నడుం-తుంటి నిష్పత్తే కీలకం

బరువును అంచనా వేయటానికి చాలాకాలంగా శరీర ఎత్తు, బరువుల నిష్పత్తిని (బీఎంఐ) పరిగణనలోకి తీసుకుంటున్నారు. బీఎంఐ 18.5 నుంచి 24.9 మధ్య ఉండటం మంచిదని చెబుతుంటారు. అయితే జబ్బుల ముప్పును లేదా మరణాన్ని అంచనా

Published : 27 Sep 2022 00:20 IST

బరువును అంచనా వేయటానికి చాలాకాలంగా శరీర ఎత్తు, బరువుల నిష్పత్తిని (బీఎంఐ) పరిగణనలోకి తీసుకుంటున్నారు. బీఎంఐ 18.5 నుంచి 24.9 మధ్య ఉండటం మంచిదని చెబుతుంటారు. అయితే జబ్బుల ముప్పును లేదా మరణాన్ని అంచనా వేయటానికి బీఎంఐని వాడుకోవటం తగదన్నది శాస్త్రవేత్తల నమ్మకం. ఎందుకంటే ఇది శరీరంలో ఎక్కడ కొవ్వు పేరుకుపోయిందనే దాన్ని పట్టించుకోదు. అందుకే నడుం-తుంటి నిష్పత్తి (డబ్ల్యూహెచ్‌ఆర్‌) లేదా కొవ్వు మోతాదుల నిష్పత్తి (ఎఫ్‌ఎంఐ) కొలతల మీద ఐర్లాండ్‌లోని యూనివర్సిటీ కాలేజ్‌ కార్క్‌ పరిశోధకులు దృష్టి సారించారు. ముందుగా కొవ్వు మోతాదులు ఎక్కువగా ఉండటానికీ మరణం ముప్పు పెరగటానికీ సంబంధం ఉంటున్నట్టు బ్రిటన్‌లోని బయోబ్యాంక్‌ సమాచారం ఆధారంగా నిర్ధరించుకున్నారు. తర్వాత బీఎంఐ, డబ్ల్యూహెచ్‌ఆర్, ఎఫ్‌ఎంఐ కొలతలను అన్వయించి పరిశీలించారు. నడుం-తుంటి నిష్పత్తి ఎక్కువగా గలవారికి అకాల మరణం ముప్పు అధికంగా ఉంటున్నట్టు తేల్చారు. అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరం. ఇది రకరకాల జబ్బులను తెచ్చిపెడుతుంది. ఈ కొవ్వుతో పాటు బొజ్జ వద్ద కొవ్వునూ నడుం-తుంటి నిష్పత్తి మరింత బాగా అంచనా వేస్తుంది. కాబట్టే దీనికిప్పుడు రోజురోజుకీ ప్రాధాన్యం పెరుగుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని