పక్కటెముక పట్టేసిందా?

వ్యాయామం చేస్తున్నాం. లేదూ బాస్కెట్‌బాలో, వాలీబాలో ఆడుతున్నాం. కాస్త వేగంగా  పరుగెత్తుతున్నాం. ఇలాంటి సమయాల్లో ఒకోసారి పక్కటెముకల వద్ద హఠాత్తుగా తీవ్రమైన నొప్పి పుడుతుంటుంది.

Published : 22 Nov 2022 00:10 IST

వ్యాయామం చేస్తున్నాం. లేదూ బాస్కెట్‌బాలో, వాలీబాలో ఆడుతున్నాం. కాస్త వేగంగా  పరుగెత్తుతున్నాం. ఇలాంటి సమయాల్లో ఒకోసారి పక్కటెముకల వద్ద హఠాత్తుగా తీవ్రమైన నొప్పి పుడుతుంటుంది. దీంతో కొన్నిసార్లు ఆయా పనులను ఆపేస్తుంటాం కూడా. దీన్ని చాలామంది పక్కటెముక పట్టేసిందని భావిస్తుంటారు. ఇది ప్రమాదకరమైందేమీ కాదు. తరచూ చూసేదే. రోజువారీ పనులకు ఇబ్బందేమీ కలిగించదు. కానీ నొప్పి ఉన్నంత సేపు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇంతకీ దీనికి కారణమేంటో తెలుసా? కడుపును ఛాతీని వేరు చేసే డయాఫ్రం పొర అసంకల్పితంగా సంకోచించటం.

యాఫ్రం పొర ఉన్నట్టుండి సంకోచించటానికి రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. కాలేయానికి, ప్లీహానికి రక్త సరఫరా ఎక్కువ కావటం దీనికి ప్రధాన కారణమని భావిస్తుంటారు. లోపలి అవయవాలు డయాఫ్రం పొరను కిందికి లాగటం కారణం కావొచ్చనీ అనుకుంటుంటారు. తిన్న వెంటనే శారీరక శ్రమ చేయటం కూడా డయాఫ్రం పొర సంకోచించటానికి దారితీయొచ్చు. ఎందుకంటే తిన్న తర్వాత ఆహారం జీర్ణం కావటానికి శరీరం జీర్ణాశయానికి రక్త సరఫరాను ఎక్కువ చేస్తుంది. ఫలితంగా డయాఫ్రం పొరకు రక్త సరఫరా తగ్గుతుంది. రక్తంలో క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్ల మోతాదులు తగ్గటమూ కారణం కావొచ్చు.

తగ్గించుకోవటమెలా?

పక్కటెముక పట్టేసినప్పుడు చేస్తున్న పనులను అప్పటికప్పుడు మధ్యలో మానెయ్యటం సాధ్యం కాకపోవచ్చు. మరి దీన్ని తగ్గించుకునేదెలా?
* వేగంగా నడవటం, పరుగెత్తటం వంటివి చేస్తుంటే కాస్త వేగం తగ్గించాలి.
* గాఢంగా శ్వాస తీసుకోవటం మరో మార్గం. దీంతో కండరాలు వదులవుతాయి. పట్టేసిన డయాఫ్రం సడలుతుంది.
* నొప్పి వస్తున్న చోటును గుర్తించి, వేలితో కాసేపు అదిమి పట్టినా ఉపశమనం కలగొచ్చు.

నివారించుకోవచ్చా?

అసలు పక్కటెముక పట్టేయకుండా ముందు నుంచే తగు జాగ్రత్తలూ తీసుకోవచ్చు.
* భోజనం చేసిన వెంటనే వ్యాయామాలు, కష్టమైన పనులు చేయకుండా చూసుకోవాలి. కనీసం రెండు గంటల ఎడం పాటించాలి. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, పానీయాలు తీసుకోకపోవటం మంచిది.
* వ్యాయామం చేయటానికి ముందు శరీరాన్ని రెండు పక్కలనూ సాగదీయాలి.
* ముక్కుతో శ్వాస తీసుకోవటానికి ప్రయత్నించాలి.
* ఒంట్లో నీటిశాతం తగ్గకుండా రోజంతా తగినంత నీరు తాగాలి. కానీ వ్యాయామానికి ముందు అతిగా నీరు తాగకూడదు. ఎక్కువగా నీరు తాగి వ్యాయామం చేస్తే డయాఫ్రం మీద ఒత్తిడి పెరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు