దోహదపడతాయి. ప్రభుత్వం వాటిని పరిరక్షిస్తూ ఆధ్యాత్మిక కేంద్రాలను, ప్రకృతిసిద్ధ ప్రదేశాలను పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దుతోంది. రాష్ట్రంలో పర్యాటక రంగం ప్రగతికి ఒక మంత్రిత్వ శాఖ, చట్టబద్ధమైన టూరిజం కార్పొరేషన్‌ ఉంది.
అవార్డులు:
*
నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ట్రావెలర్‌ మ్యాగజీన్‌ వార్షిక గైడ్‌ 2015 ప్రకారం హైదరాబాద్‌ ప్రపంచంలో రెండో అత్యుత్తమ పర్యాటక ప్రదేశం.
* 2016 పోర్చుగల్‌ టూరిజం ఫిల్మ్‌ ఆర్ట్‌ అండ్‌ టూర్‌ ఫెస్టివల్‌ విభాగంలో ‘ఎమర్జింగ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌’లో విజేతగా తెలంగాణ నిలిచింది.
* ట్రావెల్‌, లీజర్‌ ఇండియా - దక్షిణాసియా పాఠకుల నుంచి ఉత్తమ పర్యాటక గమ్యస్థాన రాష్ట్రంగా తెలంగాణ గౌరవం పొందింది.
* 2018, డిసెంబరు 3న ఇండివుడ్‌ ఫిల్మ్‌ కార్నివాల్‌ నాలుగో ఎడిషన్‌లో ‘మోస్ట్‌ డైవర్సిఫైడ్‌ ఫిల్మ్‌ డెస్టినేషన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును తెలంగాణ అందుకుంది.
* 2017-18 సంవత్సరానికి తెలంగాణకు ‘జాతీయ పర్యాటక అవార్డు’ దక్కింది.


దేశ, విదేశీయుల రాక

తెలంగాణ పర్యాటక శాఖ 2019-20 నివేదిక ప్రకారం దేశంలో పర్యాటకానికి సంబంధించి తమిళనాడు, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. స్వదేశీ పర్యాటకులు అత్యధికంగా తెలంగాణలోని రాజన్న-సిరిసిల్ల, హైదరాబాద్‌, భద్రాద్రి జిల్లాలకు వస్తున్నారు. అత్యల్పంగా సూర్యాపేట, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. విదేశీ యాత్రికులు అత్యధికంగా హైదరాబాద్‌, హనుమకొండకు వస్తున్నారు. అత్యల్పంగా నిజామాబాద్‌, నారాయణ్‌పేట్‌ను సందర్శిస్తున్నారు. మొత్తం మీద స్వదేశీ, విదేశీ పర్యాటకులు రాజన్న-సిరిసిల్ల, హైదరాబాద్‌ జిల్లాలకు అత్యధికంగా వస్తున్నారు.


పర్యాటక వలయాలు

నాగర్‌కర్నూల్‌ పర్యాటక వలయం:
మల్లెల తీర్థం: శ్రీశైలం - హైదరాబాద్‌ అంతర్‌ రాష్ట్ర రహదారికి 8 కి.మీ. దూరంలో ఉన్న నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని ఈ ప్రాంతం సుందర జలపాతాలకు నిలయం.
శ్రీశైలం: తెలంగాణ సరిహద్దులో నల్లమల అడవులను ఆనుకొని నంద్యాల జిల్లాలో కృష్ణానది అవతల శ్రీగిరి పర్వతంపై ద్వాదశ జ్యోతిర్లింగం ఉంది.
ఫరాహబాద్‌: ఇది నాగర్‌కర్నూల్‌లో ఉంది. ఫరాహబాద్‌ అంటే ఆనంద శిఖరం అని అర్థం.
సోమశిల తీరం: కృష్ణానది తీరంలో సోమేశ్వరాలయం ఉంది. ఇక్కడి నదీ జలాలు వన్యప్రాణులకు నిలయాలు.
అక్కమహాదేవి: నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని ఈ ప్రాంతం ఆకుపచ్చని అడవులు, లోయలు, గుహలకు పేరుపొందింది.
మన్ననూర్‌: అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు కేంద్రంలో ఒక భాగం. ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉంది.
ఉమామహేశ్వరాలయం: ఇది  తీర్థయాత్రలకు అనువైన ప్రాంతం.పేదల ఊటీగా ప్రసిద్ధిచెందింది.

గిరిజన పర్యాటక వలయం:
ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురం భీమ్‌ జిల్లాల్లోని పర్యావరణ ప్రాంతాలను కలిపి పర్యాటక వలయంగా ఏర్పాటుచేశారు.
శ్యామ్‌గఢ్‌ కోట: గిరిజన వలయానికి ముఖద్వారం.
సప్తగుండాల: గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే ప్రాంతాలు.
డొక్ర మెటల్స్‌: లోహాలతో చేసిన ప్రత్యేక కళాఖండాలు. ఇటీవల వీటికి జీఐ ట్యాగ్‌ లభించింది.
గుహ్యమైన గుహలు: గిరిజన జాతుల సంస్కృతి, సంప్రదాయాలు, మతపరమైన స్థలాలు.
జోడెఘాట్‌: గిరిజన సంస్కృతికి నిలయం.
కుంతల: తెలంగాణలో అత్యంత ఎత్తయిన జలపాతం. ఇక్కడే కొరిటికల్లు, గాయత్రీ జలపాతాలు ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలోని గాయత్రి గుండం వాటర్‌ఫాల్స్‌ దగ్గర సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 4 వరకు మూడో వాటర్‌ రాప్పెలింగ్‌ వరల్డ్‌ కప్‌ - 2022ను నిర్వహిస్తారు.

గిరిసీమల వలయం:
ములుగు, భూపాలపల్లి జిల్లాల మధ్య ప్రాంతాలను కలిపి గిరిజన పర్యాటక, ప్రకృతి పర్యాటక వలయంగా అభివృద్ధి చేశారు.
బొగత: వాజేడు సమీపంలో గోదావరి ఉపనది చికువాగు నదిపై బొగత జలపాతం ఉంది. దీన్ని తెలంగాణ నయాగర అంటారు.
మేడారం: ప్రతి రెండేళ్లకు ఒకసారి గిరిజన సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. దీన్ని తెలంగాణ కుంభమేళా అంటారు.
లక్నవరం: ఏడు ఆకుపచ్చని దీవులు, వేలాడే వంతెన, సరస్సు ఉన్న పర్యాటక కేంద్రం.
రామప్ప: ఇటీవల ఈ ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించింది.

వారసత్వ పర్యాటక వలయం:
కుతుబ్‌షాహీ పార్క్‌: గోల్కొండ సమీపంలో పాలకులు నిర్మించిన సమాధులు, మసీదులు ఈ పార్కులో ఉన్నాయి.
చార్మినార్‌: 1591లో ప్లేగు వ్యాధి నివారణకు చిహ్నంగా హైదరాబాద్‌ నడిబొడ్డున 48.7 మీటర్ల ఎత్తులో నిర్మించారు. వాటితో పాటుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌,  లంగర్‌హౌస్‌, లుంబినీ పార్కు, ట్యాంక్‌బండ్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ, లాడ్‌బజార్‌ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలు.


స్థలాలు - విభజన

చారిత్రక, సాంస్కృతిక కట్టడాలు: ఇందులో పురాతన కట్టడాలు, శిల్పాలు, ఆర్కిటెక్ట్‌, శాసనాలు, చారిత్రక, వారసత్వకట్టడాలు, సాంస్కృతిక కేంద్రాలు ఉంటాయి.
ఉదా: చిత్తోర్‌ఘఢ్‌ కోట - రాజస్థాన్‌, ఎర్రకోట - దిల్లీ, రాక్‌ గార్డెన్‌ - ఛండీగఢ్‌, ఖజురహో శిల్పాలు - మధ్యప్రదేశ్‌, అజంతా గుహలు - మహారాష్ట్ర,                 కాకతీయుల కోట - వరంగల్‌.
దర్శనీయ, ఆధ్యాత్మిక కేంద్రాలు: వీటిలో ప్రాచీన దేవాలయాల సంస్కృతీ సంప్రదాయాలు, చారిత్రక ప్రాముఖ్యం కలిగిన పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉంటాయి.
ఉదా: ద్వారక - గుజరాత్‌, మాతా వైష్ణవీదేవి - జమ్మూ కశ్మీర్‌, బద్రీనాథ్‌ - ఉత్తరాఖండ్‌, ఉజ్జయిని - మధ్యప్రదేశ్‌, షిర్డీ - విదర్భ పీఠభూమి, తిరుపతి - ఆంధ్రప్రదేశ్‌,  వేములవాడ - తెలంగాణ
ప్రకృతి సుందర ప్రదేశాలు: సహజసిద్ధమైన ప్రకృతి, సహజ రమణీయ ప్రాంతాలు, అందమైన జలపాతాలు, తీరప్రాంతాలు, ఎత్తయిన పర్వత శ్రేణులు, మంచు ప్రదేశాలు వీటి కిందకు వస్తాయి.
ఉదా: క్యాసినో బీచ్‌ - బ్రెజిల్‌, మియామి బీచ్‌ - అమెరికా, ధర్మశాల - హిమాచల్‌ ప్రదేశ్‌, మెరీనా బీచ్‌ - చెన్నై, బొగత, కుంతల జలపాతం - తెలంగాణ, అరకు లోయ - ఆంధ్రప్రదేశ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని