ఏంటీ శాటిలైట్‌ నగరాలు?

శాటిలైట్‌ నగరం.. పట్టణ ప్రణాళికలో తరచూ వినపడే పేరిది. పట్టణీకరణ సమస్యలకు ఉత్తమ పరిష్కారంగా భావిస్తుంటారు. నగరం ఎదుర్కొనే ట్రాఫిక్‌, అధిక జీవనవ్యయంతో సిటీలో జీవించలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలను చూపుతుంది.

Updated : 25 Mar 2023 07:16 IST

అభివృద్ధి చేస్తే చౌకలో నివాస యోగ్యం
ఈనాడు, హైదరాబాద్‌

శాటిలైట్‌ నగరం.. పట్టణ ప్రణాళికలో తరచూ వినపడే పేరిది. పట్టణీకరణ సమస్యలకు ఉత్తమ పరిష్కారంగా భావిస్తుంటారు. నగరం ఎదుర్కొనే ట్రాఫిక్‌, అధిక జీవనవ్యయంతో సిటీలో జీవించలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలను చూపుతుంది. ఈ ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్‌పై భారం పడకుండా సిటీ చుట్టూ శాటిలైట్‌ నగరాలను అభివృద్ధి చేయాలని బిల్డర్లు సైతం సూచిస్తుంటారు. అసలు ఏంటీ శాటిలైట్‌ నగరం? మన సిటీ చుట్టూ అలాంటి నగరాలు ఏమైనా ఉన్నాయా? వీటి అభివృద్ధితో సొంతింటి స్వప్నం నెరవేర్చుకోవచ్చా?

మెట్రోపాలిటన్‌ నగరాలకు సమీపంలోని పట్టణాలను శాటిలైట్‌ నగరాలుగా చెబుతుంటారు. ఇవి మెట్రో నగరంతో అనుసంధానమై ఉంటాయి తప్ప వాటిలో భాగం కావు. స్వయం సమృద్ధితో అన్ని సౌకర్యాలు ఉండి విద్య, వైద్య సదుపాయాలతో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతాలుగా పేర్కొంటుంటారు. హైదరాబాద్‌ చుట్టూ అలాంటి పట్టణాలు ఏమైనా ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. టౌన్‌షిప్‌ పాలసీతో ప్రభుత్వం కొంత మేరకు ప్రయత్నం చేస్తున్నా.. లక్ష్యాన్ని చేరేవరకు చాలా సమయం పట్టేలా ఉంది. శాటిలైట్‌ పట్టణాలుగా అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో వైద్యం, సోషల్‌ ఇన్‌ఫ్రా పరంగా ఆశించిన మేర అభివృద్ధి చెందలేదు. నిధుల కేటాయింపు నామమాత్రంగా ఉండటంతో మౌలిక వసతుల కల్పన సమస్యగా ఉంది.

కలిసిపోతున్నాయి..

హైదరాబాద్‌ సిటీ నలువైపులా పట్టణాలు ఉన్నాయి. శంకర్‌పల్లి, శంషాబాద్‌, తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్‌, శామీర్‌పేట, మేడ్చల్‌, పటాన్‌చెరు పట్టణాలు ఉన్నాయి. ఒకప్పుడు సిటీకి దూరంగా ఉన్న ఈ ప్రాంతాలు ఇప్పుడు సిటీలో కలిసిపోయాయి. ఇవన్నీ అవుటర్‌ రింగ్‌రోడ్డుకి చేరువలో ఉన్నాయి. అక్కడిదాకా సిటీ వేగంగా విస్తరిస్తోంది. మరో ఐదారేళ్లలో ఇవన్నీ కూడా సిటీలో అంతర్భాగం కానున్నాయి. కానీ, శాటిలైట్‌ పట్టణం మహానగరంలో భాగం కాకుండా ఉండాలనే ప్రాథమిక సూత్రం నేపథ్యంలో సిటీ చుట్టూ ఉన్న పెద్ద పట్టణాలు ఇందుకు అనుకూలంగా కన్పిస్తున్నాయి. సిటీకి ఈ పట్టణాలన్నీ దాదాపు 50 కి.మీ. దూరంలో ఉన్నాయి. ప్రాంతీయ వలయ రహదారితో అనుసంధానం కల్గి ఉన్నాయి. సంగారెడ్డి, షాద్‌నగర్‌, ఆమనగల్లు, చౌటుప్పల్‌, భువనగిరి, గజ్వేల్‌, తూప్రాన్‌ పట్టణాలను శాటిలైట్‌ సిటీలుగా అభివృద్ధి చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో టౌన్‌షిప్పులు వస్తున్నాయి. రిటైర్మెంట్‌ హోమ్స్‌ నిర్మిస్తున్నారు. ఇతర ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి.

సమగ్ర అభివృద్ధితో..

నగరం చుట్టూ గుర్తించిన పట్టణాలకు మరిన్ని వసతులు కల్పించగల్గితే శాటిలైట్‌ నగరంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని స్థిరాస్తి రంగ ప్రతినిధులు అంటున్నారు. స్వతంత్ర ఆర్థిక వ్యవస్థ ఏర్పాటయ్యేలా పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలు ఉండేలా చూడాలి. పర్యావరణ అనుకూల సమగ్ర అభివృద్ధి ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి. క్రమ బద్ధమైన అభివృద్ధికి భరోసా ఉండాలి. అన్ని వర్గాలకు సరసమైన ధరలకు గృహాలు అందుబాటులో ఉండాలి. కొత్త తరానికి తగ్గట్టుగా స్మార్ట్‌ సేవలు, భద్రత కల్పించాలి. ఇదే కాదు ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన సంస్కృతి, చరిత్ర ఉండాలని వాదించేవారు ఉన్నారు. అప్పుడే ఆయా నగరాలకు ఒక గుర్తింపు వచ్చి స్వయంసమృద్ధిగా అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారు.

* ఇక్కడ జీవన వ్యయం తక్కువగా ఉంటుంది. అన్నివర్గాల ప్రజలు జీవించవచ్చు. ఉపాధి కోసం స్థానికంగా లేదంటే సమీపంలోని మహానగరానికి రోజువారీ రాకపోకలు సాగిస్తుంటారు. అందుకు అనువైన ప్రజారవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. చౌకగా, తక్కువ సమయంలో సిటీకి వచ్చిపోయేలా రవాణా వ్యవస్థ ఉండాలి. లోకల్‌రైలు, ఎంఎంటీఎస్‌, బస్సు తదితర సౌకర్యాలు కల్పించాలి.

* సిటీలో ఉన్న సౌకర్యాలు, సదుపాయాలే ఇక్కడ నివసించే వారికీ కల్పించాలి. ఇవి లేకపోతే నగరానికి వలస వెళతారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని