నిర్మాణ ప్రదేశాల్లో పెరగాలి భద్రతా ప్రమాణాలు

వ్యవసాయం తర్వాత అత్యధిక మంది ఉపాధి పొందుతున్నది నిర్మాణ రంగంలోనే. అదే సమయంలో ఎక్కువ మంది ప్రమాదాల బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. గత 5ఏళ్లలో దేశవ్యాప్తంగా 3.80 లక్షల సంఘటనలు జరిగాయి.

Published : 09 Mar 2024 00:18 IST

దేశంలో ఐదేళ్లలో 3.80 లక్షల ప్రమాదాలు
ఈనాడు, హైదరాబాద్‌

వ్యవసాయం తర్వాత అత్యధిక మంది ఉపాధి పొందుతున్నది నిర్మాణ రంగంలోనే. అదే సమయంలో ఎక్కువ మంది ప్రమాదాల బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. గత 5ఏళ్లలో దేశవ్యాప్తంగా 3.80 లక్షల సంఘటనలు జరిగాయి. వీటిని విశ్లేషిస్తే 90 శాతం ఘటనల్లో ప్రధానంగా మానవ తప్పిదాలు, పనిలో నిర్లక్ష్యం, అవగాహన లేమి ప్రమాదాలకు కారణాలుగా గుర్తించారు. సమస్య మూలాలను గుర్తించి నిర్మాణ ప్రాంతాల్లో భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతుంది. రక్షణ చర్యలను బలోపేతం చేయడం, ఇప్పటివరకు అనుసరిస్తున్న సంస్థల ఉత్తమ మార్గాలను ఇతరులు ఆచరించేలా చూడటంతో పాటూ పలు సిఫార్సులను సీబీఆర్‌ఐ నివేదికలో చర్చించింది. ప్రాజెక్ట్‌ల అంతటా కార్మికుల ఆరోగ్యం, భద్రతా వ్యూహాలను అంచనా వేయడానికి లాస్ట్‌ టైమ్‌ ఇన్సిడెంట్‌ రేట్‌(ఎల్‌టీఐఆర్‌), టోటల్‌ రికార్డబుల్‌ ఇన్సిడెంట్‌ రేట్‌(టీఆర్‌ఐఆర్‌) వంటి ప్రామాణిక కొలమానాలను స్వీకరించాలని నివేదిక సూచించింది. తద్వారా పరిశ్రమ వ్యాప్తంగా భద్రతా ప్రమాణాలు పెరగడానికి దోహదం చేస్తుందని వెల్లడించింది.  

రియల్‌ ఎస్టేట్‌లో గృహ నిర్మాణంతో పాటూ వాణిజ్య, గోదాములు, రిటైల్‌ ప్రాజెక్ట్‌ల వంటి వేర్వేరు విభాగాలు ఉన్నాయి. ప్రమాద ఘటనలు అత్యధికంగా గృహ నిర్మాణంలోనే జరుగుతున్నాయి. రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌లోనే 635 ప్రమాదాలు జరిగితే రిటైల్‌లో అత్యల్పంగా 60 ఘటనలు నమోదయ్యాయి. పారిశ్రామిక, గిడ్డంగుల ప్రాజెక్ట్‌లో 405 సంఘటనలు రికార్డవ్వగా.. కార్యాలయాల ప్రాజెక్ట్‌లో 160, ఇతర విభాగాల్లో 259 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటిని అరికట్టేందుకు భాగస్వామ్యులందరి తోడ్పాటు అవసరం.


అందరి భాగస్వామ్యంతో..

నిర్మాణ పనులు చేసే కార్మికులు మొదలు ఇంజినీర్లు, ఆర్కిటెక్చర్లు, డిజైనర్లు, గుత్తేదారులు, నియంత్రణ సంస్థలు, ఇతర భాగస్వామ్యులందరూ ప్రమాదాల నివారణకు, సురక్షితమైన పని వాతావరణం కోసం తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది.

  • సిబ్బందికి సమగ్రమైన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మరీ ముఖ్యం. హఠాత్తుగా ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన నైపుణ్యాలను కార్మికుల్లో పెంపొందించాలి. పెద్ద సంస్థలు స్వల్పకాలం పాటూ శిక్షణ ఇచ్చిన తర్వాతనే పనులు అప్పగిస్తున్నప్పటికీ శిక్షణ మరింత పెంచాల్సి ఉంది.
  • కింది నుంచి పై స్థాయి వరకు భద్రతా ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా పాటించేలా చూడాలి. తరచూ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.

సాంకేతికతతో...

సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా ముఖ్యంగా కృత్రిమ మేథ, రోబోటిక్స్‌తో కార్మికుల భద్రత పెంచే చర్యలను ఆచరించవచ్చు. ప్రతిస్థాయిలో భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలి. ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతికత మార్పులను అందిపుచ్చుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని