జిమ్‌ వ్యాయామాలతో గుండె ఆగటమా?

నాకు 35 ఏళ్లు. జిమ్‌లో వ్యాయామాలు మొదలెట్టాలని అనుకుంటున్నా. అయితే ఇటీవల కొందరు వ్యాయామాలు చేస్తూ కుప్పకూలి, మరణించారనే ఉదంతాలు భయం కలిగిస్తున్నాయి.

Updated : 25 Apr 2023 04:19 IST

సమస్య: నాకు 35 ఏళ్లు. జిమ్‌లో వ్యాయామాలు మొదలెట్టాలని అనుకుంటున్నా. అయితే ఇటీవల కొందరు వ్యాయామాలు చేస్తూ కుప్పకూలి, మరణించారనే ఉదంతాలు భయం కలిగిస్తున్నాయి. వ్యాయామాలతో కుప్పకూలటం నిజమేనా? వ్యాయామాలు మొదలెట్టే ముందు ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలా?

అవినాశ్‌

సలహా: ఎక్కడో, ఎవరికో ఏదో అయ్యిందని మీరు భయపడటం సరికాదు. రోజూ ఎంతోమంది జిమ్‌లలో సురక్షితంగా వ్యాయామాలు చేస్తూనే ఉన్నారు కదా. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికివి అత్యవసరం కూడా. అయితే కొందరికి తీవ్రమైన వ్యాయామం, శారీరక శ్రమ చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి గుండె ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు. గమనించాల్సిన విషయం ఏంటంటే- ఇలాంటివారిలో చాలామందికి అప్పటికే వంశపారంపర్యంగా కొన్ని గుండె సమస్యలు ఉండటం. కానీ ఆ విషయం వారికి తెలియకపోవచ్చు. తీవ్రంగా శ్రమించినప్పుడు అడ్రినలిన్‌ హార్మోన్‌ విడుదలై, గుండెలోని విద్యుత్‌ వ్యవస్థ మీద విపరీత ప్రభావం పడుతుంది. ఈ విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్తమైతే గుండెలయ దెబ్బతింటుంది (అరిత్మియా). అప్పుడు గుండె చాలా వేగంగా కొట్టుకోవచ్చు. లేదూ నెమ్మదిగా కొట్టుకోవచ్చు. కొన్నిసార్లు పూర్తిగానూ ఆగిపోవచ్చు.

ప్రస్తుతం కొందరు జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ కుప్పకూలటానికి చాలావరకు ఇదే కారణమని అనిపిస్తోంది. కాబట్టి మీరు వ్యాయామాలు ఆరంభించే ముందు ఒకసారి ఈసీజీ పరీక్ష చేయించుకోవటం మంచిది. హఠాత్తుగా గుండె పోవటానికి కారణమయ్యే గుండె లయ సమస్యలేవైనా ఉంటే ఇందులో బయటపడతాయి. గుండె రక్తనాళాల్లో పూడికలతోనూ కొన్నిసార్లు హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదముంది. అప్పటికే తెలియకుండా పూడికలు ఉన్నట్టయితే తీవ్రంగా శ్రమించినప్పుడు గుండెకు తగినంత రక్తం అందక చతికిల పడొచ్చు. జిమ్‌లో ఎంత తీవ్రంగా వ్యాయామాలు చేయిస్తారో తెలియదు. అందువల్ల వ్యాయామాలు మొదలెట్టటానికి ముందు ట్రెడ్‌మిల్‌ పరీక్ష కూడా చేయించుకుంటే మంచిది. గుండె ఎంత శ్రమను తట్టుకుంటుంది? వ్యాయామాలు గుండెకు ఎంతవరకు సురక్షితం? అనేవి ఇందులో తెలుస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు, పొగ తాగే అలవాటు, అధిక కొలెస్ట్రాల్‌, కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బులు ఉండటం వంటి ముప్పు కారకాలు గలవారికిది తప్పనిసరి. ఈ రెండు పరీక్షలతో పెను ప్రమాదాన్ని గుర్తించి, ముందుగానే నివారించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని