సాగర్‌ చుట్టూ ‘ఆకాశహర్మ్యాలు’

ఆకాశహర్మ్యాలంటే హైటెక్‌సిటీ గుర్తొస్తుంది. కూకట్‌పల్లి, మియాపూర్‌, హఫీజ్‌పేట, కొండాపూర్‌, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఖాజాగూడ, ఎల్బీనగర్‌, ఇతరత్రా ప్రాంతాల పేర్లు తర్వాత వినిపిస్తాయి.

Updated : 24 Dec 2022 07:03 IST

17 అంతస్తులతో గేటెడ్‌ కమ్యూనిటీ
అనుమతుల దశలో మరో 4 ప్రాజెక్టులు

ఈనాడు, హైదరాబాద్‌: ఆకాశహర్మ్యాలంటే హైటెక్‌సిటీ గుర్తొస్తుంది. కూకట్‌పల్లి, మియాపూర్‌, హఫీజ్‌పేట, కొండాపూర్‌, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, ఖాజాగూడ, ఎల్బీనగర్‌, ఇతరత్రా ప్రాంతాల పేర్లు తర్వాత వినిపిస్తాయి. ఇప్పుడు హుస్సేన్‌సాగర్‌ చుట్టూ అందుబాటులోని విశాలమైన ఖాళీ స్థలాల్లో ఆకాశహర్మ్యాలను నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయి. సాగర్‌ చుట్టూ జరుగుతోన్న అభివృద్ధి పనులు, మారుతోన్న వినియోగదారుల అభిరుచులను బేరీజు వేసుకొని ఎత్తైన నిర్మాణాలకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ శోభ వాటర్‌ ఫ్రంట్‌ పేరుతో హుస్సేన్‌సాగర్‌ కనిపించేలా సోమాజిగూడలో 17 అంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకోవడం, మరో 4 ప్రాజెక్టులు అనుమతుల దశలో ఉండటమే అందుకు నిదర్శనం.

మారుతున్న అవసరాలతో..

పంజాగుట్ట, సోమాజిగూడ, బేగంపేట, హిమాయత్‌నగర్‌, అబిడ్స్‌, ఖైరతాబాద్‌ ప్రాంతాలు నగరం నడిబొడ్డున, హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఉంటాయి. మొదట్నుంచి ఆ ప్రాంతాలు వ్యాపార కేంద్రాలే. బడా వ్యాపారవేత్తలు, ప్రముఖులు ఎక్కువ శాతం అక్కడే ఉంటారు. ఆధునిక హంగులతో నివాస సముదాయాలు ప్రధాన నగరంలో నామమాత్రంగా ఉండటంతో చాలామంది పాత ఇళ్లలోనే, ఇరుకు రహదారుల మధ్య గడిపేస్తున్నారని నిర్మాణ రంగం నిపుణుల అంచనా. గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, ఓఆర్‌ఆర్‌ వైపు ఆకాశహర్మ్యాల్లో ఇళ్లు కొనే స్తోమత ఉన్నప్పటికీ చదువు, వ్యాపార, ఉద్యోగ అవసరాల రీత్యా ప్రధాన నగరంలోనే ఉంటున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిర్మాణ సంస్థలు ఇప్పుడు ప్రధాన నగరంలో స్థలాలను కొని ప్రాజెక్టుల వైపు అడుగులు వేస్తున్నాయి.

ఎర్రమంజిల్‌ నుంచి మొదలు..

నిర్మాణ దశలోనే ఆగిపోయి చాలాకాలం నిరుపయోగంగా ఉన్న ఎర్రమంజిల్‌లోని హైదరాబాద్‌ స్టాక్‌ ఎక్స్చేంజి భవనం స్థానంలో మొదటి ఎత్తైన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ప్రస్తుతం అందులో 19 అంతస్తుల్లో వాణిజ్య సముదాయం, 24 అంతస్తుల్లో నివాస సముదాయాలు నిర్మాణమవుతున్నాయి. అక్కడి నుంచి చూస్తే హుస్సేన్‌సాగర్‌ కనిపిస్తుంది. కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ముందు 134 మీటర్ల ఎత్తులో 4 వేల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంతో 132 లగ్జరీ వ్యక్తిగత గృహాలను 40 అంతస్తుల్లో నిర్మించేందుకు మీనాక్షి సంస్థ ఇటీవల అనుమతి తీసుకుంది.

సాగర్‌ పరిసరాలు..

ఒకప్పటి హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో చాలా మార్పు వచ్చింది. కొత్త సచివాలయం, అమరవీరుల జ్యోతి స్తూపం, 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం, ట్యాంక్‌బండ్‌ సుందరీకరణ, పీవీ మార్గ్‌ ఆధునికీకరణ, పార్కుల అభివృద్ధి, ఇతరత్రా పనులతో సాగర్‌ పరిసరాలు ఆకర్షణీయంగా మారుతున్నాయి. తాజాగా చుట్టూ ఎత్తైన నివాస భవనాలు నిర్మాణం కాబోతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం సాగర్‌ చుట్టూ ఎత్తైన భవంతులు నిర్మాణం కావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష సాకారమవుతోందని అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని