ఇళ్ల నిర్మాణంలో డేటానే కీలకం

నిర్మాణరంగం కూడా సాంకేతికతను ఆధారం చేసుకొని అప్‌డేట్‌తో దూసుకుపోతోంది. అందులో భాగంగా ఇకపై కూలీలు ఏం పనిచేయాలో వర్క్‌ షెడ్యూల్‌ను వాట్సప్‌లో, యాప్‌లో చూసి పనిచేయండని చెపుతున్నారు

Updated : 11 Mar 2023 07:04 IST

 ఇకపై కూలీలకు వాట్సప్‌లో పని షెడ్యూల్‌ 

 సునాయాసంగా స్మార్ట్‌గా భవనాలు కట్టుకోవచ్చు
 సాంకేతికతతో పని విధానంలో మార్పులు

 మానవ జోక్యం లేకుండానే బిల్లుల చెల్లింపు

ఈనాడు, హైదరాబాద్‌: నిర్మాణరంగం కూడా సాంకేతికతను ఆధారం చేసుకొని అప్‌డేట్‌తో దూసుకుపోతోంది. అందులో భాగంగా ఇకపై కూలీలు ఏం పనిచేయాలో వర్క్‌ షెడ్యూల్‌ను వాట్సప్‌లో, యాప్‌లో చూసి పనిచేయండని చెపుతున్నారు. నగరంలోని ఒక నిర్మాణ సంస్థ ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. పని ప్రదేశంలో అంతరాయాల్లేని అంతర్జాలం 4జీ, 5జీ సేవలను ఏర్పాటు చేసి కూలీల నుంచి పనిని స్మార్ట్‌గా తీసుకోవాలని కసరత్తు చేస్తోంది. ఒక్క కూలీల పనినే కాదు నిర్మాణాలకు సంబంధించి ప్రతి పనినీ డిజిటలైజ్‌ చేసి స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా నిర్వహిస్తోంది. భవిష్యత్తులో రోబోలే ఇళ్లు కట్టే రోజులు రావొచ్చని అంటోంది.

ఇల్లు కట్టాలంటే అనుమతుల దశ నుంచి పునాదులు.. బేస్‌మెంట్‌.. స్తంభాలు, శ్లాబ్‌, గోడలు, కిటికీలు, తలుపులు, కరెంట్‌ వైరింగ్‌.. ఇంటీరియర్‌ వరకు జాబితా చాలా పెద్దదిగానే ఉంటుంది. ఈ పనులన్నీ ఎన్ని ఉంటాయో ఎప్పుడైనా లెక్కపెట్టారా? ఒక యాభై వంద వరకు ఉండొచ్చు అంటారా? ఆకాశహర్మ్యాల నిర్మాణంలో చిన్న పెద్ద పనులు కలిపి 1100 వరకు ఉన్నాయట. కొన్ని మినహా పనులన్నీ నైపుణ్యం కల్గిన కూలీలే చేస్తుంటారు. ఒక పని పూర్తి కాగానే స్మార్ట్‌ఫోన్‌ నుంచి ఫొటో తీసి  అప్‌లోడ్‌ చేస్తే.. తదుపరి పని చేసే కూలీలకు ఆ సమాచారం వెళుతుంది. అప్పుడు వారు వచ్చి తదుపరి పనిచేస్తారు. దీంతో పని ప్రదేశానికి కూలీలు వచ్చి పని లేకుండా వృథాగా ఉండాల్సిన తిప్పలు తప్పుతాయి. ఫలితంగా ప్రాజెక్ట్‌ మొత్తంలో 25 శాతం సమయం ఆదా అవుతుందని నిర్మాణదారులు చెబుతున్నారు.

అటానమస్‌...  నిర్మాణ పనులకు సంబంధించి సాధారణంగా కూలీలతో గుత్తేదారు పనిచేయిస్తారు. ఇంజినీర్‌ పరిశీలించి, నాణ్యత విభాగం ధ్రువీకరించి.. ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఆమోదిస్తే..పనికి సంబంధించిన బిల్లులు మంజూరవుతుంటాయి. నాలుగైదు టేబుళ్లు మారి వచ్చే వరకు చాలా సమయం పడుతుంది. బిల్లుల చెల్లింపుల్లో మానవ జోక్యం లేకుండా అటానమస్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు. పూర్తైన పనులకు సంబంధించి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే.. ప్రతినెలా 1, 15వ తేదీకి ఆటోమెటిక్‌గా బిల్లులు జారీ అయ్యే వ్యవస్థలను మన నిర్మాణ రంగ సంస్థలు ఏర్పాటు చేసుకున్నాయి. ఈరకంగా రూ.400 కోట్ల రూపాయల బిల్లులు అటానమస్‌గా చెల్లించిన సంస్థలు ఉన్నాయి.

డ్రోన్ల ద్వారా..  నిర్మాణ పనుల్లో సెల్లార్ల తవ్వకం పెద్ద పని. వీటికే ఆరునెలల నుంచి ఏడాది సమయం పడుతున్న దాఖలాలు ఉన్నాయి. ఈ పనులు ఏ దశల్లో ఉన్నాయో తెలుసుకునేందుకు అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలు డ్రోన్ల సాంకేతికతను వాడుతున్నాయి. ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌లో డ్రోన్‌ ద్వారా తీసిన చిత్రాలను అప్‌లోడ్‌ చేయడం ద్వారా పనిని కచ్చితంగా అంచనా వేస్తోంది. ఇప్పటివరకు ఎంత పని అయ్యింది? ఎంత మిగిలి ఉందానేది గణాంకాలతో బిల్డర్ల మొబైల్‌లోనే చూస్తున్నారు. ఆ మేరకు తమ ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.

టెకీలకు ప్రాధాన్యం..  వేగంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకోగల యువకులకు ఈతరం కంపెనీలు ఎక్కువగా అవకాశం కల్పిస్తున్నాయి. కూలీలైనా, ఇంజినీర్లు అయినా టెక్నాలజీని వినియోగించేవారికి పెద్దపీట వేస్తున్నాయి. ఇందుకోసం కళాశాలకు వెళ్లి ప్రాంగణ నియామకాలు చేపడుతున్నాయి. పని ప్రదేశం నుంచే పురోగతిని మొబైల్స్‌, పాడ్స్‌ నుంచి అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ వేగాన్ని తట్టుకోలేక పాతతరం ఇంజినీర్లు పక్కకు తప్పుకొంటున్నారు.

రోబోలు కట్టే రోజులు వచ్చినా.. - అజితేష్‌, సీఈవో, ఏఎస్‌బీవో

ఇంటి నిర్మాణంలో ఒక దగ్గర ఆలస్యమైతే ప్రాజెక్ట్‌ వెనకబడిపోతుంది.. అయితే సైట్‌లో పనుల పురోగతికి సంబంధించి అక్కడ పనిచేసేవారు చెప్పే మాటలే తప్ప.. డాటా రూపంలో సమాచారం అందుబాటులో ఉండదు. పని పూర్తయ్యిందని చెప్పిన మాటలను నమ్మి పని ప్రదేశానికి వెళితే ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉంటాయి. డాటా అందుబాటులో ఉంటే ఎవరిపైన ఆధారపడక్కర్లేదు. దీనిపై కొన్నేళ్లు శ్రమించి ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ‘ఇన్‌సర్కిల్స్‌ ఎరినా’ని అభివృద్ధి చేశాం. ఏ పని ఏ దశలో ఉందో కార్యాలయంలో కూర్చునే చూడొచ్చు. వర్చువల్‌గా ఆపరేషనల్‌ మేనేజ్‌మెంట్‌కు ఇది దోహదం చేస్తుంది. మా ప్రాజెక్టుల్లో ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతం చాలా పనులు రోబోలే చేస్తున్నాయి. భవిష్యత్తులో రోబోలే ఇల్లు కట్టే రోజులు వచ్చినా ఈ డాటా ఉంటే చాలు. సాంకేతికత ఇలాంటి చాలా మార్పులను నిర్మాణరంగంలో వేగం, నాణ్యతను పెంచుతోంది. మా సైట్‌లో కూలీలు వచ్చాక మేస్త్రీ వెళ్లి వారికి పనిచూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో వారికి స్మార్ట్‌ఫోన్‌లోనే పని షెడ్యూల్‌ను పంపనున్నాం. ఇప్పుడు అందరి కూలీల దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. టెక్నాలజీ రూపంలో వచ్చిన అవకాశం ఇది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని