క్యాన్సర్‌తో వ్యాయామం ఢీ

వ్యాయామంతో క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుంది. క్యాన్సర్‌ బాధితుల్లోనూ చికిత్స దుష్ప్రభావాలు తగ్గటానికి తోడ్పడుతుంది.

Published : 09 May 2023 00:25 IST

వ్యాయామంతో క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుంది. క్యాన్సర్‌ బాధితుల్లోనూ చికిత్స దుష్ప్రభావాలు తగ్గటానికి తోడ్పడుతుంది. అంతేకాదు, వ్యాయామం మూలంగా క్యాన్సర్‌ను నిర్మూలించే రోగనిరోధక కణాల సంఖ్య కూడా పెరుగుతుంది! కేవలం 10 నిమిషాల వ్యాయామంతోనూ మంచి ఫలితం కనిపిస్తున్నట్టు రక్త, రొమ్ము క్యాన్సర్‌ బాధితులపై ఇటీవల నిర్వహించిన అధ్యయనం పేర్కొంటోంది. ఇందులో భాగంగా పరిశోధకులు వ్యాయామానికి ముందూ, తర్వాతా రక్త నమూనాలను విశ్లేషించారు. వ్యాయామం అనంతరం సహజ హంతక కణాలు, సైటోటాక్సిక్‌ టి కణాలతో పాటు మొత్తం తెల్ల రక్తకణాల సంఖ్య పెరిగినట్టు గుర్తించారు. సైటోటాక్సిక్‌ టి కణాలకు క్యాన్సర్‌ కణాలను నిర్మూలించే సామర్థ్యం ఉండటం గమనార్హం. వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె వేగం, రక్తపోటు ఎంత ఎక్కువగా పెరిగితే అంత ఎక్కువగా రోగనిరోధక కణాలు వాటి నిల్వ స్థానం నుంచి రక్తంలోకి చేరుతున్నట్టూ తేలింది. వ్యాయామం తీవ్రంగా చేస్తే ఎక్కువ ఫలితం ఉంటున్నట్టు ఇది తెలియ జేస్తున్నప్పటికీ తేలికపాటి, ఒక మాదిరి వ్యాయామం కొద్దిసేపు చేసినా రోగనిరోధక కణాలు పెరుగు తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. క్యాన్సర్‌ చికిత్సలతో అలసట, నిస్సత్తువ తలెత్తుతుంది. దీంతో చాలామంది వ్యాయామానికి వెనకాడుతుంటారు. ఆనందంగా, హాయిగా చేయగలిగిన వ్యాయామాలు.. అంటే దగ్గరలోని దుకాణానికి నడిచో, సైకిల్‌ తొక్కుకుంటూనో వెళ్లటం వంటివి ఎంచుకుంటే ఇబ్బందేమీ ఉండదని పరిశోధకులు సూచిస్తున్నారు. క్యాన్సర్‌ చికిత్సలతో రోగనిరోధక శక్తి తగ్గుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాయామంతో రోగనిరోధక కణాల సంఖ్య పెంచుకోవటం ముఖ్యమని వివరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని