ప్రతి ఫ్రెండూ అవసరమేనా?

విద్యార్థుల జీవితంలో స్నేహితులది ప్రత్యేకస్థానం. అమ్మానాన్నలతో చెప్పుకోని, చెప్పలేని విషయాలను సైతం స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. చిన్నవయసులో ఏర్పడే ఈ బంధాలు చాలావరకూ జీవితాంతం నిలిచి ఉంటాయి.

Published : 18 Oct 2022 00:49 IST

విద్యార్థుల జీవితంలో స్నేహితులది ప్రత్యేకస్థానం. అమ్మానాన్నలతో చెప్పుకోని, చెప్పలేని విషయాలను సైతం స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. చిన్నవయసులో ఏర్పడే ఈ బంధాలు చాలావరకూ జీవితాంతం నిలిచి ఉంటాయి. కానీ అదే సమయంలో చెడు స్నేహాలకూ ఆస్కారం లేకపోలేదు. చెడ్డవారితో దోస్తీ మనపై చదువులపరంగా, వ్యక్తిగతంగా దుష్ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి లేనిపోని ఇబ్బందులనూ కొనితెస్తుంది. మరి ఇలాంటివారిని గుర్తించడం ఎలా?... దూరంగా ఉంచడం ఎలా?
తెలుసుకుందాం..

* ఎవరు చెడు నేస్తాలు అనేందుకు సమాధానాలు చాలానే ఉన్నాయి. సరదాగానైనా సరే మన రూపురేఖలను, అలవాట్లను, తెలివితేటలను, ఆర్థిక పరిస్థితులను, కుటుంబ సభ్యులను గేలి చేస్తూ... మనం అభద్రతాభావానికి గురయ్యేలా చేసేవారు ఈ కోవకు చెందుతారు.

* ‘నీకేం తెలీదు, నేను చెబుతా ఉండు’ అంటూ పెత్తనం చేసేవారు, ఇతరుల పట్ల మర్యాద లేకుండా ప్రవర్తించేవారు, చెడు వ్యసనాలు అలవాటు చేసేవారు... వీరంతా సరైన ఫ్రెండ్స్‌ కాదనే చెప్పాలి. మీరు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ప్రవర్తిస్తూ వదంతులు పుట్టించడం వీరికి బాగా అలవాటు.

* అక్కర్లేని విషయాలు చర్చించడం, స్వార్థంగా ఆలోచించడం, అన్నింటికీ విమర్శించడం, ప్రతి విషయంలోనూ మీతో పోల్చుకోవడం, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం... ఇలా చేస్తున్నారంటే మీరు జాగ్రత్తపడాలన్నమాటే.

* వీరి పద్ధతి నచ్చకపోయినా, మరిన్ని అవకాశాలు ఇస్తూ ఉంటే.. చివరికి మిమ్మల్ని మీరు కోల్పోతారు. దీనివల్ల చదువులో శ్రద్ధ చూపలేకపోవడం, ఏకాగ్రత లోపించడం, ఆత్మస్థైర్యం కోల్పోవడం, ఎప్పుడూ బాధలో మునిగిపోవడం వంటివి జరుగుతాయి. మానసికంగా కుంగిపోతారు.

ఆచరిద్దాం..

* ‘ఎంతైనా మన ఫ్రెండే కదా!’ అని సర్దుకుపోవడం మొదలుపెడితే దానికి ఇక అంతం ఉండదు. మంచి స్నేహితులు తెలియక చేసే పొరపాటుకీ, చెడు స్నేహితులు అలవాటుగా చేసే పనులకీ తేడా ఉంటుంది. మనం గమనిస్తే అది సులువుగా అర్థమవుతుంది.

* ‘నో’ చెప్పడం కూడా ఒక కళ. మీపై చెడు ప్రభావం  కలిగిస్తున్న స్నేహితులకు నో చెప్పడం నేర్చుకోండి. వారు మిమ్మల్ని ఎల్లవేళలా అదుపు చేయలేరని, మీకంటూ ఓ ఆలోచన - నిర్ణయం ఉంటాయనే విషయాన్ని వారికి తెలియజేయండి.

చేతన-సాధన

* ఒకేసారి వారిని వదిలించుకోలేకపోయినా... మెల్లమెల్లగా దూరం పెడుతూ రావొచ్చు. మీపట్ల సరైన ప్రవర్తనతో లేకపోతే ఈ స్నేహం నిలవదనే విషయాన్ని కచ్చితంగా తెలియజేయండి. అవసరం అయితే తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల సాయం తీసుకోండి.

* నమ్మదగిన వ్యక్తులు, కొత్తవారితో స్నేహం చేయడం... ఎదుటివారి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే వారికి దగ్గరకావడం వల్ల చెడు వ్యక్తుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. కాలేజీ రోజులు దాటాక కూడా మీతో ప్రయాణించగలరనే నమ్మకం ఉన్న స్నేహితుల కోసమే సమయం ఇవ్వండి. మీ స్నేహం చాలా విలువైనది... ఆ విలువ తెలిసిన వారినే మిత్రులుగా ఎన్నుకోండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని