మలంలో ఎర్ర లైటు

ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఎర్ర లైటు పడితే ఎంతటి వాహనమైనా ఆగిపోవాల్సిందే. కాదని ముందుకు సాగితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. శరీరం కూడా ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి సంకేతాలు, హెచ్చరికలు చేస్తూనే ఉంటుంది. వీటిని సకాలంలో గుర్తించి, స్పందిస్తే పెను ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు.

Updated : 18 Oct 2022 06:46 IST

ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఎర్ర లైటు పడితే ఎంతటి వాహనమైనా ఆగిపోవాల్సిందే. కాదని ముందుకు సాగితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. శరీరం కూడా ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి సంకేతాలు, హెచ్చరికలు చేస్తూనే ఉంటుంది. వీటిని సకాలంలో గుర్తించి, స్పందిస్తే పెను ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో ఇది అత్యంత అవసరం. అలాంటి హెచ్చరికల్లో ఒకటి మలంలో రక్తం పడటం. శిశువులైతే నోటితో సమస్యను చెప్పుకోలేరు. కాస్త పెద్ద పిల్లలకు మాటలొచ్చినా అదొక సమస్యనీ అనుకోకపోవచ్చు. పెద్దవాళ్లుగా మనమే గమనించి, జాగ్రత్త పడాల్సి ఉంటుంది.

మలంలో రక్తం పడితే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. పిల్లల్లోనైతే ఇది మరింత కలవరం కలిగిస్తుంది. నిజానికిది అరుదైనదేమీ కాదు. తరచూ చూసేదే. మలంలో కొద్దిగా రక్తం కలిసినా చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనవుతుంటారు. మంచి విషయం ఏంటంటే- పిల్లల్లో ఇది చాలావరకు దానంతటదే కుదురుకోవటం. లక్షణాలు, ఇబ్బందుల తీరుతెన్నులను పరిశీలించటం ద్వారా కారణాన్నీ తేలికగానే గుర్తించొచ్చు. పేగుల చివరి భాగం నుంచి రక్తస్రావమైతే అది బాగా ఎర్రగా కొట్టొచ్చినట్టు (హెమటోకేజియా) కనిపిస్తుంది. అదే పైభాగంలో రక్తస్రావమైతే రంగు మారిపోయి (మలేనా) కనిపిస్తుంది. ఏదేమైనా పిల్లల్లో రక్తస్రావాన్ని తేలికగా తీసుకోవటం తగదు. రక్తస్రావం దానికదే గానీ చికిత్సతో గానీ ఆగిపోయినా కూడా వీలైనంత త్వరగా పిల్లలను తిరిగి గాడిలో పడేలా చూడటం ముఖ్యం. ఎందుకంటే వీరిలో రక్తం మోతాదు తక్కువగా ఉంటుంది. రక్తం మోతాదులో 10% కన్నా ఎక్కువగా తగ్గితే అత్యవసర విభాగంలో చేర్చి, జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. పిల్లల్లో మలద్వారం నుంచి రక్తం పడటానికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. ఇవి వయసును బట్టి మారిపోతుంటాయి కూడా. నవజాత శిశువుల్లోనైతే మలద్వారం వద్ద చీలికలు (ఫిషర్స్‌) ఏర్పడటం ప్రధాన కారణం. తల్లి రక్తాన్ని మింగటం, పేగుల్లో ఇన్‌ఫెక్షన్‌, పుట్టుకతోనే పేగులు మెలితిరగటం వంటివీ కారణం కావొచ్చు. నెల నుంచి ఏడాది వయసు పిల్లలో- చీలికలు, పేగు భాగం పక్కనున్న పేగులోకి చొచ్చుకెళ్లటం, పేగుల్లో తిత్తులు, సూక్ష్మ రక్తనాళాలు ఉబ్బటం, పేగు పూత వంటివి సమస్యను తెచ్చిపెట్టొచు. ఇంకాస్త పెద్ద పిల్లల్లో పెద్ద పేగులో పిలకలూ ఏర్పడొచ్చు. ఇవన్నీ మల ద్వారం నుంచి రక్తం పడేలా చేయొచ్చు. కాబట్టి వీటి గురించి సవివరంగా తెలుసుకొని ఉండటం మంచిది.

తిత్తులు (మెకెల్స్‌ డైవర్టికులమ్‌)
పిండం ఏర్పడుతున్నప్పుడు బొడ్డు తాడు ద్వారా పేగుల్లోకి వెళ్లే నాళం (ఓంఫాలోమెసెంట్రిక్‌ డక్ట్‌) పుట్టిన తర్వాత మూసుకుపోతుంది. కానీ కొందరిలో మూసుకోకపోవచ్చు. ఇది రకరకాల రూపాల్లో బయటపడుతుంటుంది. వీటిల్లో ఒకటి మెకెల్స్‌ డైవర్టికులమ్‌. ఇది పేగు వెలుపలి భాగానికి తిత్తి అంటుకొని ఉన్నట్టు కనిపిస్తుంది. సాధారణంగా పెద్దపేగు, చిన్నపేగు కలిసే చోటు నుంచి 2 అడుగుల దూరంలో తిత్తి ఏర్పడుతుంది. దీన్నుంచి ఆమ్లం విడుదల కావటం వల్ల కొందరిలో చిన్నపేగుల్లో పుండ్లు పడొచ్చు. దీంతో నొప్పి లేకుండానే మలద్వారం నుంచి పెద్ద మొత్తంలో రక్తం పడుతుంటుంది.
* పేగుల్లో తిత్తి ఏర్పడినవారిలో కేవలం 2% మందిలోనే రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇవి గలవారికే చికిత్స అవసరం. వీరికి తిత్తి తలెత్తిన పేగు భాగాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి ఉంటుంది. తర్వాత పేగుల చివర్లను కలిపి, లోపలి మార్గం యథావిధిగా ఉండేలా చూస్తారు. ఎలాంటి లక్షణాలూ లేకపోతే తిత్తిని అలాగే వదిలేయొచ్చు.

చీలికలు (ఫిషర్స్‌) ప్రధానం
పెద్దవారిలోనే కాదు, పిల్లల్లోనూ మలద్వారం వద్ద చీలికలు ఏర్పడొచ్చు. తొలి రెండేళ్లలో జీర్ణకోశం కింది భాగంలో రక్తస్రావం కావటానికి ప్రధాన కారణమిదే. దీనికి కారణం మలాశయం, మలద్వారం మధ్యలో పేగు కిందికి సాగే చోట బిగువు (యానోరెక్టల్‌ యాంగ్యులేషన్‌) ఏర్పడకపోవటం. పెద్ద పేగు చివరి భాగంలో బయటి వైపు నుంచి ప్యూబోరెక్టాలిస్‌ అనే కండరం వలయంలా చుట్టుకొని ఉంటుంది. ఇది పేగును ముందు వైపునకు లాగుతూ మలాన్ని పట్టి ఉంచుతుంది. విసర్జన సమయంలో మలం నెట్టుకొని వస్తున్నప్పుడిది వదులవుతుంది. అప్పుడు పేగు బిగువు తగ్గి, మలం నెమ్మదిగా కిందికి వస్తుంది. అయితే శిశువుల్లో ఈ బిగువు ఏర్పడదు. వృద్ధుల్లోనైతే కండరాలు బలహీన పడటం వల్ల బిగువు పోతుంది. దీంతో మలం బలంగా కిందికి దూసుకొస్తూ మలద్వార గోడలను తాకుతుంది. ఫలితంగా అక్కడి పైపొరలో చీలికలు ఏర్పడతాయి. విసర్జన అనంతరం ఎర్రటి రక్తం చుక్కలు చుక్కలుగా పడుతుంది. మలం మీద రక్తం చారికలూ కనిపిస్తాయి. ఈ సమయంలో చాలా నొప్పి కలుగుతుంది. దీంతో పిల్లలు విసర్జనకు వెళ్లటానికి వెనకాడుతుంటారు. చీలికల సమస్య రోజుల పిల్లల్లోనూ ఎక్కువగానే కనిపిస్తుంది.
* ఫిషర్స్‌ను నిర్లక్ష్యం చేయటం తగదు. ఇవి మానటానికి మలం మృదువుగా వచ్చేలా చూడటం ముఖ్యం. విసర్జన సాఫీగా అయ్యేలా చేసే మందులు, చీలికలు మానటానికి తోడ్పడే పూత మందులు, నొప్పి తెలియకుండా చేసే పూత మందులు ఉపయోగపడతాయి. కాస్త పెద్ద పిల్లలైతే పీచు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి.

పేగు పూత (ఐబీడీ)
కొందరికి పేగుల్లో పూత (ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజ్‌) మూలంగానూ మలంలో రక్తం పడొచ్చు. పూత తలెత్తిన చోట పేగు వాచి, ఉబ్బుతుంది. ఎర్రగా అవుతుంది. ఇదో దీర్ఘకాలిక సమస్య. వచ్చి పోతూ ఉంటుంది. పేగు పూతలో అల్సరేటివ్‌ కొలైటిస్‌, క్రోన్స్‌ అని రెండు సమస్యలుంటాయి. అల్సరేటివ్‌ కొలైటిస్‌ పెద్ద పేగుకే పరిమితమవుతుంది. పేగు పైపొరల్లోనే పుండ్లు ఏర్పడతాయి. అదే క్రాన్స్‌ జబ్బు పేగుల్లో ఎక్కడైనా తలెత్తొచ్చు. ఇది పేగుల్లోని అన్ని పొరలనూ ప్రభావితం చేస్తుంది. ఇవి రెండూ మలద్వారం నుంచి రక్తం పడటంతోనే బయటపడుతుంటాయి. విపరీతమైన కడుపునొప్పి, నీళ్ల విరేచనాలు, బరువు తగ్గటం, జ్వరం, తీవ్రమైన బలహీనత వంటి లక్షణాలూ వేధిస్తుంటాయి. ఇది కంటి జబ్బులు, దద్దు, కీళ్లనొప్పులు, కీళ్ల వాపు, కాలేయ జబ్బుల వంటి ఇతరత్రా సమస్యలకూ దారితీయొచ్చు.
* పేగు పూత ఎందుకొస్తుందనేది కచ్చితంగా తెలియదు. జన్యు స్వభావం, రోగనిరోధక వ్యవస్థ, పరిసరాల ప్రభావం వంటివి జీర్ణకోశంలో వాపు తలెత్తేలా చేయొచ్చు. దీని చికిత్సలో లక్షణాలు తగ్గటానికి, మున్ముందు ఉద్ధృతం కాకుండా చూడటానికి, వాచిన పేగులు కుదురుకోవటానికి ప్రాధాన్యమిస్తారు. మందులతో పాటు ఆహార మార్పులు ఉపయోగపడతాయి. పేగులకు రంధ్రాలు పడినా, అడ్డంకి తలెత్తినా, పెద్దఎత్తున రక్తస్రావం అవుతున్నా శస్త్రచికిత్స అవసరమవుతుంది.

పేగు పూత (ఐబీడీ)
ఒక పేగు భాగంలోకి దానికి సమీపంలోని పేగు భాగం చొచ్చుకొని రావటమూ రక్తస్రావానికి దారితీయొచ్చు. సాధారణంగా చిన్నపేగు చివరి భాగం పెద్దపేగులోకి చొచ్చుకొని వస్తుంటుంది. చిన్న పేగు కదిలిన ప్రతీసారీ మరింత లోపలికి వెళ్తుంటుంది. ఇది రెండేళ్ల లోపు పిల్లల్లో ఎక్కువ. 6-9 నెలల పిల్లల్లోనైతే ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది ఉన్నట్టుండి తలెత్తే సమస్య. అప్పటివరకు హాయిగా తిరుగుతున్న పిల్లలోనూ రావొచ్చు. దీంతో హఠాత్తుగా, బిగ్గరగా ఏడుస్తుంటారు. కొద్ది నిమిషాల తర్వాత దానంతటదే తగ్గిపోతుంది. కాసేపయ్యాక మళ్లీ వస్తుంది. క్రమంగా కడుపు ఉబ్బటం, ఆకుపచ్చగా లేదా పసుపు పచ్చగా వాంతి, మలద్వారం నుంచి రక్తం పడటం వంటివి తలెత్తుతాయి.
* పేగు చొచ్చుకురావటం అత్యవసర సమస్య. వెంటనే శస్త్రచికిత్స చేసి సరిదిద్దాల్సి ఉంటుంది. లేకపోతే లోపలికి వచ్చిన పేగుకు రక్త సరఫరా ఆగిపోయి, కుళ్లిపోయే (గ్యాంగ్రీన్‌) ప్రమాదముంది. తొలిదశలోనైతే.. అంటే 3-6 గంటల్లోపు సర్జరీ లేకుండానే సరిదిద్దొచ్చు. మలద్వారం నుంచి గొట్టం ద్వారా అధిక పీడనంతో ద్రవాన్ని పంపిస్తే.. ఆ పీడనానికి పెద్ద పేగు నుంచి చిన్న పేగు బయటకు వచ్చేస్తుంది. దీన్నే హైడ్రోస్టాటిక్‌ రిడక్షన్‌ పద్ధతి అంటారు. అల్ట్రాసౌండ్‌ పరీక్ష ద్వారా చూస్తూ దీన్ని చేస్తారు. సమస్యను గుర్తించటం ఆలస్యమైనా, హైడ్రోస్టాటిక్‌ రిడక్షన్‌ పద్ధతి పనిచేయకపోయినా శస్త్రచికిత్స అవసరమవుతుంది. పేగు కుళ్లిపోకపోతే చొచ్చుకెళ్లిన భాగాన్ని బయటకు తీస్తే సరిపోతుంది. ఒకవేళ కుళ్లిపోయి, ప్రమాదకరంగా మారితే ఆ భాగాన్ని కత్తిరిస్తారు. తిరిగి పేగు చివర్లను కలిపి కుట్టేస్తారు.


ఎప్పడు ప్రమాదకరం?

పిల్లల్లో మలద్వారం నుంచి రక్తం పడటం అంత తీవ్రమైనదేమీ కాదు. చాలాసార్లు దానంతటదే ఆగిపోతుంది. క్యాన్సర్ల వంటి అనుమానాలేవీ అక్కర్లేదు. అయితే రక్తం ఆగకుండా అలాగే పడుతున్నప్పుడు, పెద్దమొత్తంలో రక్తం పడుతున్నప్పుడు.. రక్తస్రావంతో పాటు నొప్పి వస్తున్నప్పుడు.. కడుపు ఉబ్బటం, లోపలి అవయవాలు పెద్దగా అవటం వల్ల కడుపు పెద్దగా అవటం వంటివి కనిపిస్తే తాత్సారం చేయరాదు. ఇవి ప్రమాదకర సమస్యలకు సంకేతాలని తెలుసుకోవాలి.


మొలలు

అరుదే అయినా కొందరు పిల్లల్లో మొలలు ఏర్పడొచ్చు. దీంతో మల విసర్జన సమయంలో రక్తం పడుతుంది. కారణాన్ని బట్టి మొలలకు చికిత్స చేస్తారు. ఇతరత్రా సమస్యలతో ముడిపడని మొలలను శస్త్రచికిత్సతో తొలగించాల్సి ఉంటుంది. వేరే జబ్బులతో తలెత్తినవైతే.. ఆయా సమస్యలకు చికిత్స చేస్తే లక్షణాలు తగ్గుతాయి.

రక్తనాళ లోపాలు (యాంజియోడిస్‌ప్లేసియా)
పేగులకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో లోపాలు కూడా మలద్వారం నుంచి రక్తం పడేలా చేయొచ్చు. కొందరిలో రక్తనాళాలు ఉండలా ఏర్పడి, బయటకు పొడుచుకు రావొచ్చు. అక్కడ పుండు పడటం, దెబ్బతినటం వల్ల రక్తస్రావం కావొచ్చు.
* రక్తనాళ లోపాలను యాంజియోగ్రామ్‌ లేదా ఎండోస్కోపీ ద్వారా నిర్ధరించొచ్చు. లోపాలతో కూడిన పేగు భాగాన్ని శస్త్రచికిత్సతో తొలగించి, సరి చేయాల్సి ఉంటుంది.

పిలకలు (జువైనల్‌ పాలిప్స్‌)
కొందరికి పేగుల లోపల గోడలకు పిలకలు ఏర్పడుతుంటాయి. ఇవి జీర్ణకోశంలో ఎక్కడైనా ఏర్పడొచ్చు గానీ ఎక్కువగా పెద్ద పేగు చివరి భాగంలో పుట్టుకొస్తుంటాయి. 2-8 ఏళ్ల పిల్లల్లో మలద్వారం నుంచి రక్తం పడటానికి ప్రధాన కారణం ఇవే. పిలకలు వాటంతటవే ఊడిపోయినప్పుడో, మలం గట్టిగా వస్తున్నప్పుడు ఒరుసుకుపోయినప్పుడో రక్తస్రావం అవుతుంటుంది. ఇది మలం మీద చారికల మాదిరిగా, ఎర్రగా కనిపిస్తుంది. చాలావరకు నొప్పేమీ ఉండదు. పిల్లల్లో పిలకలు చాలావరకు క్యాన్సర్‌ రహితమే.
* మలద్వారం నుంచి వేలును జొప్పించి, పరీక్షించటం ద్వారా పిలకలను నిర్ధరిస్తారు. ఒకవేళ పెద్దపేగు పైభాగంలో, చిన్నపేగు దగ్గరల్లో పిలకలు ఉన్నట్టయిలే కొలనోస్కోపీ చేయాల్సి ఉంటుంది. పిలక ఒకటే ఉన్నట్టయితే శస్త్రచికిత్స చేసి తొలగిస్తే సరిపోతుంది. అదే ఎక్కువగా, పేగులో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకొని ఉన్నట్టయితే ఆ భాగాన్ని కత్తిరించి, తొలగించాల్సి ఉంటుంది. పేగుల్లో పెద్ద సంఖ్యలో పిలకలు ఏర్పడటమనేది వంశపారంపర్యంగా చూస్తుంటాం. ఇవి సాధారణంగా క్యాన్సర్‌కు ముందు దశకు సంబంధించినవై ఉంటాయి.

కణజాలం క్షీణించటం
(నెక్రోటైజింగ్‌ ఎంటెరోకొలైటిస్‌)
ఇది నెలలు నిండక ముందే పుట్టిన పిల్లల్లో తలెత్తే సమస్య. సాధారణంగా పాలు పట్టటం ఆరంభించిన తర్వాత.. నెలలోపు మొదలవుతుంది. దీనికి మూలం పాలు పేగుల్లో నిల్వ ఉండిపోవటం. చివరికిది పేగు గోడల్లో ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది. దీంతో పుండ్లు పడొచ్చు, రక్తస్రావం కావొచ్చు. సమస్య తీవ్రమైతే పేగులకు రంధ్రాలూ పడొచ్చు. దీని బారినపడ్డ పిల్లలు స్తబ్ధుగా ఉంటారు. పాలు తాగటానికి ఇష్టపడరు. కడుపు ఉబ్బుతుంది కూడా. తర్వాత కడుపు గోడ ఎర్రగా అవుతుంది.
* తొలిదశలో గుర్తిస్తే యాంటీబయాటిక్స్‌ వంటి వాటితోనే దీన్ని నయం చేయొచ్చు. కణజాలం క్షీణించటం, కుళ్లిపోవటం, రంధ్రాలు పడటం వంటివి తలెత్తితే శస్త్రచికిత్స చేసి పేగు భాగాన్ని తొలగించాల్సి ఉంటుంది.

పేగుల్లో అడ్డంకి
పిల్లల్లో పేగుల్లో అడ్డంకులు తలెత్తటానికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. అడ్డంకిని సకాలంలో గుర్తించి, తొలగించకపోతే పేగు గోడ ఉబ్బిపోయి, రక్త సరఫరా ఆగిపోవచ్చు. ఇది పేగు మార్గంలో రక్త స్రావానికి దారితీస్తుంది. సమస్య మరీ తీవ్రమైతే పేగు కుళ్లిపోవచ్చు కూడా. పేగుల్లో అడ్డంకి మూలంగా మలద్వారం నుంచి రక్తం పడుతోందంటే పేగు కుళ్లిపోవటానికి సిద్ధమైందనో, అప్పటికే కుళ్లిపోయిందనో అనుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని