‘రియల్‌’ రన్‌.. ధనాధన్‌!

ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు సమీపిస్తున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్థిరాస్తి మార్కెట్‌పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు మాత్రం తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. రియల్‌ పరుగు కొనసాగుతోందని చెప్పడానికి టీఎస్‌బీపాస్‌కు వస్తున్న దరఖాస్తులే నిదర్శనం. 

Updated : 03 Feb 2024 07:39 IST

అదే స్థాయిలో అనుమతుల మంజూరు
బహుళ అంతస్తులు.. లేఅవుట్లకు దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు సమీపిస్తున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్థిరాస్తి మార్కెట్‌పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్నా హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు మాత్రం తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. రియల్‌ పరుగు కొనసాగుతోందని చెప్పడానికి టీఎస్‌బీపాస్‌కు వస్తున్న దరఖాస్తులే నిదర్శనం.మహానగరం విస్తరించి అవుటర్‌ దాటి కూడా కొత్త కొత్త ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. కోకాపేట్‌లో భారీ భవంతుల నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. అవుటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ సమీకృత పట్టణాల నిర్మాణానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఇవన్నీ స్థిరాస్తి రంగం వృద్ధికి శుభ సూచకమేని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో టీఎస్‌బీపాస్‌ ద్వారా బహుళ అంతస్తులు, లేఅవుట్ల నిర్మాణాలకు సంబంధించి 90 వేల పైచిలుకు దరఖాస్తులు రాగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి 66 వేలు దాటాయి. మరో మూడు నెలల గడువు ఉండటంతో మరో 10 నుంచి 20 వేల దరఖాస్తులు అదనంగా వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ స్థిరాస్తి రంగానికి ఢోకా లేదని మరోసారి స్పష్టమైందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వేయి చదరపు మీటర్లలో జీప్లస్‌ 5, 3 అంతస్తుల నిర్మాణాల వరకు పురపాలక సంస్థల నుంచి అనుమతులు ఇస్తాయి. బహుళ అంతస్తుల నిర్మాణాలకు, ఇక అన్ని రకాల లేఅవుట్లకు టీఎస్‌బీఎస్‌ ద్వారా హెచ్‌ఎండీఏకు దరఖాస్తు అనుమతులు మంజూరు చేస్తోంది. మొత్తం దరఖాస్తుల్లో అధిక శాతం హెచ్‌ఎండీఏ పరిధిలోనివే. ఇప్పటికే హెచ్‌ఎండీఏలోని ఏడు జిల్లాల్లో అనేక కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. భారీ వాణిజ్య సముదాయాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, మాల్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. వీటికి అనుసంధానంగా ఇతర ప్రాజెక్టులు రూపుదాల్చుతున్నాయి. హైదరాబాద్‌ చుట్టూ 158 కిలోమీటర్ల మేర అవుటర్‌ రింగ్‌ రోడ్డు విస్తరించి ఉండటం నగర రియల్‌ మార్కెట్‌ విస్తరణకు దోహదం చేస్తోంది. నగరానికి ఎటువైపు నివాస సముదాయాలు ఉన్నా.. అక్కడ నుంచి ఏ దిశగా వెళ్లాలన్నా ఓఆర్‌ఆర్‌ గొప్ప అవకాశంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో చాలా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు అవుటర్‌ రింగ్‌రోడ్డుకు 5-10 కిలోమీటర్ల పరిధిలో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాయి.

ప్రశాంత వాతావరణంలో...

ప్రధాన నగరంలో రోజురోజుకు ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతోంది. ఉపాధి, ఉద్యోగాలు, చదువుల కోసం నగరానికి రాకపోకలు సాగించాల్సి ఉన్నా సాయంత్రం అయితే  రణగొణ ధ్వనులకు దూరంగా ప్రశాంత వాతావరణంలో నివసించాలని చాలామంది కోరుకుంటున్నారు. వాయు కాలుష్యాన్ని తప్పించుకోవడానికి ఇదో మార్గంగా భావిస్తున్నారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఇప్పటికే పలు సంస్థలు ప్రత్యేక గేటెడ్‌ కమ్యూనిటీలను తీర్చిదిద్దుతున్నాయి. ఇలా నగరానికి అన్ని వైపులా రియల్‌ అభివృద్ధికి మార్గం సుగమం అవుతోంది. రోడ్లుతోపాటు ఇతర మౌలిక వసతులకు కూడా పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నారు. త్వరలో అవుటర్‌ చుట్టూ భారీ రింగ్‌మెయిన్‌ రానుండటంతో ఎటు వైపు నుంచైనా....నీటి సరఫరాకు భవిష్యత్తులో అవకాశం ఉంది. తదనుగుణంగా కూడా ఇప్పటి నుంచే ఆయా ప్రాంతాల్లో కొన్ని సంస్థలు ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్నాయి. ప్రధాన నగరంలో స్థలం విలువ భారీగా పెరగడంతో దీర్ఘకాలిక పెట్టుబడి దృష్ట్యా  మధ్యతరగతి వర్గాలు శివార్లలో అన్ని రకాల అనుమతులు ఉన్న వెంచర్లను కొనుగోలు చేస్తున్నారు. పిల్లలు బడిలో చేరినప్పడే శివార్లలో ఓ చిన్న స్థలం కొని...దానిని వారి ఉన్నత చదువుల కోసం పెట్టుబడి కింద వాడుకునే కుటుంబాలు ఎన్నో. ఈ పరిస్థితులన్నీ హైదరాబాద్‌ రియల్‌ రంగంపై సానుకూలతను చూపుతున్నాయి. మున్ముందు ఇదే ఒరవడి కొనసాగనుందని మార్కెట్‌ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు