శిశువులకు గాలి కాలుష్యం దెబ్బ

శిశువు శరీరం చాలా సున్నితం. అప్పుడప్పుడే ఎదుగుతూ వస్తుంటుంది. అభివృద్ధి దశలన్నీ పురుడు పోసుకోవటం ఆరంభిస్తుంటాయి. ఇలాంటి స్థితిలో శిశువులను గాలి కాలుష్యం బారినపడకుండా చూసుకోవటం చాలా మంచిదని అమెరికాలోని యూనివర్సిటీ

Published : 13 Sep 2022 00:38 IST

శిశువు శరీరం చాలా సున్నితం. అప్పుడప్పుడే ఎదుగుతూ వస్తుంటుంది. అభివృద్ధి దశలన్నీ పురుడు పోసుకోవటం ఆరంభిస్తుంటాయి. ఇలాంటి స్థితిలో శిశువులను గాలి కాలుష్యం బారినపడకుండా చూసుకోవటం చాలా మంచిదని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో బౌల్డర్‌ తాజా అధ్యయనం సూచిస్తోంది. తొలి ఆరు నెలల వయసులో గాలి కాలుష్యానికి గురైతే అలర్జీలు, ఊబకాయం, మధుమేహం ముప్పులను పెంచేలా పిల్లల్లో పేగుల్లోని బ్యాక్టీరియా మారిపోతున్నట్టు తేలింది మరి. ఇది మెదడు ఎదుగుదలనూ ప్రభావితం చేస్తున్నట్టు బయటపడింది. వాహనాలు, కార్చిచ్చులు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య కారకాలను పీల్చుకోవటానికీ శిశువుల పేగుల్లోని బ్యాక్టీరియా ఆరోగ్యానికీ మధ్య సంబంధం ఉంటున్నట్టు ఈ అధ్యయనం తొలిసారి నిరూపించింది. పుట్టినప్పుడు శిశువుల పేగుల్లో కొద్దిగానే బ్యాక్టీరియా ఉంటుంది. తల్లి పాలు, ఘనాహారం, యాంటీబయాటిక్‌ మందులు, ఇతర పర్యావరణ ప్రభావాల వంటివన్నీ క్రమంగా వీటిని తీర్చిదిద్దుతూ వస్తుంటాయి. రోగనిరోధక వ్యవస్థ పనితీరుతో పాటు ఆరోగ్యం మీదా ఇవి గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని