Updated : 22 Oct 2021 00:35 IST

చిన్న వయసు.. గొప్ప మనసు!

‘మనసుంటే చాలు.. ఇతరులకు సాయం చేయొచ్చు’ అని ఈ నేస్తం నిరూపిస్తున్నాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులకు అండగా నిలుస్తున్నాడు. అందుకోసం శ్రమిస్తున్నాడు. ఎంతో మందిలో స్ఫూర్తినీ నింపుతున్నాడు. ఇంతకీ అతనెవరు? ఏం చేస్తున్నాడు? ఆ వివరాలన్నీ మీకోసం..

ఆరవ్‌ హక్‌. వయసు 16 ఏళ్లు. పుట్టింది ముంబయిలో. ఆరవ్‌కు చిన్నప్పట్నుంచి అభ్యుదయ భావాలు ఎక్కువ. ఎవరేం కావాలన్నా తనకు తోచినంతలో సాయం చేసేందుకు ముందుండేవాడు.

అమ్మ వల్లనే..

అమ్మ నిఖిత పడోరా. ఆమె సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అంతేకాదు క్యాన్సర్‌ బాధిత చిన్నారులకోసం నెలకొల్పిన ‘నర్గీస్‌ దత్‌ ఫౌండేషన్‌’కు ఆమె సాయం చేసేవారు. అక్కడ్నుంచి ఇంటికి వెళ్లాక సంస్థలో ఎంతమంది పిల్లలున్నారు. వాళ్లంతా క్యాన్సర్‌తో ఎలా పోరాడుతున్నారు వంటి విషయాలన్నీ రోజూ ఆరవ్‌తో షేర్‌ చేసుకునేవారు వాళ్లమ్మ. చిన్నప్పటినుంచి అవన్నీ వింటూ వచ్చిన ఆరవ్‌కు కూడా సేవా దృక్పథం అలవడింది. అలా క్యాన్సర్‌తో బాధపడేవారికోసం ఏదైనా చేయాలనే ఆలోచనా వచ్చింది. అయితే క్యాన్సర్‌ చికిత్సకు బోలెడంత ఖర్చవుతుంది. మరి ఈ క్యాన్సర్‌ పేదవాళ్ల పిల్లలకు వస్తే వాళ్ల పరిస్థితి ఏంటి? ఇదే ఆరవ్‌ మెదడులో మెదిలింది.

రూ.25 లక్షల సాయం

అది 2017.. అప్పటికి ఆరవ్‌కు 12 ఏళ్లు.  ఆ ఏడాది ముంబయిలో మారథాన్‌ జరిగింది. అందులో ఆరవ్‌ పాల్గొన్నాడు. మొదటిసారే ఏకంగా 12 లక్షల 12 వేల 121 రూపాయలు సేకరించి క్యాన్సర్‌ రోగులకు సాయం చేశాడు. అంత చిన్న వయసులోనే ఇంత మొత్తం సేకరించాలంటే మాటలు కాదు. అందుకోసం చాలానే కష్టపడ్డాడు. తన చుట్టు పక్కల ఉన్నవాళ్లకు క్యాన్సర్‌ గురించి అవగాహన కల్పించేవాడు. ఇంటింటికి వెళ్లి చిన్నారులకు వస్తోన్న క్యాన్సర్‌ గురించి, వాళ్ల సాధక బాధకాల గురించి వివరించేవాడు. ఇంకా తను సేకరించిన మొత్తం చిన్నారుల చికిత్సకు సరిపోకపోవడంతో వెంటనే ఫేస్‌బుక్‌లో ఫండ్‌ రైజింగ్‌ పేజీని క్రియేట్‌ చేసి సాయం చేయమని అందులో దాతల్ని కోరేవాడు. 2018లో మళ్లీ మారథాన్‌లో పాల్గొని ఇంకాస్త ఎక్కువ ఫండ్‌ సేకరించాడు. లాక్‌డౌన్‌ సమయంలో కరోనా రోగులకు కూడా ఆహార పొట్లాలు అందించాడు. తన ఫండ్‌ రైజింగ్‌ పేజీ సాయంతో ఈ ఏడాది 25 లక్షల రూపాయలు సేకరించాడు. దీంతో ఆరవ్‌ ‘యంగెస్ట్‌ సోషల్‌ వర్కర్‌’గా అవార్డు అందుకున్నాడు. తన సేవల్ని ఆపననీ, నిరంతరం కొనసాగిస్తూనే ఉంటాననీ చెబుతున్నాడు ఆరవ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు