గుండెకూ క్యాల్షియం బలం!

క్యాల్షియం అనగానే ఎముకల పటుత్వమే గుర్తుకొస్తుంది. అయితే ఇది ఒక్క ఎముకలు, దంతాల ఆరోగ్యానికే కాదు. రక్తం మామూలుగా గడ్డ కట్టేలా చూడటం.. కండరాలు, నాడులు సక్రమంగా పనిచేయటం.. గుండె నార్మల్‌గా కొట్టుకునేలా చేయటంలోనూ పాలు పంచుకుంటుంది. మన శరీరంలో క్యాల్షియం చాలావరకు ఎముకల్లోనే ఉంటుంది.

Published : 18 Oct 2022 01:03 IST

క్యాల్షియం అనగానే ఎముకల పటుత్వమే గుర్తుకొస్తుంది. అయితే ఇది ఒక్క ఎముకలు, దంతాల ఆరోగ్యానికే కాదు. రక్తం మామూలుగా గడ్డ కట్టేలా చూడటం.. కండరాలు, నాడులు సక్రమంగా పనిచేయటం.. గుండె నార్మల్‌గా కొట్టుకునేలా చేయటంలోనూ పాలు పంచుకుంటుంది. మన శరీరంలో క్యాల్షియం చాలావరకు ఎముకల్లోనే ఉంటుంది. తగినంత క్యాల్షియం తీసుకోకపోతే శరీరం ఎముకల నుంచి దీన్ని తీసుకొని, వాడుకుంటుంది. ఇది ఎముక క్షీణత(ఆస్టియోపోరోసిస్‌)కు దారితీస్తుంది. తగినంత క్యాల్షియం తీసుకోకపోతే రక్తపోటు కూడా పెరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బు ముప్పూ పెరుగుతుంది. అందువల్ల తగినంత క్యాల్షియం లభించేలా చూసుకోవాలి. చాలామంది.. ముఖ్యంగా వృద్ధులు ఎముకల క్షీణతను నివారించుకోవటానికి క్యాల్షియం మాత్రలు వేసుకోవటం తెలిసిందే. అయితే వీటితో గుండె కవాట సమస్యల ముప్పు పెరుగుతున్నట్టు, ఇవి చివరికి గుండె వైఫల్యానికి దారితీస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఆహారం ద్వారానే తగినంత క్యాల్షియం లభించేలా చూసుకోవటం ఉత్తమం. పెద్దవారికి సగటున రోజుకు 1,000 నుంచి 1,200 మి.గ్రా. క్యాల్షియం అవసరం. పాల ఉత్పత్తులు, క్యాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలను రోజుకు 2 నుంచి 4 సార్లు తీసుకుంటే ఈ మోతాదును పొందొచ్చు. పాలు, పెరుగు, ఛీజ్‌ వంటి వాటిల్లో క్యాల్షియం దండిగా ఉంటుంది. ఇప్పుడు బాదం, సోయా, జీడిపప్పు పాల వంటి వాటిల్లోనూ క్యాల్షియంను కలిపి అమ్ముతున్నారు. క్యాల్షియం ఒక్కటే తీసుకున్నా చాలదు. దీన్ని శరీరం సరిగా గ్రహించుకునేలా చూసే విటమిన్‌ డి కూడా అవసరమే. రోజూ శరీరానికి కాసేపు ఎండ తగిలేలా చూసుకుంటే చర్మమే విటమిన్‌ డిని తయారు చేసుకుంటుంది. సాల్మన్‌, టూనా వంటి కొవ్వుతో కూడిన చేపలు.. పుట్టగొడుగులతోనూ దీన్ని పొందొచ్చు. గుడ్డు పచ్చసొనలోనూ కొంతవరకు విటమిన్‌ డి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు