ఆటిజమ్‌ పిల్లలకు ఆటల దన్ను

మెడ నిలపటం, పాకటం, నడవటం వంటి దశలన్నీ పిల్లలు బాగానే దాటేస్తారు. శారీరకంగా అంతా సవ్యంగానే ఉంటుంది. కానీ ప్రవర్తనలోనే ఏదో లోపం. కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోవచ్చు. ఇతర పిల్లలతో కలవకుండా ఒంటరిగా ఉండిపోతుండొచ్చు. మాటలు ఆలస్యంగా రావొచ్చు.

Updated : 04 Oct 2022 07:05 IST

మెడ నిలపటం, పాకటం, నడవటం వంటి దశలన్నీ పిల్లలు బాగానే దాటేస్తారు. శారీరకంగా అంతా సవ్యంగానే ఉంటుంది. కానీ ప్రవర్తనలోనే ఏదో లోపం. కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోవచ్చు. ఇతర పిల్లలతో కలవకుండా ఒంటరిగా ఉండిపోతుండొచ్చు. మాటలు ఆలస్యంగా రావొచ్చు. వచ్చినా అవీ అరకొరగానే. ఏదైనా కావాలంటే వేలు పట్టుకొని అక్కడిదాకా తీసుకెళ్లి మరీ చూపిస్తుండొచ్చు. చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తుండొచ్చు. వాటిని ఎప్పుడూ ఒకేలా చేస్తుండొచ్చు కూడా. సంతోషం వస్తే చేతులు, కాళ్లను పైకీ కిందికీ ఆడిస్తుండొచ్చు. కొందరు ఒకేరకం వస్తువులను సేకరించుకొని పెట్టుకోవచ్చు. ఆటిజమ్‌ ఇలాంటి ప్రవర్తనతోనే బయటపడుతుంటుంది. వివిధ లక్షణాలతో ముడిపడి ఉండటం వల్ల దీన్ని ఆటిజమ్‌ స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌ (ఏఎస్‌డీ) అనీ అంటారు. ఎనిమిదేళ్లలోపు పిల్లల్లో ప్రతి వంద మందిలో ఒకరు దీని బారినపడుతున్నారని అంచనా. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అర్థం చేసుకొని, తగినంత ప్రోత్సాహం ఇస్తే ఆటిజమ్‌ పిల్లలు చాలావరకు దీన్నుంచి బయటపడే అవకాశముంది.
ఆటిజమ్‌ ఆడపిల్లల్లో కన్నా మగపిల్లలకు ఎక్కువ. ముఖ్యంగా తల్లిదండ్రులు  చాలా ఆలస్యంగా సంతానాన్ని కనటం, కాన్పు సమయంలో మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందకపోవటం వంటి సమస్యలు ఎదుర్కొన్నవారికి దీని ముప్పు ఎక్కువగా ఉంటుంది. దరు పిల్లలకు జన్యులోపాలు.. లేదూ మెదడులో లోపాలూ ఉండొచ్చు. దురదృష్టం కొద్దీ ఆటిజమ్‌ను నిర్ధరించటానికి ఎలాంటి రక్త పరీక్షలు లేవు. దీన్ని లక్షణాలతో మాత్రమే నిర్ధరిస్తారు. బాల్యంలో ప్రవర్తన, ఎదుగులలో మార్పుల వంటివి సమస్యను గుర్తించటానికి తోడ్పడతాయి. ఆటిజమ్‌తో బాధపడే పిల్లలు తొమ్మిది నెలల వయసు వచ్చినా తమ పేరుకు స్పందించకపోవచ్చు. పేరు పెట్టి పిలిచినా అటువైపు చూడకపోవచ్చు. మూడేళ్ల వయసు వచ్చినా దాగుడు మూతల వంటి తేలికపాటి ఆటలనూ ఆడలేకపోవచ్చు. ఇతర పిల్లలతో కలవటానికి అంతగా ఇష్టపడరు. ఐదేళ్ల వయసుకు చేరుకున్నా పాటలు పాడలేకపోవచ్చు, డ్యాన్స్‌ చేయకపోవచ్చు. ముఖంలో బాధ, సంతోషం వంటి భావాలనూ అంతగా ప్రదర్శించకపోవచ్చు. ఇలాంటి లక్షణాలను ఎవరైనా తేలికగానే గుర్తించొచ్చు. అయితే ఉమ్మడి కుటుంబాల్లో పెద్దవాళ్లు పెద్దగా పట్టించుకోరు. పిల్లలను మరీ గారాబం చేస్తుంటారు. గొంతెమ్మ కోరికలన్నీ తీరుస్తుంటారు. పెద్దయ్యాక వాళ్లే కుదురుకుంటారని నచ్చజెబుతుంటారు. నిజానికి ఇలాంటి కీలకమైన ఎదుగుదల దశలో నిపుణుల సలహా తీసుకోవటం ఎంతైనా అవసరం. కొందరు పిల్లలు అతి చురుకుగానూ స్పందిస్తుండొచ్చు. కొందరికి మూర్ఛ వస్తుండొచ్చు. కుంగుబాటు, ఆందోళన వంటివీ ఉండొచ్చు. వీటికీ తగు చికిత్స ఇప్పించాల్సి ఉంటుంది.

కొడితే లాభం లేదు
బడిలోకి వెళ్లాక పిల్లలు చదువు మీద దృష్టి పెట్టకపోవచ్చు. ఉపాధ్యాయులు తరచూ ఫిర్యాదు చేయొచ్చు. వీరిని కొట్టినా, అరిచినా, ఎక్కువసేపు పుస్తకాల ముందు కూర్చోబెట్టినా ఉపయోగమేమీ ఉండదు. ఇలాంటి పిల్లల విషయంలో ఓర్పు చాలా అవసరం. అవసరమైతే దగ్గరుండి ఒకటికి రెండు సార్లు పాఠాలు నేర్పించాలి. కొందరు టానిక్కులు, విటమిన్ల వంటివి పిల్లలకు ఇస్తుంటారు. ఇవేమీ నైపుణ్యాన్ని పెంచవు. ఆటిజమ్‌ పిల్లల్లో చాలామంది వయసు పెరుగుతున్నకొద్దీ మెరుగవుతూ వస్తుంటారు. కొందరు యుక్తవయసులో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. బాల్యం నుంచే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పోత్సహిస్తే దీన్నుంచి బాగానే బయటపడతారు. కొందరికి పెంపుడు జంతువులు మేలు చేయొచ్చు. ఎందుకంటే కొందరు మనుషులతో కన్నా వీటితోనే ఎక్కువగా మమేకం కావొచ్చు.

ప్రత్యేక నైపుణ్యాల మీద దృష్టి
ఆటిజమ్‌ పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారన్నది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుంచి లభించే దన్ను, ప్రోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొందరు కొన్ని విషయాల్లో బాగా రాణిస్తుంటారు. సంగీతం, కంప్యూటర్లు, బొమ్మలు వేయటం వంటి వాటిపై ఎనలేని నైపుణ్యం ఉంటుంది. అందువల్ల వీరిలో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీయటానికి, మరింత సాన బెట్టటానికి ప్రయత్నం చేయాలి.


కుదురు, ఏకాగ్రత

సమన్వయం, ఏకాగ్రత పెరగటానికి ఆటలు బాగా తోడ్పడతాయి. శక్తి యుక్తులను ప్రదర్శించటానికి తోడ్పడతాయి. వ్యక్తిగతంగా ఆడే పరుగు, ఈత వంటి ఆటలు మేలు. ఎందుకంటే వీటిల్లో ఇతరులతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. గెలిచామనే సంతోషమూ కలుగుతుంది. అదే ఫుట్‌బాల్‌, క్రికెట్‌, బాస్కెట్‌బాల్‌ వంటి ఆటలైతే ఎక్కువ మందితో కలిసి, ఆయా సందర్భాలకు అనుగుణంగా ఆడాల్సి ఉంటుంది. మొదట్లో వీళ్లు ఆటలంటే ఇష్టం చూపకపోవచ్చు. ఆడటానికి వెనకాడొచ్చు. కానీ తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించాలి. ఒకటికి రెండుసార్లు నచ్చజెప్పి ఒప్పించాలి.
* ఆటిజమ్‌ పిల్లలకు విలువిద్య బాగా సరిపోతుంది. దీనికి కొలను వంటి ప్రత్యేక సదుపాయాలేవీ అవసరం లేదు. లక్ష్యాన్ని ఎక్కడైనా ఏర్పాటు చేయొచ్చు. బాణాన్ని సంధించటం, గురి చూడటం, వదలటం, లక్ష్యాన్ని ఛేదించటం వంటివన్నీ పదే పదే చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఒకే రకమైన పనులు ఆటిజమ్‌ పిల్లలకు బాగా నచ్చుతాయి. కాబట్టి 6-8 ఏళ్ల వయసు నుంచే విలు విద్య సాధన ఆరంభించేలా చూసుకోవాలి. నిజానికి విలు విద్యలో ఆటిజమ్‌ పిల్లలు బాగా రాణిస్తుంటారు కూడా.
* కరాటే, కుంగ్‌ ఫూ, త్వైక్వాండో వంటి యుద్ధ కళలను సాధన చేస్తే ఆటిజమ్‌ పిల్లల్లో ఏకాగ్రత, మానసిక చైతన్యం మెరుగవుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. పనులను తేలికగా చేయటంలో ఇవి సహకరిస్తాయి. ఇలాంటి యుద్ధ విద్యలను నేర్చుకుంటే ఇతరులపై దాడి చేస్తారని చాలామంది పొరపడుతుంటారు. కానీ నిజానికివి ప్రశాంతత, ధైర్యం, ఆత్మవిశ్వాసం చేకూరటానికి తోడ్పడతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని