తేలికగా శ్వాసించేలా..

శ్వాస ప్రక్రియ అసంకల్పిత చర్య. మనం ప్రత్యేకించి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రయత్న పూర్వకంగా నెమ్మదిగా గాలిని పీల్చుకోవటం, వదలటం చేయొచ్చు. ఇలా ఒక సమన్వయ రీతిలో శ్వాసించటం

Updated : 19 Oct 2022 15:57 IST

శ్వాస ప్రక్రియ అసంకల్పిత చర్య. మనం ప్రత్యేకించి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రయత్న పూర్వకంగా నెమ్మదిగా గాలిని పీల్చుకోవటం, వదలటం చేయొచ్చు. ఇలా ఒక సమన్వయ రీతిలో శ్వాసించటం ద్వారా రక్తంలో ఆక్సిజన్‌, కార్బన్‌డయాక్సైడ్‌ మోతాదులను నియంత్రణలో ఉంచుకోవచ్చు. మానసిక ప్రశాంతతను సాధించొచ్చు. ఆందోళనను అదుపులో ఉంచుకోవచ్చు. కరోనా కాలంలో ఇంతకన్నా కావాల్సిందేముంటుంది?
* ముక్కు ద్వారా శ్వాస: మన ముక్కులో సన్నటి కేశాలు, జిగురుద్రవం ఉంటాయి. ఇవి దుమ్ముధూళిని వేరుచేసి, శుభ్రమైన గాలి లోపలికి వెళ్లేలా చేస్తాయి. సూక్ష్మక్రిముల వంటివి జిగురుద్రవంలో చిక్కుపడతాయి కూడా. ఇక ముక్కు మార్గమేమో గాలిని కాస్త వెచ్చగా చేసి, అందులో తేమను నింపుతుంది. ఆ తర్వాతే ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. కాబట్టి ముక్కు ద్వారానే శ్వాస తీసుకోవటం ఎంతైనా మంచిది.
* గాఢంగా శ్వాస: కొద్ది నిమిషాల సేపు గాఢంగా, స్థిరంగా శ్వాస తీసుకుంటూ వదలటం వంటి పద్ధతులు వేగస్‌ నాడి అతిగా ప్రేరేపితం కాకుండా చూస్తాయి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది.
* పడుకునే తీరు: తల కింద ఒక దిండు, మోకాళ్ల మధ్యలో ఒక దిండు పెట్టుకొని పక్కకు తిరిగి పడుకోవాలి. దీంతో శ్వాస తీసుకోవటం తేలికవుతుంది. రక్తంలో ఆక్సిజన్‌ శాతం పెరుగుతుంది. వెల్లకిలా పడుకోవటమే ఇష్టమైతే తల కింద అదనంగా మరొక దిండు, మోకాళ్లను కాస్త పైకి వంచి,  కింద దిండు పెట్టుకోవచ్చు.
* ధ్యానం: ఏదో ఒక దాని మీద మనసును లగ్నం చేసి దీర్ఘంగా శ్వాస తీసుకునే ధ్యానంతో ఒత్తిడితో కూడిన పరిస్థితులను అధిగమించొచ్చు. చిల్లర మల్లర ఆలోచనలను అరికట్టొచ్చు. కళ్లు మూసుకొని, కడుపు బాగా సాగేలా నిదానంగా గాలిని లోనికి పీల్చుకోవటం ద్వారా శరీరం ఆక్సిజన్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటుంది.
* ఇష్టమైన పాట: నచ్చిన పాట ఏదైనా సరే. వీలైనప్పుడల్లా పాడుకుంటే ఊపిరితిత్తులకూ మంచి వ్యాయామం లభిస్తుంది.
* బరువు తగ్గటం: అధిక బరువు గలవారు కొద్దిగా బరువు తగ్గినా ఊపిరితిత్తుల మీద భారం తగ్గుతుంది. తేలికగా శ్వాస తీసుకోవటానికి వీలవుతుంది.
* శారీరక శ్రమ: రోజుకు కనీసం అరగంట సేపు క్రమం తప్పకుండా నడక, సైకిల్‌ తొక్కటం వంటి వ్యాయామాలు చేస్తుంటే ఊపిరితిత్తుల సామర్థ్యం ఇనుమడిస్తుంది. గాఢంగా శ్వాస తీసుకోవటం సాధ్యమవుతుంది.
* బిగ్గరగా నవ్వినా: వీలైనప్పుడల్లా కాస్త బిగ్గరగా నవ్వి చూడండి. కడుపుబ్బేలా మనసారా హాయిగా నవ్వితే ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది. నవ్వినప్పుడు ఒక్కసారిగా గాలిని బయటకు వదులుతాం కదా. అప్పుడు ఊపిరితిత్తుల్లో నిల్వ ఉన్న గాలి బయటకు వచ్చేస్తుంది. తాజా గాలి లోనికి వెళ్తుంది.
* తగినంత నీరు:  రోజూ తగినంత నీరు, ద్రవాలు తీసుకుంటే ఊపిరితిత్తుల లోపల గోడకు అంటుకుని ఉండే జిగురు పొరలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పొరలు తేమతో కూడి, పలుచగా ఉంటే శ్వాస తీసుకోవటం తేలికవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు