ఉత్తరానికి ఊపు వచ్చేనా?

సిటీలో మధ్యతరగతి వర్గాలు కొనగలిగే స్థాయిలో గృహ నిర్మాణం ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ఉత్తర హైదరాబాద్‌ ఒకటి. అల్వాల్‌, బొల్లారం, తూంకుంట, శామీర్‌పేట దాకా.. బాలానగర్‌, చింతల్‌, కుత్బల్లాపూర్‌, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ, మేడ్చల్‌ వరకు.. మరోవైపు గండిమైసమ్మ, గుడ్లపోచంపల్లి, బహుదూర్‌పల్లి, దుండిగల్‌, ఓఆర్‌ఆర్‌ దాకా బహుళ అంతస్తుల నివాసాలు, విల్లా ప్రాజెక్ట్‌లు ఎన్నో ఉన్నాయి.

Updated : 16 Mar 2024 09:21 IST

ఇక్కడ అందుబాటులో బడ్జెట్‌ హోమ్స్‌.. మున్ముందు డిమాండ్‌ పెరుగుతుందనే ఆశాభావం  
ఎలివేటెడ్‌ కారిడార్‌ శంకుస్థాపనతో మెరుగు కానున్న రవాణా అనుసంధానం

ఈనాడు, హైదరాబాద్‌: సిటీలో మధ్యతరగతి వర్గాలు కొనగలిగే స్థాయిలో గృహ నిర్మాణం ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ఉత్తర హైదరాబాద్‌ ఒకటి. అల్వాల్‌, బొల్లారం, తూంకుంట, శామీర్‌పేట దాకా.. బాలానగర్‌, చింతల్‌, కుత్బల్లాపూర్‌, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ, మేడ్చల్‌ వరకు.. మరోవైపు గండిమైసమ్మ, గుడ్లపోచంపల్లి, బహుదూర్‌పల్లి, దుండిగల్‌, ఓఆర్‌ఆర్‌ దాకా బహుళ అంతస్తుల నివాసాలు, విల్లా ప్రాజెక్ట్‌లు ఎన్నో ఉన్నాయి. చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదకర పరిసరాలు.. ఇటీవల పెరిగిన సోషల్‌ ఇన్‌ఫ్రాతో ఈ ప్రాంతం నివాసాలకు అనుకూలంగా ఉంది. అయితే నగరంలోకి వచ్చేందుకు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఇరుకు దారులతో ట్రాఫిక్‌ సమస్య పెద్ద సవాల్‌గా ఉంది. దీనికి పరిష్కారంగా ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలకు సర్కారు శ్రీకారం చుట్టింది. మొదటగా ప్యారడైజ్‌ కూడలి నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ వరకు 18.1 కి.మీ. ఎక్స్‌ప్రెస్‌వే పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. వెస్ట్‌ మారేడుపల్లి, కార్ఖాన, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్‌, హకీంపేట, తూంకుంట ప్రాంతాల మీదుగా వెళుతుంది. ఓఆర్‌ఆర్‌ దగ్గర ఈ ఫ్లైఓవర్‌ ఎక్కితే అరగంటలో సిటీలో ఉంటారు. సహజంగా ఓఆర్‌ఆర్‌ చుట్టుపక్కల నివాసాలకు డిమాండ్‌ పెరుగుతుంది. ఉత్తరాన రియల్‌ ఎస్టేట్‌కు ఊపు వస్తుందనే ఆశాభావంలో రియల్టర్లు ఉన్నారు.

  • సొంతింటి కోసం నగరవాసులు శివార్ల వైపే చూస్తున్నారు. అక్కడైతేనే ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయి. ఉత్తర హైదరాబాద్‌ ప్రాంతం మేడ్చల్‌ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చదరపు అడుగు సగటు రూ.3,449గా ఉంది. సౌకర్యాలున్న గేటెడ్‌ కమ్యూనిటీల్లో చదరపు అడుగు ఐదారువేలల్లో చెబుతున్నారు. ఐటీ కారిడార్‌లో చదరపు అడుగు రూ.7-8వేల మధ్య నడుస్తోంది. ప్రధాన నగరంలోనూ ఇదే పరిస్థితి. ఇప్పుడిప్పుడే గృహ నిర్మాణాలు వస్తున్న దక్షిణ హైదరాబాద్‌లోనూ చ.అ. ఆరేడువేలు చెబుతున్నారు. వీటన్నింటితో పోలిస్తే ఉత్తరంలోనే ధరలు అందుకోగలిగే స్థాయిలో ఉన్నాయి.

మౌలిక వసతుల కల్పనతో..

కండ్లకోయలో ఐటీ పార్క్‌కు గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. పనుల పురోగతి లేకున్నా భవిష్యత్తులో ఆచరణలోకి వస్తుందనే ధీమాలో స్థానికులు ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఎలివేటెడ్‌ కారిడార్‌కు శంకుస్థాపన చేసింది. పనులు చకచకా జరిగితే 3ఏళ్లలో అందుబాటులోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలోని జాతీయ రహదారులపై ఫ్లైఓవర్లు నిర్మాణంలో ఉన్నాయి. ఐటీ కారిడార్‌ నుంచి ఉత్తరంలోని ఓఆర్‌ఆర్‌కు సులువుగా చేరుకునేందుకు బాచుపల్లి నుంచి బౌరంపేట వరకు ఫ్లైఓవర్‌ నిర్మించారు. ఓఆర్‌ఆర్‌ మల్లంపేట వద్ద కొత్తగా ఎగ్జిట్‌ ఇచ్చారు. ఫ్లైఓవర్లు, రహదారి విస్తరణ, ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌, ఎలివేటెడ్‌ కారిడార్లతో రవాణా సదుపాయాలు మెరుగవుతున్నాయి.

సోషల్‌ ఇన్‌ఫ్రా అందుబాటులో..

ఈ ప్రాంత వాసులు తమకు కావాల్సిన విద్య, వైద్యం, వినోదం కోసం ఇదివరకు నగరంలోకి రావాల్సిందే. ఇప్పుడు ఈ ప్రాంతం చుట్టుపక్కలనే పేరున్న పాఠశాలు, మాల్స్‌, వస్త్ర దుకాణాలు, కన్వెన్షన్‌ కేంద్రాలు, రిసార్ట్‌లు, గేమింగ్‌ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో జీనోమ్‌ వ్యాలీ 2తో మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంతంలో రానున్నాయి. వీటన్నింటికి మించి పచ్చదనం కోరుకునేవారికి ఈ ప్రాంతం అనువుగా ఉంది. వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌, దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, సీఐఎస్‌ఎఫ్‌ అకాడమీ, ఫారెస్ట్‌ అకాడమీ వంటి కేంద్రాలు పచ్చదనంతో నిండి ఉన్నాయి. ఇవి కాకుండా హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్‌లు అభివృద్ధి చేశారు.

విక్రయాలు  పెరుగుతున్నాయ్‌..

ఈ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా క్రయ విక్రయాలు పెరుగుతూ వస్తున్నాయి. సిటీలోని మొత్తం రిజిస్ట్రేషన్లలో ఈ ప్రాంతం వాటా గత ఫిబ్రవరి నుంచి ఈ ఫిబ్రవరి వరకు 39 శాతం నుంచి 43 శాతానికి పెరిగింది. రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందనే అంచనాల్లో పరిశ్రమ వర్గాలు ఉన్నాయి. ఇక్కడ సైతం ఆకాశహార్మ్యాల ప్రాజెక్ట్‌లు మొదలయ్యాయి. రిటైర్మెంట్‌ హోమ్స్‌, భిన్న థీమ్‌లతో విల్లాలు వస్తున్నాయి. ఓపెన్‌ ప్లాట్‌లు సైతం అందుబాటులో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని