Planning For Children: పండంటి పాపాయి కోసం పక్కా ప్రణాళిక... ఏం చేయాలి? ఎలా చేయాలి?

గర్భధారణ ఆషామాషీ వ్యవహారం కాదు. భార్యాభర్తల శారీరక, మానసిక పరిపక్వత.. జీవనశైలి వంటి పలు అంశాలు దీనిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. కాబట్టి పండంటి పాపాయి సంపూర్ణ ఆరోగ్యంతో నట్టింట్లో గంతులేయాలంటే గర్భధారణకు ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవటం, పూర్తిస్థాయిలో సన్నద్ధం కావటం ఎంతో అవసరం. 

Updated : 31 Mar 2024 17:02 IST

ఇంటి కోసం ప్లాను వేసుకుంటాం, కారు కోసం ప్లాన్‌ వేసుకుంటాం. చివరికి సోఫా కొనాలన్నా బోలెడన్ని నమూనాలు పరిశీలిస్తాం. బడ్జెట్‌, సదుపాయాలు, అవసరాల వంటివన్నీ చూసుకొని, చర్చించుకొని, తెలిసినవారిని కనుక్కొని మరీ నిర్ణయం తీసుకుంటాం. మరి మన జీవితంలో అపూర్వమైన, అతి మధురమైన ఘట్టం- గర్భధారణ గురించి ఇంకెంత శ్రద్ధ చూపాలి? ఎంత ముందుగా సన్నద్ధం కావాలి?

ప్రతి మహిళ జీవితంలోనూ గర్భధారణ ఓ అపురూపమైన, అనిర్వచనీయమైన అనుభవం. ఇది తొమ్మిది నెలల సంరంభమే కావొచ్చు గానీ కలకాలం నిలిచిపోయే జ్ఞాపకం. ఇంతటి మధురమైన, కీలకమైన ఘట్టంలో ఎక్కడ పొరపాటు దొర్లినా అది జీవితాంతం వెంటాడుతుంది. గర్భస్రావం కావటం దగ్గర్నుంచి.. పిల్లలు అవకరాలతో పుట్టటం వరకూ ఎన్నో సమస్యలకు, ఇబ్బందులకు దారితీస్తుంది. అందుకే గర్భధారణకు ముందు నుంచే- అంటే కనీసం 6 వారాల ముందు నుంచే సన్నద్ధం కావటం చాలా అవసరం. కాబోయే తల్లి శారీరకంగా పూర్తి ఆరోగ్యంతో ఉండేలా చూసుకోవటం.. ఏవైనా సమస్యలుంటే నియంత్రణలో ఉంచుకోవటం చాలా కీలకం. ఒక్క ఆరోగ్యపరంగానే కాదు.. పిల్లల పెంపకం విషయంలో మానసికంగా, ఆర్థికంగా సన్నద్ధం కావటమూ ముఖ్యమే.

ఆరోగ్యపరంగా..

పునాది బలంగా ఉంటేనే ఇల్లు స్థిరంగా నిలబడుతుంది. అలాగే తల్లి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే పండంటి పాపాయి కల సాకారమవుతుంది. అందువల్ల గర్భధారణ కోసం ప్రయత్నించటానికి ముందు నుంచే సన్నద్ధత అవసరం. అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లోపించకుండా చూసుకోవటం.. అన్ని పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవటం.. పొగ, మద్యం వంటి అలవాట్ల జోలికి వెళ్లకపోవటం.. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఎంతో అవసరం. దీంతో గర్భధారణ ప్రయత్నాలు మెరుగవటమే కాదు.. గర్భం ధరించాక ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, కాన్పు సజావుగా జరిగేలానూ చూసుకోవచ్చు. గర్భం ధరించిన తర్వాత కొన్నిరకాల మందులు వాడటం కుదరదు. అందువల్ల ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే గర్భధారణకు ముందే గుర్తించి, తగు చికిత్స తీసుకోవాలి కూడా.

ఫోలిక్‌ యాసిడ్‌

భార్యాభర్తలిద్దరిలో ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేకపోయినా కూడా 2 నుంచి 2.5% మంది పిల్లలు అవకరాలతో పుట్టే అవకాశముంది. అందువల్ల గర్భధారణకు ప్రయత్నించటానికి ముందు నుంచే ఫోలిక్‌ యాసిడ్‌ తీసుకోవటం మంచిది. దీంతో పుట్టబోయే బిడ్డలో అవయవలోపాలను, జన్యులోపాలను నివారించుకోవచ్చు. సాధారణంగా మొదటి మూడు నెలల్లోనే పిండం అవయవాలన్నీ తయారైపోతాయి. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తుంటాయి. వీటి తయారీ, ఎదుగుదల సక్రమంగా సాగటానికి ఫోలిక్‌ యాసిడ్‌ ఎంతగానో తోడ్పడుతుంది. మహిళలకు రోజుకు 400 మైక్రోగ్రాముల ఫోలిక్‌ యాసిడ్‌ అవసరమవుతుంది. పెరిడాక్సిన్‌, బి12, నికొటినమైడ్‌ లోపంతోనూ అవకరాలు తలెత్తొచ్చని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందువల్ల బీ కాంప్లెక్స్‌ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

ఐరన్‌

గర్భధారణకు ఐరన్‌ చాలా కీలకం. గర్భం ధరించటానికి రక్తంలో హిమోగ్లోబిన్‌ కనీసం 11 గ్రాములన్నా ఉండాలి. కానీ మనదేశంలో చాలామందికి 6 గ్రాములైనా ఉండటం లేదు. ఇది రక్తహీనతకు దారితీసి, గర్భధారణ అవకాశాలను దెబ్బతీస్తుంది. ఒకవేళ గర్భం ధరించినా పుట్టే పిల్లలు అంత ఆరోగ్యంగానూ ఉండరు. ఎదుగుదల దెబ్బతింటుంది. మెదడు సరిగా అభివృద్ధి చెందదు. విషయగ్రహణ సామర్థ్యం తగ్గుతుంది. ఇది బుద్ధి మాంద్యానికి దారితీయొచ్చు. కాబట్టి రక్తహీనత తలెత్తకుండా ముందు నుంచే ఐరన్‌ తీసుకోవటం మంచిది.

మధుమేహ నియంత్రణ

గర్భధారణకు ముందు రక్తంలో గ్లూకోజు స్థాయులు ఎక్కువగా (ప్రి జెస్టేషనల్‌ డయాబెటీస్‌) ఉన్నా ఇబ్బందే. వీరికి అవయవలోపాలతో పిల్లలు పుట్టే ముప్పు రెండింతలు ఎక్కువ. అందువల్ల గ్లూకోజు స్థాయులు ఎక్కువగా గలవారు కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. ఆ తర్వాతే గర్భధారణకు ప్రయత్నించాలి. అలాగే అధిక రక్తపోటుకు గలవారు కూడా కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి.

బరువు అదుపు

బరువు తక్కువగా ఉండటమే కాదు.. ఎక్కువున్నా ఇబ్బందే. వూబకాయ మహిళలు గర్భం ధరించటం కష్టం. ఒకవేళ ధరించినా దాదాపు సగం మందికి గర్భం నిలవకపోవచ్చు. నిలిచినా మధుమేహం, హైబీపీ వచ్చే అవకాశం ఎక్కువ. గర్భంలో పిండం సరిగా ఎదగకపోనూవచ్చు. అవకరాలూ తలెత్తొచ్చు. అందువల్ల వూబకాయులు బరువు తగ్గించుకున్నాకే గర్భధారణకు ప్రయత్నించటం మంచిది. అందువల్ల రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది. నడక, ఈత, సైకిల్‌ తొక్కటం వంటివి ఎంతో మేలు చేస్తాయి. యోగా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక బరువు తక్కువగా గలవారు కండరాలు పెరగటానికి తోడ్పడే వ్యాయామాలు చేయటం, రోజుకు కనీసం మూడు సార్లు భోజనం చేయటం మేలు.

పొగకు దూరం

సిగరెట్లు కాల్చే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. సిగరెట్ల మూలంగా మగవారిలో వీర్యం నాణ్యత తగ్గుతుంది. వీర్యకణాల్లోని డీఎన్‌ఏ దెబ్బతింటుంది. ఇది పిల్లల్లో అవకరాలకు దారితీయొచ్చు. ఇక ఆడవారిలో మాయ సరిగా అభివృద్ధి చెందదు. పిండం సరిగా ఎదగక పోవటం వల్ల పిల్లలు చాలా చిన్నగా పుడతారు. మెదడు దెబ్బతిని బుద్ధిమాంద్యమూ రావొచ్చు. కాబట్టి ఆడవాళ్లు గానీ మగవాళ్లు గానీ సిగరెట్లు కాల్చటం, పొగాకు నమలటం వంటి వాటి జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. ఒకవేళ అలాంటి అలవాట్లుంటే వెంటనే మానెయ్యాలి. పక్కవాళ్లు వదిలిన సిగరెట్‌ పొగను పీల్చటమూ మంచిది కాదు. అలాగే మద్యం జోలికి వెళ్లకుండానూ చూసుకోవాలి.

ఇతరత్రా సమస్యలు

థైరాయిడ్‌ హార్మోన్‌ స్థాయులు ఎక్కువైనా, తక్కువైనా గర్భధారణ మీద గణనీయమైన ప్రభావం చూపుతాయి. థైరాయిడ్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గితే (హైపోథైరాయిడిజమ్‌) గర్భధారణ కష్టమవుతుంది. ఒకవేళ గర్భం ధరించినా నిలవకపోవచ్చు. థైరాయిడ్‌ ఎక్కువైతే (హైపర్‌థైరాయిడిజమ్‌) నెలలు నిండకముందే కాన్పు కావొచ్చు, పిల్లలు తక్కువ బరువుతో పుట్టొచ్చు. కాబట్టి గర్భధారణకు ప్రయత్నించే ముందే థైరాయిడ్‌ సమస్యలేమైనా ఉన్నాయేమో పరీక్షించుకోవాలి. సమస్యలుంటే విధిగా చికిత్స తీసుకోవాలి.

ఇతరత్రా మందులతో జాగ్రత్త

కొందరు చిన్నప్పటి నుంచే ఫిట్స్‌తో బాధపడుతుంటారు. ఫిట్స్‌ తగ్గటానికి వేసుకునే మందులతో ఫోలిక్‌ యాసిడ్‌ లోపం పెరుగుతుంది. ఇది పుట్టుకతోనే పిల్లల్లో లోపాలకు దారితీయొచ్చు. అందువల్ల వీరికి పెద్దమొత్తంలో (5 మిల్లీ గ్రాములు) ఫోలిక్‌ యాసిడ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఫిట్స్‌కు వేసుకునే రకరకాల మందులను ఒకే మందు (మోనోథెరపీ) కిందికి మార్చుకోవాల్సిన అవసరమూ ఉంది. అలాగే గుండె జబ్బులు గలవారు రక్తం గడ్డకట్టకుండా చూసే మందులు వాడుతుంటారు. వీటితో అబార్షన్‌ ముప్పు పెరగొచ్చు. లూపస్‌, రుమటాయిడ్‌ వంటి సమస్యలకు వాడే స్టిరాయిడ్లతోనూ ఇబ్బందులు తలెత్తొచ్చు. కాబట్టి ఏవైనా జబ్బులతో బాధపడేవారు గర్భధారణకు ముందే ఒకసారి డాక్టర్‌ను కలిసి తగు జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.

సమతులాహారం

ఉత్త కేలరీలు తప్ప ఎలాంటి పోషకాలు లేని జంక్‌ఫుడ్‌ మానెయ్యటం ఉత్తమం. రోజూ తాజా ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పెరుగు తీసుకోవాలి. దీంతో అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. మాంసాహారులైతే రోజూ గుడ్డు తినొచ్చు.

కలిసే సమయం

సాధారణంగా బహిష్టు అయిన 10-20 రోజుల మధ్యలో గర్భధారణకు అవకాశాలు ఎక్కువ. ఈ రోజుల్లో అండం ఎప్పుడైనా విడుదల కావొచ్చు. ఇది 24 గంటలు మాత్రమే ఉంటుంది, తర్వాత కరిగిపోతుంది. కాబట్టి గర్భధారణకు అవకాశాలు ఎక్కువగా ఉండే రోజుల్లో విధిగా సంభోగంలో పాల్గొనేలా చూసుకోవాలి. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే భార్యాభర్తలకు ఇది చాలా ముఖ్యం.

మీజిల్స్‌ టీకా

గర్భిణులను పెద్దగా ఇబ్బందిపెట్టకపోయినా మీజిల్స్‌ పిండంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిజానికి చిన్నప్పుడు చాలామంది రుబెల్లా టీకా తీసుకొని ఉండొచ్చు. కానీ దాని ప్రభావం దీర్ఘకాలం ఉండకపోవచ్చు. అందువల్ల గర్భధారణకు ముందే మహిళలకు రుబెల్లా రక్షణ ఉందా? లేదా? అన్నది చూడాలి. రక్తంలో ఐజీఎం యాంటీబాడీలను బట్టి టీకా రక్షణను నిర్ధరిస్తారు. ఒకవేళ తగినంత రక్షణ లేకపోతే వెంటనే రుబెల్లా టీకా తీసుకోవాలి. టీకా తీసుకున్న నాలుగు వారాల తర్వాతే గర్భధారణకు ప్రయత్నం చేయాలి. అలాగే ఆటలమ్మ రక్షణ ఉందో లేదో కూడా చూసుకోవాలి.


గర్భధారణకు ఏది మంచి వయసు?

కొందరు ఎలాంటి ప్రణాళికలూ లేకుండా పెళ్లయిన వెంటనే పిల్లలను కంటుంటే.. మరికొందరు ఉద్యోగంలో కుదురుకున్నాక, జీవితంలో స్థిరపడ్డాక కంటామంటూ ఏళ్లకేళ్లు వాయిదా వేసుకుంటున్నారు. కొందరైతే 35 ఏళ్లు దాటాక గానీ సంతానం గురించి ఆలోచించటం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. మహిళలు రజస్వల అయిన దగ్గర్నుంచీ ప్రతి నెలా అండాశయంలోని అండాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. 37 ఏళ్లు వచ్చేసరికి అండాల సంఖ్య బాగా పడిపోతుంది. ఇక మగవారిలోనూ వయసు మీద పడుతున్నకొద్దీ వీర్యం నాణ్యత తగ్గుతూ వస్తుంది. మగవారు 40 ఏళ్ల తర్వాత సంతానం కోసం ప్రయత్నిస్తే పుట్టబోయే పిల్లల్లో ఆటిజమ్‌ తలెత్తే అవకాశమున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సంతానం కనటాన్ని మరీ త్వరగా లేదా మరీ ఆలస్యం కాకుండా చూసుకోవాలి. మహిళలు 21-29 ఏళ్ల మధ్య గర్భం ధరించేలా చూసుకోవటం మంచిది.


ఆర్థిక, మానసికపరంగా..

పిల్లల్ని కనటంతోనే అయిపోదు. వారిని సంపూర్ణ ఆరోగ్యంతో పెంచాలి, పోషించాలి. సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. ఇందుకు మానసిక పరిపక్వత, ఆర్థికంగా నిలదొక్కుకోవటం కూడా అవసరం. విదేశాల్లోనైతే పెళ్లి చేసుకునే సమయంలోనే ఇల్లు, ఇంటికి కావలసిన సదుపాయాలన్నీ వధూవరులే సమకూర్చుకుంటారు. మనదగ్గర పరిస్థితి వేరు. తల్లిదండ్రులే అవసరమైనవన్నీ ఏర్పాటు చేస్తుంటారు. అంతేకాదు, పెళ్లి కావటమే ఆలస్యం.. ‘తొందరగా పిల్లలను కనేయండి, మేం చూసుకుంటాం కదా’ అని తెగ పోరుపెడుతుంటారు. పెళ్లయిన వెంటనే పిల్లలను కంటే వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చినవారు పరస్పరం అర్థం చేసుకోవటానికి సమయమే చిక్కదు. ఇది మున్ముందు ఇబ్బందులకు దారితీయొచ్చు. కాబట్టి పెళ్లయ్యాక కనీసం ఒక సంవత్సరం వరకైనా ఆగటం మంచిది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని, పరస్పరం మాట్లాడుకొని, ఆర్థికంగా నిలదొక్కుకున్నాకే గర్భధారణకు నిర్ణయం తీసుకోవాలి. పిల్లలను కన్న తర్వాత తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు మానసికంగా సన్నద్ధం కావాలి.


ఆసుపత్రి సదుపాయాలూ..

ఇంటికి దగ్గర్లో అన్ని సదుపాయాలు గల ఆసుపత్రి ఉందేమో కూడా ముందే చూసుకోవాలి. దీంతో అత్యవసరమైతే వెంటనే ఆసుపత్రిలో చేర్చటానికి అవకాశముంటుంది. కొందరు మగవాళ్లు కాన్పు సమయం దగ్గరపడుతున్నప్పుడు భార్యను పుట్టింటికి పంపిస్తుంటారు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల ఈ విషయంలో ముందుగానే భార్యాభర్తలు చర్చించుకొని ఒక నిర్ణయానికి రావాలి. కాన్పు తర్వాత కూడా ఇంటికి లేదా ఆఫీసుకు దగ్గర్లో పిల్లలను కనిపెట్టుకోవటానికి క్రష్‌ వంటివి ఉన్నాయేమో కూడా చూసి పెట్టుకోవాలి.


రెండోసారి కూడా..

పుట్టిన బిడ్డ తల్లిపాలు మానకముందే కొందరు తిరిగి గర్భం ధరిస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. కాన్పు తర్వాత తల్లి ఆరోగ్యం పూర్తిగా కోలుకోవటానికి కనీసం ఏడాదిన్నర పడుతుంది. అందువల్ల మొదటి సారే కాదు, రెండోసారి గర్భం ధరించటానికీ ముందుస్తు సన్నద్ధత అవసరం. కాన్పుకూ కాన్పుకూ మధ్య కనీసం మూడేళ్ల ఎడం ఉండేలా చూసుకోవాలి. వెంటనే గర్భం ధరిస్తే మొదటి బిడ్డ ఆలనా పాలనా చూసుకోవటం కష్టమవుతుంది. దీంతో బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది. రెండో బిడ్డ పుట్టాక మొదటి బిడ్డ మీద శ్రద్ధ కూడా తగ్గుతుంది. అందువల్ల కాన్పు అనంతరం తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకోవాలి.


- డా|| పి.బాలాంబ, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ (గైనకాలజీ), 
ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని