Hyderabad: ఇక్కడా ఉంటాం.. అక్కడా కొంటాం

కాలం వేగంగా పరుగు తీస్తోంది. సొంతిల్లు ఎలా ఉండాలనే విషయంలో.. వ్యక్తుల అభిరుచులు రెక్కలు తొడుగుతున్నాయి. ఒకప్పుడు నగరంలో ఒక ఇల్లు ఉంటే చాలనుకునేవారు..

Updated : 28 Oct 2023 09:52 IST

పనిదినాల్లో మాత్రమే నగరంలో గడుపుతాం
శని, ఆదివారాలకు వీకెండ్‌ హోమ్‌ కావాల్సిందే
ఎకరా, అరఎకరా గృహాలకు పెరుగుతున్న డిమాండ్‌
ఈనాడు, హైదరాబాద్‌

కాలం వేగంగా పరుగు తీస్తోంది. సొంతిల్లు ఎలా ఉండాలనే విషయంలో.. వ్యక్తుల అభిరుచులు రెక్కలు తొడుగుతున్నాయి. ఒకప్పుడు నగరంలో ఒక ఇల్లు ఉంటే చాలనుకునేవారు.. నేడు నగరంలో ఒక ఇల్లు, నగరం బయట మరో ఇల్లు అంటున్నారు. కొందరు.. సాధ్యమైనంతలో 200 నుంచి 1000 గజాల్లోపు భూమిని కొని సాదాసీదాగా ఇంటిని నిర్మించుకుంటుంటే.. మరికొందరు వెయ్యి నుంచి 4వేల గజాలు, రెండెకరాలు, మూడెకరాలంటూ భూమి కొనేసి వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో.. ఈ రెండింటికీ మధ్య మరో కొత్త పోకడ చిగురించింది. ‘వారాంతపు ఇల్లు’ అనే కాన్సెప్ట్‌తో ఇంటి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఇంటి స్థలాలను కొంటున్నారు. ఫామ్‌ల్యాండ్స్‌ పేరుతో కొన్న జాగాల్లో, డీటీసీపీ లేఅవుట్లలో, గ్రామ పంచాయతీ లేఅవుట్లలో స్థలాలను కొనుగోలు చేసి బంగ్లాలు కడుతున్నారు. శని, ఆదివారాల్లో కుటుంబమంతా కారులో వారాంతపు ఇంటికివెళ్లి షికారు చేస్తున్నారు. విదేశాల నుంచి నగరానికి వచ్చి స్థిరపడుతున్న కుటుంబాలు, వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, ఇతరత్రా వర్గాలు.. కొత్త తరహా ఆలోచనతో అభిరుచులకు తగ్గట్లుగా వీకెండ్‌ హోమ్స్‌కు ప్రాముఖ్యత ఇస్తున్నాయని, చాలామంది హెచ్‌ఎండీఏ(హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ), డీటీసీపీ(డిస్ట్రిక్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌)లను అనుమతుల కోసం సంప్రదిస్తున్నారని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఓఆర్‌ఆర్‌  వెలుపలే..

హైదరాబాద్‌ నగరం ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరించింది. శంషాబాద్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, మేడ్చల్‌, సంగారెడ్డి ప్రాంతాల వైపు నగరం ఓఆర్‌ఆర్‌ను దాటుకొని వెళ్లింది. ఇళ్ల స్థలాల ధరలు దాదాపు ప్రధాన నగరంలో మాదిరి ఉన్నాయి. ఓఆర్‌ఆర్‌ నుంచి గంట ప్రయాణం, ఇంటి నుంచి వంద కిలోమీటర్లంటూ నగరవాసులు తమ వీకెండ్‌ హోమ్‌కు గమ్యాన్ని ఎంచుకుంటున్నారు. 

  • భూముల ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ.. వాతావరణం బాగుంటుందని, భవిష్యత్తులో ఆస్తిని విక్రయిస్తే మంచి ధర పలుకుతుందనే విశ్వాసంతో వికారాబాద్‌, శంకర్‌పల్లి, జహీరాబాద్‌ వైపు చాలామంది స్థలాలను కొని ఇల్లు కట్టుకుంటున్నారు.
  • యాదాద్రి, శ్రీశైలం వెళ్లే రోడ్డు పొడవునా, ఇరువైపులా ఉన్న గ్రామాల్లో, 111జీవో పరిధిలోని గ్రామాల్లో, ఇబ్రహీంపట్నం రోడ్డులో, రాచకొండ గుట్టల వైపు, చౌటుప్పల్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో, శంషాబాద్‌ విమానాశ్రయం చుట్టుపక్కల, మేడ్చల్‌ నుంచి చేగుంట మధ్య, తదితర ప్రాంతాల్లో ఈ గృహాలు వస్తున్నాయి.
  • ఇంటితోపాటు చుట్టూ పచ్చదనం, ఆకుకూరలు, పండ్ల చెట్లను పెంచుతూ.. వ్యవసాయం చేశామనే తృప్తిని పొందేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు.

అనుమతుల కోసం.. : వారాంతపు ఇంటి స్వప్నాన్ని సాకారం చేసుకునే క్రమంలో.. ఎలాంటి అవరోధం ఉండకూదన్న ఉద్దేశంతో.. చాలామంది నిర్మాణ అనుమతుల కోసం హెచ్‌ఎండీఏ, డీటీసీపీ కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారు. చిన్న స్థలాల్లో కట్టే ఇళ్లకు స్థానిక గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు అనుమతి ఇస్తాయి. భూ విస్తీర్ణం వెయ్యి చదరపు మీటర్లకు మించితే డీటీసీపీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వెంచర్లు సైతం.. : వారాంతపు ఇళ్లను వ్యక్తిగతంగా కొందరు నిర్మించుకుంటుంటే.. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు వేసిన వెంచర్లలో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. వారాంతాల్లో విడిది చేసేలా సకల సదుపాయాలు ఇక్కడ కల్పిస్తున్నారు. కొందరు తమ ఇళ్లను మిగతా సమయంలో కమ్యూనిటీ నిర్వహణ సంస్థలకే అద్దెకిస్తున్నారు. కమ్యూనిటీల్లోని సభ్యులు చిన్న వేడుకలను ఇక్కడ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఇతర ఇళ్లను ఒకటి రెండు రోజులకు అద్దెకు తీసుకుంటున్నారు. ఈ రకంగా ఖాళీగా ఉండకుండా ఆదాయం వస్తుండటంతో వీటివైపు మొగ్గు పెరుగుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని