Updated : 23 Aug 2022 11:53 IST

అర్ధరాత్రి దాటినా నిద్ర రాదేం?

సమస్య సలహా 

సమస్య: నాకు 70 ఏళ్లు. అర్ధరాత్రి వరకు నిద్ర పట్టదు. మెలకువగా ఉన్నప్పుడు ప్రతి నిమిషానికి ఆవలింతలు వస్తుంటాయి. దీనికి కారణమేంటి? పరిష్కారమేంటి?

- మూర్తి, విజయవాడ

సలహా: వృద్ధాప్యంలో అతి పెద్ద సమస్య ఒంటరితనం. ఇది అనవసర ఆలోచనలకు తావిస్తుంది. జీవితంలో అది చేయలేకపోయాం, ఇది చేయలేకపోయాం, అలా చేసి ఉండకపోతే బాగుండేదేమో.. అనే ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నట్టయితే వారి మీద బెంగ పడుతుంటారు కూడా. తమకేదైనా సుస్తీ అయితే పిల్లలు రాగలరో లేరో అనే ఆలోచనలూ వేధిస్తుంటాయి. వీటి మూలంగా నిద్ర పట్టకపోవచ్చు. ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతుంటే వాస్తవాన్ని గ్రహించటానికి ప్రయత్నించండి. గతాన్ని తలచుకొని బాధపడటం వల్ల ఒరిగేదేమీ లేదు. రోజూ కాసేపు ధ్యానం చేస్తే అనవసర ఆలోచనలు తగ్గుతాయి. సాయంత్రం పూట మీ వయసువారితో కలిసి కాసేపు ముచ్చట్లు పెట్టండి. చిన్ననాటి స్నేహితులతో గడపండి. చదరంగం వంటి కూర్చుని ఆడే ఆటలు ఆడండి. దీంతో మనసుకు ఉల్లాసం కలుగుతుంది. ఇది నిద్ర పట్టటానికి తోడ్పడుతుంది. మనసు ఉత్సాహంగా లేకపోతే ఆహారం సరిగా తినబుద్ధి కాదు కూడా. దీంతో నిస్త్రాణ ఆవహిస్తుంది. ఇదీ నిద్రను దెబ్బతీస్తుంది. బి విటమిన్లు లోపిస్తే కాళ్లు చేతులు లాగుతాయి. ఐరన్‌ తగ్గితే రక్తహీనత తలెత్తుతుంది. వీటితోనూ నిద్ర రాకపోవచ్చు. కాబట్టి అవసరమైతే విటమిన్ల మాత్రలు వేసుకోవాలి. రాత్రిపూట పిక్కలు పట్టేస్తున్నట్టయితే క్యాల్షియం మాత్రలూ అవసరమవుతాయి. మీకు మధుమేహం, అధిక రక్తపోటు, ప్రోస్టేట్‌ ఉబ్బు వంటి సమస్యలేవైనా ఉన్నాయా? వీటికేమైనా మందులు వాడుతున్నారా? అనేదీ ముఖ్యమే. ఎందుకంటే మధుమేహం, ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బులో తరచూ మూత్రం వస్తుంటుంది. ఇది నిద్రకు భంగం కలిగించొచ్చు. కొన్నిసార్లు మందుల మోతాదులను తగ్గించటం లేదా మందులను మార్చటం ద్వారా ఫలితం ఉండొచ్చు. మీరు రోజంతా ఏమేం పనులు చేస్తున్నారన్నదీ ఒకసారి గమనించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక వయసు వచ్చాక చేయటానికి పెద్దగా పనులేమీ ఉండవు. దీంతో పొద్దున్నో, మధ్యాహ్నమో కాస్త నడుం వాలుస్తుంటారు. మధ్యాహ్నం నిద్ర పోతే రాత్రిపూట సరిగా నిద్ర రాదు. ఇలాంటి కారణాలేవైనా గమనిస్తే సరి చేసుకోవాలి. వీలైతే రోజూ కాసేపు నడవటం మంచిది. దీంతో శరీరం, మనసు హుషారుగా ఉంటాయి. సాయంత్రం గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం, పడకగదిలో వెలుగు మరీ ఎక్కువగా లేకుండా చూసుకోవటం, శ్రావ్యమైన సంగీతం వినటం, కాసేపు పుస్తకం చదువుకోవటం, పడుకునే ముందు గ్లాసు పాలు తాగటం వంటివి ఆచరిస్తే నిద్ర బాగా పట్టటానికి అవకాశముంటుంది.

-డా।। ఎ.అశ్వినీకుమార్‌, ప్రొఫెసర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (రిటైర్డ్‌)


మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన ఈమెయిల్‌ చిరునామా: sukhi@eenadu.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని