2030 నాటికి ట్రిలియన్‌ మార్కెట్‌

భారత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ 2030 నాటికి ఒక ట్రిలియన్‌ యూఎస్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. 2020లో ఇది 180 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వచ్చే పదేళ్లలో 18.7 శాతం వార్షిక వృద్ధిరేటుతో ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌(నరెడ్కో), కేపీఎంజీ నివేదిక పేర్కొంది.

Updated : 03 Feb 2024 04:57 IST

ప్రాప్‌టెక్‌ అంకురాలకు కేంద్రంగా హైదరాబాద్‌

ఈనాడు, హైదరాబాద్‌: భారత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ 2030 నాటికి ఒక ట్రిలియన్‌ యూఎస్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. 2020లో ఇది 180 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వచ్చే పదేళ్లలో 18.7 శాతం వార్షిక వృద్ధిరేటుతో ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌(నరెడ్కో), కేపీఎంజీ నివేదిక పేర్కొంది. ప్రభుత్వ కార్యకలాపాలు సాంకేతికత వినియోగం, సుస్థిర చర్యలు, పెట్టుబడులతో మార్కెట్‌ భారీగా పెరగడానికి దోహదం చేస్తుందని వెల్లడించింది. దిల్లీలో శుక్రవారం మొదలైన రెండు రోజుల 16వ జాతీయ సదస్సులో ‘స్మార్ట్‌, సస్టెయినబుల్‌, కనెక్ట్‌’ పేరుతో నివేదిక విడుదల చేసింది. సదస్సుకు నరెడ్కో తెలంగాణ నుంచి కార్యవర్గం, సభ్యులు పెద్దఎత్తున హాజరయ్యారు.

  • ముఖ్యాంశాలిలా.. ! దేశంలో గృహ, వాణిజ్య విభాగాల్లో బలమైన డిమాండ్‌ కారణంగా రియల్‌ ఎస్టేట్‌ పురోగతిని చవిచూసింది. సరసమైన గృహ పథకాలు, పెట్టుబడిదారుల స్నేహపూర్వక విధానాల అమలు హౌసింగ్‌ మార్కెట్‌లో వృద్ధికి ఊతమిచ్చింది.
  • పెట్టుబడులను ఆకర్షించడం, వాటిని నిలుపుకోవడం, తగిన నిధులను పొందడం, మౌలిక సదుపాయాల లేమి, నైపుణ్యాల అంతరాన్ని పరిష్కరించడం వంటి కొన్ని సవాళ్లను ఈ రంగం ఎదుర్కొంటోంది. వినూత్న ఫైనాన్సింగ్‌ పరిష్కారాలు, మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యం కల్గిన మానవవనరుల తయారీ ద్వారా వాటిని అధిగమించే అవకాశం ఉంది.

ఈ రెండే ప్రధానం..

రాబోయే సంవత్సరాల్లో హరిత నిర్మాణ ప్రాజెక్ట్‌లు, సాంకేతికతను వినియోగించే డేటా ఆధారిత స్మార్ట్‌ హోమ్స్‌.. స్థిరాస్తి రంగ రూపురేఖలను మార్చే వాటిలో అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తున్నారు.

  • ‘ఏ’ గ్రేడ్‌ కార్యాలయాల్లో 82 శాతం హరిత ప్రాజెక్ట్‌ల ధ్రువీకరణతో ఈ రంగం గణనీయ మార్పునకు నిదర్శనంగా నిలుస్తోంది.
  • పునరుత్పాదక ఇంధన వనరులు ప్రత్యేకించి సౌరశక్తి ఈ భవనాల్లో వినియోగించేలా చర్యలు చేపడుతున్నారు.
  • నీటి ఆదా, పునర్వినియోగం, వ్యర్థాల రీసైక్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు.
  • గ్రీన్‌ రేటింగ్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ హ్యాబిటాట్‌ అసెస్‌మెంట్‌(గృహ) డెవలపర్లను హరిత ప్రాజెక్ట్‌లు చేపట్టేలా పన్ను ప్రోత్సాహకాలు అందిస్తోంది.

సంయుక్త ప్రాజెక్టులతో మేలు..

  • దేశంలో సంయుక్త ప్రాజెక్ట్‌లతో వాటిలో పెట్టే ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా భారత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లోకి మూలధనం, నైపుణ్యం, సాంకేతికతను తీసుకొస్తుందని నివేదిక పేర్కొంది.
  • పట్టణ మౌలిక సదుపాయాలపై పెట్టుబడి 2011-12లో జీడీపీలో 0.7 నుంచి 2031-32 నాటికి 1.1 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.
  • ఇటీవల గణనీయమైన ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడులను ఈ రంగం ఆకర్షించింది.
  • 2047 నాటికి పెట్టుబడులు 59.7 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటాయని అంచనా.
  • సాంకేతిక వినియోగంతో.. స్థిరాస్తి రంగంలో ప్రాప్‌టెక్‌ అంకుర సంస్థల పెరుగుదలతో సాంకేతికంగా గణనీయమైన మార్పులు వచ్చాయి. కృత్రిమమేథ, బ్లాక్‌చైన్‌ ఆధారిత లావాదేవీలు, ఇతర వినూత్న పరిష్కారాలపై ఈ రంగం దృష్టి సారించింది. బెంగళూరు, హైదరాబాద్‌ ప్రాప్‌టెక్‌ ఆవిష్కరణలకు కేంద్రంగా మారాయి.
  • 2021 నుంచి 2023 మధ్య ప్రాప్‌టెక్‌ అంకుర సంస్థలు గణనీయంగా 2.4 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల పెట్టుబడులు పొందాయి.

రీట్స్‌ పెరుగుతున్నాయ్‌.. : రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌(రీట్స్‌) కార్యాలయ భవనాల నిర్మాణాల్లో పెట్టుబడులు పెరిగాయి. ‘రెరా, రీట్‌, జీఎస్‌టీ రాకతో రియల్‌ ఎస్టేట్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. 2030 నాటికి 1000 బిలియన్‌ యూఎస్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. మా రంగం ఆర్థిక వృద్ధికి ఆసరా అవుతుంది’ అని నరెడ్కో జాతీయ అధ్యక్షుడు జి.హరిబాబు అన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని