భరోసా పెరిగింది.. భర్తీ అవుతున్నాయ్‌

గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్స్‌ (జీసీసీ)కు హైదరాబాద్‌  కేంద్రంగా మారింది. వారానికి ఒక కేంద్రం తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. కొత్త కంపెనీల ఏర్పాటులో ఈ ఏడాది మొదటిభాగంలో బెంగళూరు నగరాన్ని హైదరాబాద్‌ అధిగమించింది.

Published : 23 Sep 2023 00:52 IST

‘జీసీసీ’లతో కార్యాలయాల లీజింగ్‌కు డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌ : గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్స్‌ (జీసీసీ)కు హైదరాబాద్‌  కేంద్రంగా మారింది. వారానికి ఒక కేంద్రం తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. కొత్త కంపెనీల ఏర్పాటులో ఈ ఏడాది మొదటిభాగంలో బెంగళూరు నగరాన్ని హైదరాబాద్‌ అధిగమించింది. అత్యధిక గ్లోబల్‌ కంపెనీల యాక్సిలరేషన్‌ సెంటర్లు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, సెంటర్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌, ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో బెంగళూరులో 13 గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్స్‌ ఏర్పాటైతే మన దగ్గర 23 వచ్చాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా కార్యాలయాల లీజింగ్‌లో ప్రథమార్థంలో విశాలమైన ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరిగింది. మొత్తం లీజింగ్‌లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం పైనఉన్న కార్యాలయాలే సగం దాకా ఉన్నాయి.

నగరంలో కార్యాలయాల భవనాలు పెద్ద ఎత్తున ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల నిర్మాణంలో ఉన్నాయి. గరిష్ఠంగా 55 అంతస్తుల వరకు ఈ భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని లీజ్‌కు ఇచ్చేందుకు పలు భవనాలు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో భవనంలో ఆరేడు అంతస్తుల వరకు ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ క్రమంగా భర్తీ అవుతున్నాయి. గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్స్‌ రాకతో కార్యాలయాల లీజింగ్‌లో సానుకూలత పెరిగింది. వీటి కోసం ఆయా గ్లోబల్‌ సంస్థలు ప్రమాణాల మేరకు నిర్మించిన 50 వేల నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కల్గిన కార్యాలయాలను లీజింగ్‌కు తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో ఇది స్పష్టంగా కన్పించింది.  

లావాదేవీలు చూస్తే..

  • లక్ష అంతకంటే ఎక్కువ చ.అ.విస్తీర్ణం కల్గిన పెద్ద కార్యాలయాల లీజింగ్‌ 2023 ప్రథమార్థంలో 1.47 మిలియన్‌ చ.అ.గా ఉంది. మొత్తం విస్తీర్ణంలో ఇది 50 శాతం కంటే ఎక్కువ అని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది.  
  • మధ్యస్థ కార్యాలయాలు అంటే 50 వేలు-లక్ష లోపు చ.అ. విస్తీర్ణం కల్గినదిగా భావిస్తుంటారు. ఈ విభాగంలోనూ 15 శాతం లావాదేవీలు నమోదయ్యాయి. 0.43 మిలియన్‌ చ.అ. విస్తీర్ణాన్ని కంపెనీలు లీజింగ్‌కు తీసుకున్నాయి.
  • 50వేల లోపు చిన్న కార్యాలయాల్లో లీజింగ్‌ లావాదేవీలు 1.04 మిలియన్‌ చ.అ. నమోదయ్యాయి. దాదాపుగా ఇది 35 శాతంగా ఉంది.  

హైదరాబాదే ఎందుకు?

  • మెరుగైన మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండటం
  • సులభతర వ్యాపార విధానాలు
  • మానవ వనరుల లభ్యత.. అన్ని ప్రాంతాల వారిని ఆదరించే తత్వం
  • కార్యాలయాల అద్దెలు అందుబాటులో ఉండటం
  • భౌగోళికంగా అనువైన ప్రదేశం కావడం. సౌకర్యవంతమైన వాతావరణ పరిస్థితులు
  • భవిష్యత్తులో నగరం మరింత విస్తరించేందుకు అవకాశం ఉండటం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని