మధుమేహ పిల్లలకు కృత్రిమ క్లోమ వరం

రక్తంలో గ్లూకోజు నియంత్రణకు ఇన్సులిన్‌ అత్యవసరం. దీన్ని క్లోమగ్రంథిలోని కణాలు ఉత్పత్తి చేస్తాయి. టైప్‌1 మధుమేహంలో ఈ కణాలు దెబ్బతింటాయి. దీంతో గ్లూకోజు నియంత్రణ వ్యవస్థ కొరవడుతుంది.

Updated : 25 Jan 2022 05:10 IST

క్తంలో గ్లూకోజు నియంత్రణకు ఇన్సులిన్‌ అత్యవసరం. దీన్ని క్లోమగ్రంథిలోని కణాలు ఉత్పత్తి చేస్తాయి. టైప్‌1 మధుమేహంలో ఈ కణాలు దెబ్బతింటాయి. దీంతో గ్లూకోజు నియంత్రణ వ్యవస్థ కొరవడుతుంది. వీరికి ఇంజెక్షన్లు, పంప్‌ల ద్వారా ఇన్సులిన్‌ ఇవ్వటం తప్పించి మరో మార్గం లేదు. అయితే టైప్‌1 మధుమేహం బారినపడ్డ పిల్లలకు చికిత్స చేయటం కష్టం. పిల్లలు ఎప్పుడు తింటారో తెలియదు. ఎప్పుడు వ్యాయామం చేస్తారో తెలియదు. అందువల్ల ఇవ్వాల్సిన ఇన్సులిన్‌ మోతాదులను తరచూ మార్చుకోవాల్సి వస్తుంది. ఇలాంటివారి కోసం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధకులు స్మార్ట్‌ఫోన్‌ యాప్‌తో అనుసంధానమయ్యే ‘కృత్రిమ పాంక్రియాస్‌’ను రూపొందించారు. ఇది సమర్థంగా, సురక్షితంగా పనిచేస్తున్నట్టు బయటపడింది. ప్రస్తుతం టైప్‌1 మధుమేహం గల పిల్లలకు సెన్సర్‌-ఆగ్మెంటెడ్‌ పంప్‌ చికిత్సను ప్రామాణికంగా భావిస్తున్నారు. ఇందులో చర్మం కింద అమర్చే సెన్సర్‌ గ్లూకోజు మోతాదులను పసిగడుతుంది. దీని ఆధారంగా ఇన్సులిన్‌ మోతాదులను నిర్ణయించుకుంటే పంప్‌ తనకు తానే ఆయా సమయాలకు ఇన్సులిన్‌ ఇచ్చేస్తుంది. అంటే మన శరీరంలోని క్లోమగ్రంథి మాదిరిగానే ఎంత ఇన్సులిన్‌ అవసరమో అంత వరకే విడుదల చేస్తుందన్నమాట. అందుకే దీన్ని కృత్రిమ పాంక్రియాస్‌ వ్యవస్థని పిలుచుకుంటున్నారు. కాకపోతే ఎప్పుడెంత ఇన్సులిన్‌ అవసరమనేది రాత్రి, పగలు చూసుకొని సరిచేసుకోవాల్సి ఉంటుంది. తాజా కృత్రిమ పాంక్రియాస్‌ వ్యవస్థతో ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఇందులో పిల్లల చర్మం కింద అమర్చే గ్లూకోజు సెన్సర్‌, ఇన్సులిన్‌ పంప్‌లు వైర్‌లెస్‌గా యాప్‌తో అనుసంధానమై పనిచేస్తాయి. సెన్సర్‌ ద్వారా అందే సమాచారం ఆధారంగా యాప్‌ ఎప్పటికప్పుడు గ్లూకోజు స్థాయులను పసిగడుతుంది. తనకు తానే ఎంత ఇన్సులిన్‌ అవసరమనేది నిర్ణయిస్తుంది. దీంతో గ్లూకోజు మోతాదులు తగ్గుతున్నాయా అని నిరంతరం కనిపెట్టుకోవాల్సిన అవసరం తప్పుతుంది. ఇది తల్లిదండ్రులకు, పిల్లలకు ఎంతగానో మేలు చేయగలదని ఆశిస్తున్నారు. మధుమేహ పిల్లల్లో గ్లూకోజు నియంత్రణలో ఉండేలా చూడటం చాలా ముఖ్యం. ఎందుకంటే దీర్ఘకాలంగా రక్తంలో గ్లూకోజు మోతాదులు ఎక్కువగా ఉంటూ వస్తుంటే రక్తనాళాలు, నాడులు దెబ్బతింటాయి. దీంతో గుండె, కిడ్నీ, కళ్ల జబ్బుల వంటి సమస్యలు మొదలవుతాయి. గ్లూకోజు నియంత్రణలో ఉంటే ఇలాంటి దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొత్త కృత్రిమ పాంక్రియాస్‌ వరంలా ఆదుకుంటుందని ఆశిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని