సొంతింటికి గ్రిడ్‌

హైదరాబాద్‌ మహా నగరానికి బాహ్యవలయ రహదారిని జీవనాడిగా చెబుతుంటారు.

Updated : 02 Mar 2024 06:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహా నగరానికి బాహ్యవలయ రహదారిని జీవనాడిగా చెబుతుంటారు. జనావాసాలు సైతం ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరించాయి. రాబోయే రోజుల్లో మరిన్ని నిర్మాణాలు ఓఆర్‌ఆర్‌ చుట్టుపక్కల రాబోతున్నాయి. ఇప్పటికీ ఇక్కడ పెద్ద ఎత్తున భూములు అందుబాటులో ఉన్నాయి. రహదారికి ఇరువైపుల మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్న గ్రోత్‌కారిడార్‌లో గ్రిడ్‌ రోడ్‌లను వేస్తే పెద్ద ఎత్తున గృహ నిర్మాణానికి ఆస్కారం ఉంటుందని.. ఫలితంగా అన్నివర్గాలకు వారి బడ్జెట్‌లో ఇళ్లు దొరికే అవకాశం ఉంటుందని నిర్మాణ సంఘాలు ఎంతోకాలంగా కోరుతున్నాయి. కొత్త ప్రభుత్వమైనా గ్రిడ్‌ రోడ్లపై దృష్టి సారించాలని అంటున్నాయి.

భవిష్యత్తు అవసరాల కోసం సిటీకి నలబై యాభై కిలోమీటర్ల దూరంలో ప్రాంతీయ వలయ రహదారి(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణం అవసరమే అయినా.. అంతకంటే ముందు గ్రిడ్‌ రహదారుల అంశంపై సర్కారు నిర్ణయం తీసుకోవాలని నిర్మాణ సంస్థలు కోరుతున్నాయి. ప్రభుత్వం వేయడమో.. ప్రైవేటు సంస్థలు వేసేలా ప్రోత్సహించడమో చేయాలని చెబుతున్నాయి. ప్రస్తుతం లేఅవుట్లు వేస్తున్న సంస్థలు వీటిని అభివృద్ధి చేస్తున్నాయి. ఎవరికి వారు రోడ్లు వేస్తుండటంతో లింకులు ఉండటం లేదు. ప్రభుత్వమే వేస్తే ఏకరూపంగా ఉండి ప్రణాళికబద్ధంగా అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. ఎలా ఉండాలనే దానిపై సర్కారు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

ఇప్పుడిలా.. : ఓఆర్‌ఆర్‌ వెంట రెండు వరసల సర్వీస్‌ రహదారులు, కాలిబాటలు నిర్మించారు. సర్వీస్‌ రోడ్డు తర్వాత 50అడుగుల మేర బఫర్‌జోన్‌గా నిర్ణయించారు. ఈ స్థలాన్ని ఖాళీగా వదిలేయడం, పచ్చదనం పెంచడం మినహా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హెచ్‌ఎండీఏ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్తు స్తంభాలు, ప్రకటనల బోర్డులు పెట్టడానికి వీల్లేదని.. ఓఆర్‌ఆర్‌ పక్కనున్న పొలాల నుంచి నేరుగా సర్వీస్‌రోడ్డు మీదకు రావొద్దనే ఆంక్షలు ఉన్నాయి. వాస్తవంగా చూస్తే బఫర్‌జోన్‌లోనే పెద్ద ఎత్తున నిర్మాణాలు వచ్చాయి. లేఅవుట్లు వేశారు. కొన్ని సంస్థలు మాత్రం మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం బఫర్‌ జోన్‌ వదిలి రహదారి వేశాయి. అప్రోచ్‌ రహదారి లేనిచోట తప్పని పరిస్థితుల్లో వీటిని వేశారు. మరికొన్ని సంస్థలు రహదారి వేయాల్సిన చోట ఖాళీగా భూములను వదిలిపెట్టాయి. భవిష్యత్తులో ఇక్కడ 100 అడుగుల రహదారి వస్తుందని చెబుతున్నాయి. ఈ తరహాలోనే ఎక్కువ వెంచర్లు వచ్చాయి. ఇప్పుడు అక్కడ నిర్మాణాలు వస్తున్నాయి.

ఒక పాలసీ కావాలి..
జి.వి.రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌

నగరం నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు పలు రేడియల్‌ రహదారులను వేశారు. ఇటీవల కాలంలో కొన్ని కొత్తవి అందుబాటులోకి వచ్చాయి. కానీ, ఓఆర్‌ఆర్‌ పక్కనే ఉన్న భూముల నుంచి ప్రధాన రహదారి, సర్వీస్‌ రహదారికి చేరుకునేందుకు సరైన రోడ్లు లేవు. ఇందుకోసమే ఓఆర్‌ఆర్‌కు అటు ఇటు గ్రిడ్‌ రోడ్లు ప్రతిపాదించారు. గ్రిడ్‌ రోడ్డు వేయాలంటే భూమిని సేకరించాల్సి ఉంటుంది. నిధుల సమస్య, ఇతరత్రా కారణాలతో వీటిని సర్కారు చేపట్టలేదు. రెండు మూడు రకాల సూచనలను గతంలోనూ ప్రభుత్వానికి ఇచ్చాం. బపర్‌జోన్‌గా ప్రకటించిన 15 మీటర్లలో.. 9 మీటర్లలో రహదారిని, మిగతాది బఫర్‌గా ఉంచాలని సూచించాం. రైతుల నుంచి భూసేకరణతో రహదారి వేయాలంటే చాలా సమస్యలు కాబట్టి.. ఒక ప్రత్యేక సంస్థ(ఎస్‌పీవీ)ను ఏర్పాటు చేసి.. ఫైనాన్స్‌ సంస్థతో అనుసంధానం చేస్తే.. రైతులు నష్టపోకుండా, ప్రభుత్వంపై భారం పడకుండా గ్రిడ్‌ రహదారులను వేయవచ్చు. ఇలా చేస్తే అభివృద్ధి ప్రణాళికబద్ధంగా ఉంటుంది. ఈ రెండూ కాకపోతే అక్కడ అభివృద్ధి చేస్తున్న సంస్థనే గ్రిడ్‌ రోడ్డు వేసేలా ప్రోత్సహించవచ్చు. ఇందుకోసం సర్కారు ఒక పాలసీని తీసుకోస్తే మంచిది. దీంతో సరసమైన ఇళ్ల నిర్మాణానికి భూ లభ్యత పెరుగుతుంది.


పిల్లల సంరక్షణకు ప్రాధాన్యం

ఇల్లు కొనుగోలు చేసే గేటెడ్‌ కమ్యూనిటీలో పిల్లల సంరక్షణకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయనేది కొనుగోలుదారులు చూస్తున్న ప్రధాన అంశాల్లో ఒకటి. సొసైటీలో క్రెచ్‌ ఉండాలని 85.40 % మంది కోరుకుంటున్నారు. ఒక నిర్మాణ సంస్థ చేపట్టిన అధ్యయనం ప్రకారం..
42% అవుట్‌డోర్‌ రిక్రియేషన్‌
32% డే కేర్‌ సేవలు
26% ఇండోర్‌ క్రియేటివ్‌ జోన్‌
11% అకడమిక్‌ గైడెన్స్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని