ఎందుకీ అయోమయం

నాకు ఇద్దరు పిల్లలు. చిన్న బాబుకు 14 ఏళ్లు. 9వ తరగతి చదువుతున్నాడు. చదువులో వెనకబడ్డాడు. కాస్త అయోమయంగా ఉన్నట్టు కనిపిస్తాడు. ప్రవర్తన, పని చేసే తీరు నిదానంగా ఉంటుంది. మూడేళ్ల క్రితం మెదడు ఎంఆర్‌ఐ పరీక్ష చేయించాం. ఏమీ సమస్య లేదన్నారు. కానీ నిద్రలో పళ్లు కొరుకుతాడు.

Published : 06 Sep 2022 01:02 IST

సమస్య - సలహా?

సమస్య: నాకు ఇద్దరు పిల్లలు. చిన్న బాబుకు 14 ఏళ్లు. 9వ తరగతి చదువుతున్నాడు. చదువులో వెనకబడ్డాడు. కాస్త అయోమయంగా ఉన్నట్టు కనిపిస్తాడు. ప్రవర్తన, పని చేసే తీరు నిదానంగా ఉంటుంది. మూడేళ్ల క్రితం మెదడు ఎంఆర్‌ఐ పరీక్ష చేయించాం. ఏమీ సమస్య లేదన్నారు. కానీ నిద్రలో పళ్లు కొరుకుతాడు. పడుకున్న వెంటనే నిద్రపోతాడు. అవసరమైనప్పుడు మధ్యలో ఎంత లేపినా లేవడు. మాది మేనరిక వివాహం. పెళ్లయ్యాక మూడేళ్లకు నా భర్తకు మూర్ఛ మొదలైంది. ఆయన ఇటీవలే మరణించారు. బతికి ఉన్నంతకాలం మందులు వాడారు. దాని వల్ల ఇంకా ఎక్కువగా భయపడుతున్నాం. దయచేసి మా పిల్లాడి సమస్యకు పరిష్కారం తెలపగలరు.

- మాధవి పి. (ఈమెయిల్‌)

సలహా: పుట్టినప్పుడు పిల్లాడు వెంటనే ఏడ్చాడా? ఏదైనా ప్రత్యేక చికిత్స అవసరమైందా? తొలి సంవత్సరాల్లో మాట, నడక సమయానికి వచ్చాయా? బడిలో చేర్పించాక చదువు త్వరగా అబ్బిందా? లేదా? వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మీ బాబును విశ్లేషించాల్సి ఉంటుంది. ఐక్యూ పరీక్ష చేయించాల్సి ఉంటుంది. దీని ద్వారా వయసు ప్రకారం మెదడు ఎదిగిందా? లేదా? అనేది బయటపడుతుంది. ఐక్యూ తక్కువుంటే తమ వయసు పిల్లలతో కలవలేకపోవచ్చు. చదివింది అర్థం కాకపోవచ్చు. చదువులో వెనకబడిపోవచ్చు. ఫలితంగా అయోమయంగా ఉన్నట్టు ప్రవర్తించొచ్చు. మీరు మెదడు స్కాన్‌ చేయించామని, సమస్యలేవీ లేవని అంటున్నారు. మరీ పెద్ద సమస్యలుంటే తప్ప ఇందులో ఐక్యూ ఎలా ఉందనేది తెలియదు. ఐక్యూ పరీక్షతోనే ఎదుగుదలలో ఇబ్బందులుంటే బయటపడతాయి. అలాగే ఏకాగ్రత లోపంతో బాధపడుతున్నాడేమో కూడా చూడాల్సి ఉంటుంది. ఏకాగ్రత కుదరకపోతే పిల్లలు పగటి కలలు కంటున్నట్టుగా కనిపిస్తారు. ప్రశ్నలు అడిగినా వాళ్ల లోకంలో వాళ్లుంటారు. రెండు మూడు సార్లు అడిగితే గానీ జవాబు చెప్పరు. నిదానంగా స్పందిస్తుంటారు. కొందరు కాస్త భయంగా, ఆందోళన చెందుతున్నట్టుగానూ ఉండొచ్చు. తరచూ వస్తువులు పోగొట్టుకోవటం, నోట్స్‌ పూర్తి చేయలేకపోవటం, స్పెల్లింగులు తప్పుగా రాయటం వంటివి చేస్తుంటారు. కొందరికి నేర్చుకోవటంలోనూ లోపం (లెర్నింగ్‌ డిసేబిలిటీ) ఉండొచ్చు. ఇందులో ఐక్యూ బాగానే ఉన్నా కొన్ని సబ్జెక్టులు సరిగా అర్థం కావు. మీ బాబుకు ఈ మూడింటిలో ఏదో ఒక సమస్య ఉండొచ్చని అనిపిస్తోంది. ఆయా పరీక్షలతో వీటిని గుర్తించాల్సి ఉంటుంది. కారణాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఎదుగుదల లోపం, నేర్చుకోవటంలో లోపానికి మందులేవీ ఉండవు. వీటిని అధిగమించటానికి ప్రత్యేక శిక్షణ అవసరం. ఏకాగ్రత లోపానికి మందులు ఉపయోగపడతాయి. మానసిక చికిత్స నిపుణులను సంప్రదిస్తే తగు పరిష్కారం సూచిస్తారు. పిల్లలు గాఢంగా నిద్రపోవటం సమస్యేమీ కాదు. దీనికి భయపడాల్సిన పనిలేదు. తండ్రి వాడిన మందులకు పిల్లాడి సమస్యకు సంబంధం లేదు.

ఎందుకీ అయోమయం?
మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన ఈమెయిల్‌ చిరునామా: sukhi@eenadu.in

- డా।। శ్రీలక్ష్మి పింగళి, సైకియాట్రిస్ట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని