మాస్టారూ.. మీరు సూపరూ..!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు పాఠాలు చెప్పే ఒక్కో టీచర్‌కు ఒక్కో విధానం ఉంటుంది కదా! ‘ఏంటి.. ఇక్కడ కూడా బడి, ఉపాధ్యాయుల గురించేనా?’ అని నిరుత్సాహపడకండి నేస్తాలూ.. ఈ మాస్టారి గురించి వింటే.. మీకు కూడా తెలుసుకోవాలనే ఉత్సాహం వస్తుంది.

Published : 25 Feb 2023 00:05 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు పాఠాలు చెప్పే ఒక్కో టీచర్‌కు ఒక్కో విధానం ఉంటుంది కదా! ‘ఏంటి.. ఇక్కడ కూడా బడి, ఉపాధ్యాయుల గురించేనా?’ అని నిరుత్సాహపడకండి నేస్తాలూ.. ఈ మాస్టారి గురించి వింటే.. మీకు కూడా తెలుసుకోవాలనే ఉత్సాహం వస్తుంది. ఆ వివరాలేంటో చదివేయండి మరి..గుజరాత్‌లోని హరినగర్‌ ప్రాథమిక

పాఠశాలకు చెందిన నీలంభయ్‌ పటేల్‌ అనే మాస్టారు అందరి దృష్టిని ఆకర్షిస్తూ.. వార్తల్లో నిలిచారు. ఇంతకీ విశేషం ఏంటంటే.. అక్షరాలు, జీవులు, గణిత సూత్రాలు, జిల్లా సంబంధిత వివరాలన్నీ ముద్రించిన కుర్తాలను ధరిస్తూ, విద్యార్థులకు చదువుపైన ఆసక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. 

లాక్‌డౌన్‌ సమయంలో..

పటేల్‌ మాస్టారు పదహారేళ్లుగా హరినగర్‌ స్కూల్‌లోనే పనిచేస్తున్నారు. మొదట్నుంచి పిల్లలకు విద్యపైన ఇష్టం ఏర్పడేలా రకరకాల పద్ధతుల్లో చుట్టుపక్కల గ్రామాల్లో అవగాహన కల్పించేవారు. కరోనా సమయంలో బడులన్నీ మూతబడ్డాయని తెలిసిందే కదా! అంతటా జరిగినట్లే.. ఈ ఊరి పాఠశాలలోని పిల్లలకు కూడా ఆన్‌లైన్‌లోనే క్లాసులు బోధించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, ఇక్కడి వారందరూ పేదవారే కావడంతో సెల్‌ఫోన్లు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ ఫోన్లు ఉన్నా, సిగ్నళ్లు అంతంతమాత్రమేనట. దాంతో పిల్లలు నష్టపోకుండా ఏదో ఒకటి చేయాలని బాగా ఆలోచించారీ మాస్టారు. అప్పుడే.. కుర్తాలపైన అక్షరాలను ముద్రించి, గ్రామంలోని కూడళ్ల వద్ద సామాజిక దూరం పాటిస్తూ పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు.

పచ్చదనం పెంచాలనీ..

ఈ సరికొత్త విధానం చిన్నారులతోపాటు పెద్దలకూ ఎంతగానో నచ్చింది. దాంతో అప్పటి నుంచి ఈ మాస్టారు పిల్లలకు ఉపయోగపడే అంశాలు ముద్రించిన దుస్తులనే వేసుకోసాగారు. అంతేకాదు నేస్తాలూ.. పచ్చదనం పెంపొందించడంలోనూ ఈ మాస్టారు బాగా కష్టపడుతున్నారట. బడి ఆవరణలో సొంతంగా కూరగాయలు పండిస్తూ.. విద్యార్థులకు కూడా మొక్కలను పంపిణీ చేస్తున్నారు. వాటిని ఇళ్ల ఆవరణలో నాటి, పర్యవేక్షణ సూచనలూ అందిస్తున్నారట. వృత్తితోపాటు సామాజిక బాధ్యతలోనూ వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్న ఈ మాస్టారికి బోలెడు అవార్డులు వచ్చాయి. ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపూ సాధించారు. ఈ మాస్టారు చిన్నారులతోపాటు ఇతర ఉపాధ్యాయులకూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ టీచర్‌ కూడా ఈ పటేల్‌ మాస్టారి నుంచి స్ఫూర్తి పొందారట. ఆయనలాగే అక్షరాలు, వివిధ అంశాలు ముద్రించిన కుర్తాలను ధరించే, రోజూ పాఠశాలకు వెళ్తున్నారు. మన దగ్గరా ఇలాంటి టీచర్‌ ఉంటే బాగుండునని అనిపిస్తోంది కదూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు