ఎంఎంటీఎస్‌ పరుగులు.. ‘రియల్‌’ చూపులు

మౌలిక వసతులు ఉన్న చోట నివాస ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి. సిటీలో ఇల్లు, స్థలాలు కొనుగోలు చేసేవారు ప్రధానంగా చూసేవాటిలో రవాణా వ్యవస్థ ముఖ్యమైనది. రహదారులు, మెట్రో, రైల్వే.. ఇలా ఏ కొత్త నెట్‌వర్క్‌ వచ్చిన ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రవాణా సదుపాయం మెరుగవుతుంది.

Published : 06 Apr 2024 02:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: మౌలిక వసతులు ఉన్న చోట నివాస ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి. సిటీలో ఇల్లు, స్థలాలు కొనుగోలు చేసేవారు ప్రధానంగా చూసేవాటిలో రవాణా వ్యవస్థ ముఖ్యమైనది. రహదారులు, మెట్రో, రైల్వే.. ఇలా ఏ కొత్త నెట్‌వర్క్‌ వచ్చిన ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రవాణా సదుపాయం మెరుగవుతుంది. ఎంఎంటీఎస్‌ విస్తరణతోనూ ఆయా మార్గాలపై ‘రియల్‌’ వృద్ధికి అవకాశం ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మేడ్చల్‌, ఘట్‌కేసర్‌ వైపు..: రహదారి మార్గాలే కాదు.. రైలు మార్గాలు కూడా నివాస ప్రాంతాల విస్తరణకు అవకాశాలిస్తున్నాయి. ఎంఎంటీఎస్‌ పరుగులతో మేడ్చెల్‌, ఘట్‌కేసర్‌ వైపు నివాస ప్రాంతాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్‌ రైళ్లు పరిమితంగా పరుగులు పెట్టినా.. భవిష్యత్తులో ప్రాధాన్యం పెరుగుతుందనే భరోసాతో ప్రజారవాణా సౌకర్యాలున్న ప్రాంతాలవైపు కొనుగోలు చూస్తున్నారు.

ఆగిపోయిన ప్రాజెక్టులు కూడా.. : ఘట్‌కేసర్‌ వైపు సిటీ ఇప్పటికే విస్తరించింది. ఇప్పుడు ఘట్‌కేసర్‌ వరకూ ఎంఎంటీఎస్‌ అందుబాటులోకి రావడంతో పాటు.. చర్లపల్లి రైల్వేస్టేషన్‌ కూడా సిద్ధమవుతోంది. దీంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు మరింత డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీటి రాకతో మార్కెట్లో కదలిక రావడంతో పాత వెంచర్లు ఇప్పుడు మళ్లీ హంగులు దిద్దుకుంటున్నాయి. ఈ పోకడ యాదాద్రి వరకూ కొనసాగుతోందని భావిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో ఈ మార్గంలో భక్తుల రద్దీ పెరిగింది. రహదారి విస్తరణతో బీబీనగర్‌ కాస్త దగ్గరైందనే భావన. రోజువారీ విద్యార్థులు, ఉద్యోగుల రాకపోకలు పెరిగాయి.

  • సిటీకి మరోవైపు చూస్తే ఫలక్‌నుమా, శివరాంపల్లి వరకే పరిమితమైన నివాస ప్రాంతాలు ఉందానగర్‌ వైపు బాగా విస్తరణ జరుగుతోంది.

తెల్లాపూర్‌ వైపు.. : చందానగర్‌ వరకే పరిమితమైన ఎంఎంటీఎస్‌ రైళ్లు తెల్లాపూర్‌కు వెళ్తున్నాయి. ఔటర్‌ రింగురోడ్డుకు చేరువలో ఉండడంతో పటాన్‌చెరు, కొల్లూరు, భానూరు ఇలా చాలా నివాస ప్రాంతాలకు తెల్లాపూర్‌ చేరువైంది. ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున నివాసాలు వచ్చాయి. గచ్చిబౌలి చుట్టుపక్కల అధిక ధరల కారణంగా ఎక్కువ మంది తెల్లాపూర్‌ చుట్టుపక్కల ప్రాంతాల వరకు వెళ్లి నివాసాలు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు, విల్లా ప్రాజెక్ట్‌లు చేపట్టారు.

  • తర్వాత దశలో నాగులపల్లి, శంకర్‌పల్లి వరకు ఎంఎంటీఎస్‌ విస్తరణ ప్రణాళికలు ఉండడంతో అటువైపు కూడా నివాస ప్రాంతాల విస్తరణకు అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి భవిష్యత్తు అవసరాల కోసం స్థలాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వీకెండ్‌ హోమ్స్‌ నిర్మించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని