వ్యాయామానికి బ్యాక్టీరియా ప్రోత్సాహం

వ్యాయామం చేయాలనే ఉత్సాహం కొరవడుతోందా? అయితే పేగుల్లోని బ్యాక్టీరియా కారణం కావొచ్చు. 

Updated : 03 Jan 2023 00:38 IST

వ్యాయామం చేయాలనే ఉత్సాహం కొరవడుతోందా? అయితే పేగుల్లోని బ్యాక్టీరియా కారణం కావొచ్చు. వ్యాయామాలు చేస్తున్నప్పుడు కొన్నిరకాల బ్యాక్టీరియా డోపమైన్‌ అనే హార్మోన్‌ను విడుదల చేస్తోందని, ఇది వ్యాయామాలు చేయటానికి పురికొల్పుతోందని యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా అధ్యయనం పేర్కొంటోంది. వ్యాయామంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎంతమంది దీన్ని కొనసాగిస్తున్నారనేది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో వ్యాయామాన్ని ప్రోత్సహించే శారీరక అంశాలను గుర్తించటంపై పరిశోధకులు ఎలుకలపై అధ్యయనం చేశారు. పేగుల్లో బ్యాక్టీరియా తగ్గిన ఎలుకలు తమకు తాముగా చక్రం మీద పరుగెత్తటం చాలావరకు తగ్గటం గమనార్హం. పైగా వీటి మెదళ్లలో డోపమైన్‌ మోతాదులూ తగ్గాయి. అంటే వ్యాయామం వీటికి అంత ఆనందం ఇవ్వటం లేదన్నమాట. పేగుల్లో బ్యాక్టీరియా తగినంతగా ఉండి, మెదడును పేగులతో అనుసంధానం చేసే నాడీకణాలు లేని ఎలుకలతో పోల్చి చూసినా ఇలాంటి ఫలితమే కనిపించింది. వ్యాయామం చేయాలనే ఉత్సాహం కలగటంలో పేగులు అంతర్గత పాత్ర పోషిస్తున్నాయని ఇవి రెండూ సూచిస్తున్నాయి. అయితే మనుషుల్లోనూ పేగు బ్యాక్టీరియా ఇలాంటి ప్రభావమే చూపిస్తుందని ఇప్పుడప్పుడే చెప్పలేమని పరిశోధకులు అంటున్నారు. ఏదేమైనా పేగుల్లోని బ్యాక్టీరియా జీర్ణకోశ వ్యవస్థ వెలుపలా ప్రభావం చూపిస్తుండటం మాత్రం నిజం. ఇది మూడ్‌ను మార్చటం, రక్తంలో గ్లూకోజు మోతాదులను నియంత్రించటంలోనూ తోడ్పడుతున్నట్టు గతంలోనూ బయటపడింది. వాపుప్రక్రియతో ముడిపడిన గుండెజబ్బు, మతిమరుపు వంటి వాటి నుంచీ రక్షిస్తున్నట్టు తేలింది.


మెదడుకు తీపి కాదు

మన మెదడు గ్లూకోజు రూపంలో శక్తిని వినియోగించుకుంటుంది. అలాగని ఆహారంలో తీపి ఎక్కువైతే మాత్రం ప్రమాదమే. అధిక తీపి ఆహారం మెదడులో గ్లూకోజు మోతాదులు మితిమీరేలా చేస్తుంది. ఇది జ్ఞాపకశక్తి తగ్గటానికి దారితీస్తుంది. జ్ఞాపకాలను విడమరచుకోవటానికి కారణమయ్యే హిప్పోక్యాంపస్‌లో సాగేగుణాన్ని తగ్గిస్తుంది. అలాగే శాక్రిన్‌, సుక్రలోజ్‌ వంటి కృత్రిమ తీపి పదార్థాలూ మెదడు పనితీరును దెబ్బతీస్తాయి. ఇవి పేగుల్లో చెడు బ్యాక్టీరియాను వృద్ధి చేయటం ద్వారా మూడ్‌ మీద విపరీత ప్రభావం కలిగిస్తాయి. ఆస్పర్‌టేమ్‌తో ఆందోళన తలెత్తుతున్నట్టూ కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మెదడులో హానికర విశృంఖల కణాల సంఖ్య పెరిగేలా చేస్తుంది కూడా. కాబట్టి తీపి పదార్థాల విషయంలో జాగ్రత్త అవసరం. కృత్రిమ తీపి పదార్థాలకు బదులు తేనె వంటి ప్రత్యామ్నాయాలను వాడుకోవటం మంచిది.


నీటి పోషణ

తగినంత నీరు తాగటం ఆరోగ్యానికి ఎంతైనా అవసరం. మరి దీన్ని మరింత పోషక భరితం చేస్తే? నీటికి పోషకాలేంటని అనుకోకండి. రోజూ తాగే నీటికే ఓ దోసకాయ ముక్క, కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా నిమ్మరసం జతచేసి చూడండి. దోసకాయతో పీచు, పుదీనా ఆకులతో యాంటీఆక్సిడెంట్లు, నిమ్మరసంతో విటమిన్‌ సి అదనంగా లభిస్తాయి. ఇవి పేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మలబద్ధకం తగ్గుతుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని