2024 గృహ నిర్మాణ ధోరణులు

స్థిరాస్తి రంగంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలను కొనుగోలుదారులు ఆదరిస్తుంటారు. నిర్మాణాల దగ్గర్నుంచి ఇంటీరియర్స్‌ వరకు ఏటా వీటిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇలాంటి ఎన్నో వాటికి హైదరాబాద్‌ మార్కెట్‌ 2023 వేదికైంది. 2024లోనూ ఇవే కొనసాగుతాయా? అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. ఇల్లు కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది గేటెడ్‌ కమ్యూనిటీలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. పిల్లలు, ఇంట్లో పెద్దలందరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ కమ్యూనిటీలోనే అందుబాటులో ఉంటాయనే ఉద్దేశంతో వీటికి మొగ్గు చూపుతున్నారు.

Updated : 06 Jan 2024 09:18 IST

ఈనాడు, హైదరాబాద్‌

స్థిరాస్తి రంగంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలను కొనుగోలుదారులు ఆదరిస్తుంటారు. నిర్మాణాల దగ్గర్నుంచి ఇంటీరియర్స్‌ వరకు ఏటా వీటిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇలాంటి ఎన్నో వాటికి హైదరాబాద్‌ మార్కెట్‌ 2023 వేదికైంది. 2024లోనూ ఇవే కొనసాగుతాయా? అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు.

గేటెడ్‌కు ప్రాధాన్యం.. : ఇల్లు కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది గేటెడ్‌ కమ్యూనిటీలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. పిల్లలు, ఇంట్లో పెద్దలందరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ కమ్యూనిటీలోనే అందుబాటులో ఉంటాయనే ఉద్దేశంతో వీటికి మొగ్గు చూపుతున్నారు. మొదట్లో ఐటీ కారిడార్‌లోనే ఈ తరహా ప్రాజెక్ట్‌లు ఎక్కువగా అందుబాటులో ఉండగా... ఇప్పుడు సిటీకి అన్నివైపులా.. అన్ని ప్రాంతాల్లోనూ కడుతున్నారు. వీటిలో ఇంటి ధర సాధారణ అపార్ట్‌మెంట్‌, వ్యక్తిగత ఇళ్లతో పోలిస్తే 30 శాతం వరకు అధికంగా ధర ఉంటోంది. అయినా సరే రాజీపడటం లేదు. 2024 లోనూ ఇదే పోకడ కొనసాగనుందని బిల్డర్లు చెబుతున్నారు.

3 బీహెచ్‌కే... : కొవిడ్‌ తర్వాత విశాలమైన ఇళ్ల కోసం కొనుగోలుదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. అవసరమైనప్పుడు ఇంటి నుంచి పనిచేసేందుకు వీలుగా ఒక గది ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో తక్కువలో తక్కువ 3 పడక గదుల ఫ్లాట్‌, విల్లా కోసం చూస్తున్నారు. కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను పూర్తిగా 3 బీహెచ్‌కేతో చేపడుతుండటం మార్కెట్‌ పోకడను సూచిస్తోంది. ఈ ఏడాది కూడా ఇది కొనసాగుతుంది.

విల్లామెంట్‌లు.. : గత ఏడాది నుంచి సిటీలో విల్లామెంట్‌, స్కైవిల్లాల సంస్కృతి పెరిగింది. సిటీకి ఎక్కడో దూరంగా విల్లాల కొనుగోలు బదులు.. నగరం నడిబొడ్డున ఆకాశహర్మ్యాల్లోని పైఅంతస్తుల్లో విశాలంగా, విలాసంగా ఉండే డ్యూప్లెక్స్‌ల విల్లామెంట్‌లు, స్కైవిల్లాల కొనుగోలుకు ఇష్టపడుతున్నారు. ఈ తరహా వినియోగదారుల కోసం ఒక ఫ్లాట్‌ను 5వేల నుంచి 15 వేల విస్తీర్ణంలోనూ నిర్మిస్తున్న సంస్థలు సిటీలో ఉన్నాయి. ఒక ఫ్లోర్‌లో ఒకటే ఫ్లాట్‌ ఉండేలా వీటిని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఇది మరిన్ని ప్రాంతాలకు సిటీలో విస్తరించే అవకాశం ఉంది. ప్రీమియం మార్కెట్‌దే ఈ ఏడాది హవా అని నిర్మాణదారులు అంచనా వేస్తున్నారు. ‘నగరంలో ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీలు గణనీయంగా ఏర్పాటవుతున్నాయి. దీంతో పెద్ద అపార్ట్‌మెంట్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. కొన్ని 10వేల చదరపు అడుగులకు మించి ఉంటున్నాయి. ఈ ధోరణి గతంలో లేదు. ఆధునిక, విలాసవంతమైన, విశాలమైన నివాసాల కోసం గృహ కొనుగోలుదారుల ఆకాంక్షలు పెరిగాయి. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠమైన, ప్రగతిశీల పథాన్ని బట్టి ఈ ధోరణి మరికొన్ని ఏళ్లు కొనసాగుతుందని అంచనా వేస్తున్నా’మని పౌలోమీ ఎస్టేట్స్‌ ఎండీ ప్రశాంత్‌రావు అన్నారు.

మరింత స్మార్ట్‌గా.. : నేటితరానికి అనుగుణంగా ఇళ్లు కూడా స్మార్ట్‌ అవుతున్నాయి. బిల్డర్లు ప్రయోగాత్మకంగా స్మార్ట్‌ హోమ్స్‌ నిర్మిస్తున్నారు. ఐవోటీ ఆధారంగా పనిచేసేలా విద్యుత్తు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఏర్పాటు చేసి కార్యాలయం నుంచి ఇంట్లోని ఉపకరణాలను ఆపరేట్‌ చేసేలా నిర్మించుకుంటున్నారు. ఇంట్లో దీపాలు, కర్టెన్లు, తలుపుల తాళం, ఫ్యాన్లు వెలగడం, అతిథులు వస్తే గుర్తించి తలుపు తీయడం, అపరిచితులు వస్తే అప్రమత్తం చేసేవరకు ఆటోమేషన్‌ చేస్తున్నారు. వీటికి మరిన్ని హంగులను ఎప్పటికప్పుడు జోడిస్తున్నారు. 2024లో ఈ పోకడ సిటీలో మరింత విస్తృతం కానుంది.

ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లు.. : కమ్యూనిటీలోని క్లబ్‌ హౌస్‌లలో సౌకర్యాలు కల్పించడంలో నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. అయిదారు సదుపాయాలతో మొదలై.. ఇప్పుడు 50 సౌకర్యాల వరకు విస్తరించాయి. అక్కడే క్రికెట్‌ మైదానం, గోల్ఫ్‌కోర్టులు, క్లినిక్‌ నుంచి 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు వరకు సౌకర్యాలు విస్తరిస్తున్నాయి. వీటితోపాటు ఇటీవల వస్తున్న విద్యుత్తు వాహనాలకు అనుగుణంగా పార్కింగ్‌ ప్రదేశాల్లో ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లను కల్పించడం మొదలెంది. ఇందులో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ మరిన్ని నిర్మాణాల్లోనూ ఈవీ పాయింట్లు విస్తరించనున్నాయి. సెల్లార్లలో ఈవీ పాయింట్లు ప్రమాదాలకు దారితీస్తే అవకాశం ఉండటంతో పోడియం పార్కింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. ఈ పోకడ మరింత విస్తృతం అయ్యే అవకాశం ఉంది.

హరిత గృహాలు..: పర్యావరణ హితంగా నిర్మించే హరిత గృహ ప్రాజెక్ట్‌లు ఈ ఏడాది మరింతగా పెరగనున్నాయి. నెట్‌ జీరో ఎనర్జీ భవనాలు రానున్నాయి. నిర్మాణ వ్యయం స్వల్పంగా పెరిగినా.. నీటి, విద్యుత్తు ఆదాతో పర్యావరణానికి, అందులో నివసించేవారు ఆరోగ్యంగా ఉండటమే కాదు ఉత్పాదకత పెరగడం వరకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీటిపై కొనుగోలుదారుల్లో అవగాహన పెరగడంతో ఐజీబీసీ రేటింగ్‌ కల్గిన ప్రాజెక్టుల్లో గృహాలను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. కంపెనీలు సైతం హరిత భవనాలనే లీజుకు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

స్టూడెంట్‌ హౌసింగ్‌..: విద్యార్థులు, బ్రహ్మచారులకు నగరంలో ఇల్లు దొరకడం గగనంగా ఉంది. సౌకర్యాలు, భద్రత లేని హాస్టల్స్‌నే ఉంటున్నారు. ఇంకొందరు బృందంగా ఏర్పడి అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. విదేశాల్లో అయితే.. చదువుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, ఒంటరిగా ఉంటూ ఉద్యోగం చేసేవాళ్ల కోసం స్టూడెంట్‌ హౌస్‌లు ఉంటాయి. మన దగ్గర 2024లో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. శంషాబాద్‌లో ఈ తరహా నిర్మాణాలను ఇదివరకే ప్రారంభించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని