బంగారం కంటే వేగంగా భూముల ధరల్లో పెరుగుదల

భవిష్యత్తును అంచనా వేసి నిర్ణయం తీసుకునే వారు విజయానికి మార్గదర్శకులుగా నిలుస్తారు.

Published : 13 Apr 2024 01:40 IST

కె. అశోక్‌కుమార్‌, సినీ నటుడు, నిర్మాత

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: భవిష్యత్తును అంచనా వేసి నిర్ణయం తీసుకునే వారు విజయానికి మార్గదర్శకులుగా నిలుస్తారు. జంట నగరాల అభివృద్ధిని దశాబ్దాల క్రితం అంచనా వేసి భూములు కొన్నవారు.. నేడు కోటీశ్వరులయ్యారు. ఇప్పటికీ ఇక్కడ భూమి విలువ ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. దశాబ్దాల క్రితం కేవలం వందల్లో ఉండే చదరపు గజం ధర, నేడు రూ.వేలకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో రూ.లక్షలు పలుకుతోంది. జంటనగరాల్లో పశ్చిమ నైరుతి ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటున్నాయి. కనీసం ఇతర ప్రాంతాల్లో సైతం  వంద గజాల్లో ఇల్లు నిర్మించుకుందామంటే రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. అయినప్పటికీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తోడ్పాటు అందిస్తుండటంతో నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందామనుకున్న వారు ఖర్చుకు వెనుకడుగు వేయకుండా సొంత ఇంటి కలను నిజం చేసుకుంటున్నారు. ఖర్చుకు వెనుకడుగు వేయకుండా సొంత ఇంటి కలను నిజం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినీ నటుడు, నిర్మాత కె.అశోక్‌కుమార్‌ తాను నగరంలో ఇల్లు కొనుగోలుకు చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారో ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

అప్పట్లో గజం రూ.200 మాత్రమే

మాది ఏపీలోని ప్రకాశం జిల్లా కారంచేడు. విద్యాభ్యాసం అప్పటి మద్రాస్‌లో సాగింది. ముగ్గురు అబ్బాయిలు. 1987లో సినీ షూటింగ్‌ల కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లేవాడిని. అప్పట్లో ఇక్కడ సినీ పరిశ్రమ నిలదొక్కుకుంటున్న రోజులు. ఆ సమయంలో చదరపు గజం రూ.200 మాత్రమే. ఫిల్మ్‌నగర్‌లో 2వేల గజాలు అమ్మకానికి ఉండగా తక్కువ ధరకే నిర్మాత రామానాయుడు  తీసుకోవాలని చెప్పినా పట్టించుకోలేదు. అద్దె ఇళ్లు మారడంలో ఉన్న సమస్యలను అధిగమించేందుకు ఎలాగైనా సొంతిల్లు కొనాలని నిర్ణయించుకున్నా. చివరికి 2000 సంవత్సరంలో ఫిల్‌్్మనగర్‌లో రూ.25లక్షలకు కొనుగోలు చేశా. దాని విలువ ఇప్పుడు చాలా పెరిగింది. బంగారం కంటే వేగంగా నగరంలో భూముల ధరలు పెరుగుతున్నాయి. అందుకే చిత్రపురికాలనీలోనూ ఓ ఇంటిని తీసుకున్నా. ధరలు అందుబాటులో లేవని చింతించేకన్నా అందుబాటు ధర ఉన్న ప్రాంతంలో భూమి కొనుగోలు చేసే ఆలోచన ఒక విధంగా ముందు చూపే. నా ప్రస్తుత ప్రశాంత జీవనానికి కారణం భూములు, ఇళ్లపై పెట్టుబడి పెట్టాలని రెండు దశాబ్దాల క్రితం తీసుకున్న నిర్ణయమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని